మూడో టెస్టు, డే1: ధావన్ సెంచరీ, తడబడిన భారత్ 329/6

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా 1, వృద్ధిమాన్ సాహా 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టులో శిఖర్ ధావన్ (119) సెంచరీతో మెరిశాడు. ఇక కేఎల్ రాహుల్ (85), పుజారా (8), రహానే()17, విరాట్ కోహ్లీ(42), అశ్విన్(31) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో పుష్పకుమారా 3 వికెట్లు తీయగా, సందకన్‌ రెండు, ఫెర్నాడో ఒక వికెట్ తీశారు.

కోహ్లీ అవుట్: హాఫ్ సెంచరీ మిస్
శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత మిడిలార్డర్ తడబడుతోంది. 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కెప్టెన్ కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు. ఇన్నింగ్స్ 79 ఓవర్‌లో సందకన్‌ వేసిన ఓవర్‌లో స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కరుణరత్నెకి క్యాచ్ ఇచ్చి కోహ్లీ వెనుదిరిగాడు. దీంతో 81 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. ప్రస్తుతం రవిచంద్రన్‌ అశ్విన్‌ 19, వృద్ధిమాన్‌ సాహా 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Virat Kohli

రహానే రూపంలో నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 48 బంతుల్లో 17 పరుగులు చేసిన రహానే... పుష్పకుమార్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. రహానే అవుటైన తర్వాత క్రీజులోకి రవిచంద్రన్‌ అశ్విన్‌ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 70 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది.

వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా
తొలి సెషన్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టీమిండియా రెండో సెషన్‌లో తడబడుతోంది. స్వల్ప వ్యవధిలోనే ధావన్‌, పుజారా వికెట్లను కోల్పోయింది. సెంచరీ చేసిన ధావన్‌ 119 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.
48వ ఓవర్లో పుష్పకుమారా వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న ధావన్‌(119) చండీమాల్‌కి క్యాచ్‌ ఇచ్చాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీతో కలిసి పుజారా ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నించాడు. అయితే ఇన్నింగ్స్ 51వ ఓవర్లో సందకన్‌ వేసిన బంతిని ఎదుర్కొన్న పుజారా 8 పరుగుల వద్ద స్లిప్‌లో ఉన్న మాథ్యూస్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. పుజారా అవుటైన తర్వాత క్రీజులోకి రహానే వచ్చాడు.

దీంతో 53 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 10, రహానే 1 పరుగుతో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో పుష్పకుమారా 2 వికెట్లు తీయగా, సందకన్‌కి ఒక వికెట్‌ తీశాడు.

శిఖర్ ధావన్ సెంచరీ
మూడో టెస్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో చెలరేగాడు. 107 బంతులను ఎదుర్కొన్న ధావన్ 15 ఫోర్ల సాయంతో సెంచరీని పూర్తి చేశాడు. 41.2వ ఓవర్లో పుష్పకుమారా వేసిన బంతిని ఫోర్‌గా మలిచి సెంచరీని నమోదు చేశాడు. టెస్టుల్లో ధావన్‌కి ఇది ఆరో సెంచరీ.

దీంతో శ్రీలంక గడ్డపై మూడు సెంచరీలు సాధించిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా ధావన్ నిలిచాడు. అంతుకు ముందు సెహ్వాగ్‌, పుజారా 3 సెంచరీలు సాధించారు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ శ్రీలంక గడ్డపై అత్యధికంగా ఐదు సెంచరీలు సాధించి భారత్‌ తరఫున అగ్రస్థానంలో నిలిచాడు.

సెంచరీ అనంతరం హెల్మెట్‌, గ్లౌజులు తొలగించి డ్రస్సింగ్‌ రూమ్‌లో కూర్చున్న సహచర ఆటగాళ్ల వైపు విక్టరీ సింబల్‌ని చూపిస్తూ ధావన్‌ సందడి చేశాడు. పాండ్యా, కోహ్లీతో పాటు మిగతా ఆటగాళ్లు చప్పట్లు కొడుతూ ధావన్‌ను అభినందించారు. ఈ సిరీస్‌లో ధావన్‌కి ఇది రెండో సెంచరీ. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో అతను 190 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.

ఎల్ రాహుల్ అవుట్: సెంచరీ మిస్ 
ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ 85 పరుగుల వద్ద పుష్పకుమార బౌలింగ్‌లో కరుణరత్నేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 135 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. దీంతో రాహుల్ తన సెంచరీని మిస్ చేసుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 188 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కేఎల్ రాహుల్ అవుటైన తర్వాత పుజారా క్రీజులోకి వచ్చాడు. 45 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ వికెట్‌ నష్టానికి 211 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ధావన్‌ 116, పుజారా 2 పరుగులతో ఉన్నారు.

లంచ్ విరామానికి టీమిండియా 134/0

పల్లెకెలె వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా లంచ్ విరామానికి వికెట్ నష్టపోకుండా 134 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్లు శిఖర్ ధావన్ 64, కేఎల్ రాహుల్ 67 పరుగులతో ఉన్నారు.

ధావ‌న్‌, రాహుల్ హాఫ్ సెంచ‌రీలు
లంకతో జరుగుతున్న మూడో టెస్టులో భారత ఓపెనర్లు ధావ‌న్‌, రాహుల్‌లు హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. భార‌త్ 22 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 114 పరుగులు చేసింది. ప్రస్తుతం ధావ‌న్ 57, రాహుల్ 54 ర‌న్స్‌తో క్రీజులో ఉన్నారు. రాహుల్‌కు ఇది వ‌రుస‌గా ఏడ‌వ హాఫ్ సెంచ‌రీ కావ‌డం విశేషం.

17.4వ ఓవర్లో లాహిరు కుమారా వేసిన బంతిని ఫోర్‌గా మలిచిన ధావన్‌ 50 పరుగులు పూర్తి చేశాడు. ధావన్‌కు టెస్టు కెరీర్లో ఇది నాలుగో హాఫ్ సెంచరీ. అనంతరం 19.4వ ఓవర్లో లాహిరు కుమారా బౌలింగ్‌లోనే మరో ఓపెనర్‌ రాహుల్‌ కూడా 50 పరుగులు పూర్తి చేశాడు.

తొలి సెషన్‌లోనే ఇద్దరు ఓపెనర్లు ఇచ్చిన క్యాచ్‌లను శ్రీలంక ఆటగాళ్లు అందుకోలేకపోయారు. దీంతో తృటిలో అవుటయ్యే ప్రమదం నుంచి తప్పించుకున్న ధావన్‌, రాహుల్‌ తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మూడ‌వ టెస్టులో ఇద్ద‌రూ దూకుడుగా ఆడుతున్నారు.

బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ, జడేజా స్థానంలో కుల్దీప్

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన మూడో టెస్టు పల్లెకెలె వేదికగా శనివారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. మంచి బ్యాటింగ్ కండిషన్స్‌ను ఉపయోగించు కోవాలనుకుంటున్నామని టాస్ గెలిచిన అనంతరం కోహ్లీ తెలిపాడు.

మూడో టెస్టులో సస్పెన్షన్‌కు గురైన అల్ రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక శ్రీలంక కెప్టెన్ దినేష్ చండిమాల్ మాట్లాడుతూ తాము కూడా మొదట బ్యాటింగ్ చేయాలనే అనుకున్నామని అన్నాడు.

India vs Sri Lanka Live Score, 3rd Test, Day 1: Kohli elects to bat first; Kuldeep in for Jadeja

శ్రీలంక జట్టులో కూడా మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. లక్ష్మణ్‌ సందాకన్‌, కుమారా, ఫెర్నాండో తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన విజయం సాధిస్తే విదేశాల్లో మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా నిలుస్తుంది.

భారత జట్టు తన 85 ఏళ్ల టెస్టు చరిత్రలో విదేశాల్లో మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన దాఖలాలు లేవు. ఆ రికార్డును ఇప్పుడు కోహ్లీసేన తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు 304 పరుగుల తేడాతో విజయం సాధించగా, కొలంబోలో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. దీంతో మూడు టెస్టుల సిరిస్‌లో ఇంకో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరిస్‌ను కైవసం చేసుకుంది.

జట్లు:

భారత్: విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, చటేశ్వర పుజారా, అజింక్యా రహానే, రవిచంద్రన్ అశ్విన్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మొహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్

India vs Sri Lanka : Kapil Dev Praises Team India's Pacers

శ్రీలంక: దినేష్ చండీమాల్(కెప్టెన్), దిముత్ కరుణరత్నే,ఉపుల్ తరంగా, కుశాల్ మెండిస్, మాథ్యూస్, నిరోషాన్ డిక్ వెల్లా(వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, దిల్రువాన్ పెరీరా, రంగనా హెరాత్, మలిందా పుష్పకుమార, నువాన్ ప్రదీప్

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India skipper Virat Kohli on Saturday (August 12) won his third toss in a row and elected to bat against Sri Lanka in the third and final Test here in Kandy. India have brought in chinaman Kuldeep Yadav in place of suspended Ravindra Jadeja in their playing XI at the Pallekele International Cricket Stadium.
Please Wait while comments are loading...