ముంబైకి షాక్: శాశ్వత హోదా రద్దు, బీసీసీఐ ఓటర్లుగా ఈశాన్య రాష్ట్రాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అందరూ ఊహించినట్లుగానే జస్టిస్ లోధా కమిటీ సిఫారసులను అమలు చేయడంలో బీసీసీఐ పరిపాలన కమిటీ (సీఓఏ) వేగం పెంచింది. బీసీసీఐకి సంబంధించి కొత్త రాజ్యాంగాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఒక రాష్ట్రం, ఒక ఓటుకు తొలి అడుగు వేసింది. దీంతో ముంబై క్రికెట్‌ అసోసియేషన్ (ఎంసీఏ) గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

41 సార్లు రంజీ చాంపియన్ అయిన ఎంసీఏ బీసీసీఐలో శాశ్వత ఓటు హక్కును కోల్పోయింది. ఒక రాష్ట్రానికి ఒకే ఓటు ఉండాలన్న లోధా కమిటీ సిఫారసును బీసీసీఐలో అమలు చేయడంతో ఎంసీఏ తన ఓటు హక్కు కోల్పోయింది. రాష్ట్రంలో ఎన్ని సంఘాలు ఉన్నా ఒక్కదానికి మాత్రమే పూర్తిస్థాయి సభ్యత్వం ఉంటుందని సీవోఏ స్పష్టం చేసింది.

మహారాష్ట్రలో ప్రస్తుతం ముంబైతో పాటుగా మహారాష్ట్ర, విదర్భ క్రికెట్‌ సంఘాలున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు పూర్తిస్థాయి సభ్యత్వాన్ని ఇచ్చిన సీవోఏ ముంబై, విదర్భ సంఘాలను అసోసియేషన్లుగా గుర్తించింది. అయితే ఎంసీఏ ప్రతినిధులు బీసీసీఐ బోర్డు సర్వసభ్య సమావేశాలకు హాజరైనా ఓటు హక్కు మాత్రం ఉండదు.

ఎంసీఏకు ఎదురుదెబ్బ

ఎంసీఏకు ఎదురుదెబ్బ

అయితే రొటేషన్ పద్ధతి (ఒక్కో ఏడాదిలో ఒక్కరు చొప్పున)లో వీటికి ఓటింగ్‌లో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. మహారాష్ట్రతో పాటు మూడు సంఘాలు కలిగి ఉన్న గుజరాత్‌కు కూడా ఇదే ఫార్ములానే కొనసాగించారు. మరోవైపు లోధా కమిటీ సూచనల ప్రకారమే ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్‌, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింల్లోని క్రికెట్‌ సంఘాలకు శాశ్వత సభ్యత్వం కల్పించారు.

ఈశాన్య రాష్ట్రాలకు శాశ్వత సభ్యత్వం

ఈశాన్య రాష్ట్రాలకు శాశ్వత సభ్యత్వం

క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ), ఎన్‌సీసీ, రైల్వేస్, సర్వీసెస్, యూనివర్సిటీ సంఘాలకు సభ్యత్వం దక్కలేదు. ఇక మ్యాచ్‌ల సందర్భంగా అత్యంత అవినీతికి పాల్పడుతున్న హైదరాబాద్, ఢిల్లీ క్రికెట్ సంఘాలపై సీఓఏ ప్రత్యేక దృష్టిసారించింది. ఇక నుంచి బోర్డు అనుమతులు లేకుండా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని, రాష్ట్ర సంఘాలు తమ ప్రతినిధులుగా మరొకరికి ఓటు హక్కు కట్టబెట్టే విధానం కుదరదని చెప్పింది.

ఆఫీస్ బేరర్ల పదవీకాలంపై స్పష్టత

ఆఫీస్ బేరర్ల పదవీకాలంపై స్పష్టత

కాగా, కొత్త రాజ్యాంగం ప్రకారం ఆఫీస్ బేరర్ల పదవీకాలంపై కూడా సీఓఏ స్పష్టత ఇచ్చింది. ఇక నుంచి బీసీసీఐలోగానీ, రాష్ట్ర సంఘాల్లోగానీ ఎవరైనా గరిష్టంగా 9 ఏళ్ల కంటే ఎక్కువగా పదవుల్లో కొనసాగరాదని తేల్చి చెప్పింది. 9 మందితో కలిసి ఏపెక్స్ కౌన్సిల్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు సీఓఏ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

ఆరుగురు పూర్తిస్థాయి మేనేజర్లు

ఆరుగురు పూర్తిస్థాయి మేనేజర్లు

ఎన్నిక కాబడిన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారితో నలుగురు నామినేటెడ్ (కాగ్, క్రికెటర్ల ప్రతినిధులు, బీసీసీఐ ఫుల్ మెంబర్) సభ్యులు ఇందులో ఉంటారు. ఆరుగురు పూర్తిస్థాయి మేనేజర్లతో కలిసి సీఈవో రాహుల్ జోహ్రీ రోజువారి కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. జాతీయ సెలెక్షన్ కమిటీలో ఎలాంటి మార్పులు చేయని సీఓఏ చైర్మన్‌కు ఓటు హక్కును కల్పించింది.

కెప్టెన్ సమావేశాలకు హాజరైనా ఓటింగ్‌కు దూరమే

కెప్టెన్ సమావేశాలకు హాజరైనా ఓటింగ్‌కు దూరమే

టీమిండియా కెప్టెన్ సమావేశాలకు హాజరైనా ఓటింగ్‌కు దూరంగా ఉండాల్సిందే. 70 ఏళ్లు దాటిన వాళ్లు పదవులు చేపట్టరాదనే నిబంధనతో పాటు పదవుల మధ్య మూడేండ్ల కూలింగ్ పీరియడ్ ఉండాలని బీసీసీఐ కొత్త రాజ్యాంగంలో వెల్లడించింది. ఇక ఐసీసీలో అమల్లో ఉన్న ఆదాయ పంపిణీ విధానాన్ని మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీసీసీఐ.. ఐసీసీకి హెచ్చరిక చేస్తూ 11 పేజీల లేఖ రాసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Indian cricket's one-time power centre Mumbai has lost its permanent voting status as per the new constitution of the Indian Cricket Board finalized by the Committee of Administrators (COA) appointed by the Supreme Court of India.
Please Wait while comments are loading...