పుజారా మారథాన్ ఇన్నింగ్స్: ద్రవిడ్ రికార్డు బ్రేక్, సాహా సెంచరీ (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బోర్డర్-గవాస్కర్ సిరిస్‌లో భాగంగా రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా చెలరేగిపోయింది. తొలి రెండు రోజులు పెద్దగా ఆశలు లేని స్థితి నుంచి మ్యాచ్‌ను గెలిచే స్థాయికి చేరుకుంది.

11 గంటల పాటు క్రీజులో నిలిచి పుజారా (525 బంతుల్లో 21 ఫోర్లతో 202) మారథాన్‌ ఇన్నింగ్స్‌ ఫలితంగా టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 603/9 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. పుజారాకి ఇది మూడో డబుల్ సెంచరీ.

పుజారాకి తోడు సాహా (233 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 117) అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఏడో వికెట్‌కు వీరిద్దరి 199 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ భాగస్వామ్యమే మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

చివర్లో జడేజా (55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 నాటౌట్‌) మెరుపు అర్ధసెంచరీతో రాణించడంతో ఆతిథ్య జట్టుకు 152 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్‌ 210 ఓవర్లు బౌలింగ్‌ చేసినా భార‌త్‌ను ఆలౌట్‌ చేయలేకపోయింది.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 7.2 ఓవర్లలో 2 వికెట్లకు 23 పరుగులు చేసింది. వార్నర్ (14), లియాన్ (2) విఫలమయ్యారు. రెన్‌షా 7 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

చివరిరోజు ఆట మాత్రమే మిగిలున్న మ్యాచ్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 129 పరుగులు వెనుకబడి ఉంది. ఆసీస్ చేతిలో 8 వికెట్లు ఉన్నాయి.

360/6 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట

360/6 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట

360/6 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన పుజారా-సాహా ఆసీస్ బౌలర్లకు కఠిన పరీక్ష పెట్టారు. చాలా అప్రమత్తంగా ఆడుతూ సెషన్ మొత్తం వికెట్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేశారు. మధ్యలో ఒకటి, రెండుసార్లు అవుటయ్యే ప్రమాదాల నుంచి బయటపడ్డ ఈ జోడీ వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పుజారా 150 మార్కును చేరుకున్నాడు. లంచ్‌కు ముందు లియాన్‌ బౌలింగ్‌లో పుజారా ఎల్బీగా అవుటైనట్టు అంపైర్‌ తేల్చినా.. రివ్యూలో నాటౌట్‌గా తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

రివ్యూలో నాటౌట్

రివ్యూలో నాటౌట్

వాతావరణం మేఘావృతంగా ఉండటంతో ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో కొనసాగిన ఈ మ్యాచ్‌లో పుజారా అద్భుతంగా రాణించాడు. దాదాపు 8 గంటల 52 నిమిషాల పాటు ఓపికగా ఆడి 150 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 51 పరుగుల వద్ద సాహా ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ మిస్ చేశాడు. ఈ ఇద్దరి సమన్వయంతో భారత్ ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోయింది. 157 పరుగుల వద్ద లియాన్ బౌలింగ్‌లో పుజార దాదాపుగా ఎల్బీగా అవుటయ్యాడు.కానీ రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకిందని తేలడంతో రివ్యూలో నాటౌట్ అని తేలింది.

పుజారాకు లైఫ్ ఇచ్చిన స్మిత్

పుజారాకు లైఫ్ ఇచ్చిన స్మిత్

ఆ తర్వాతి ఓవర్‌లోనే ఒకీఫ్ బంతి పుజార బ్యాట్ ఎడ్జ్‌ను తాకి స్లిప్‌లోకి వెళ్లినా స్మిత్ అందుకోలేకపోయాడు. ఇక లంచ్ చివరి ఓవర్‌లో సాహా కొట్టిన స్వీప్ షాట్ క్యాచ్ కోసం ఆసీస్ రివ్యూకు వెళ్లి విఫలమైంది. దీంతో లంచ్ వరకు భారత్ స్కోరు 435/6కు చేరింది. లంచ్ తర్వాత కొత్త బంతి తీసుకున్న ఆసీస్ పేసర్లు కమ్మిన్స్-హాజెల్‌వుడ్ భారత జోడీపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఈ ఇద్దరు ఓపికగా బ్యాటింగ్ చేస్తూ చెత్త బంతులను మాత్రమే బౌండరీ లైన్ దాటించడంతో స్కోరు బోర్డు నిదానంగా ముందుకెళ్లింది. జోరు తగ్గించి డిఫెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన పుజారా.. సాహాకు బ్యాటింగ్ అవకాశం ఇచ్చాడు.

అదరగొట్టిన పుజారా-సాహా జోడీ

అదరగొట్టిన పుజారా-సాహా జోడీ

దీన్ని సద్వినియోగం చేసుకున్న వికెట్ కీపర్ మంచి ఆటతీరును కనబర్చాడు. తొలి సెషన్‌లో ఒకటి, రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డా.. ఈ సెషన్‌లో వాటిని పునరావృతం చేయలేదు. వికెట్ కోసం స్మిత్ పన్నిన ప్రతి వ్యూహాన్ని పుజారా-సాహా జంట సమర్థంగా తిప్పికొట్టడంతో ఈ సెషన్ కూడా వికెట్ లేకుండానే ముగిసింది. కనీసం స్పిన్నర్లకు కూడా పిచ్ నుంచి సహకారం లేకపోవడంతో సెషన్ ముగిసేసరికి భారత్ 52 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. సాహా 99, పుజారా 190 పరుగులతో టీ విరామానికి వెళ్లారు. టీ విరామం తర్వాత భారత్ ఆటగాళ్లు పలు రికార్డులు నమోదు చేశారు.

కెరీర్‌లో మూడో సెంచరీ నమోదు చేసిన సాహా

కెరీర్‌లో మూడో సెంచరీ నమోదు చేసిన సాహా

వచ్చీ రాగానే సాహా సింగిల్‌తో తన కెరీర్‌లో మూడో సెంచరీ నమోదు చేశాడు. ఈ ప్రదర్శనతో టెస్టు జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఇక రెండో ఎండ్‌లో 11 గంటల పాటు మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన పుజారా 521 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్‌కు ఇది మూడో డబుల్ సెంచరీ కావడం విశేషం. కెరీర్ మైలురాళ్లను సాధించిన తర్వాత ఈ ఇద్దరు వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పుజారా ఇన్నింగ్స్ 194వ ఓవర్‌లో లియాన్ వేసిన బంతిని భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో మ్యాక్స్‌వెల్ చేతికి క్యాచ్ ఇచ్చాడు.

ఏడో వికెట్‌కు 199 పరుగుల భాగస్వామ్యం

ఏడో వికెట్‌కు 199 పరుగుల భాగస్వామ్యం

దీంతో ఏడో వికెట్‌కు 199 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక జడేజా వచ్చిన వెంటనే పని మొదలుపెట్టినా.. రెండో ఎండ్‌లో సాహా పేలవమైన షాట్‌కు అవుటయ్యాడు. నాలుగు ఓవర్ల వ్యవధిలో ఈ ఇద్దరూ వెనుదిరగడంతో భారత్ 541 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. ఉమేశ్ (16) జతగా జడేజా ఆసీస్ స్పిన్నర్ల బౌలింగ్‌లో భారీ సిక్సర్లకు తెరలేపాడు. ఈ క్రమంలో 51 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసి.. తొమ్మిదో వికెట్‌కు 54 పరుగులు జోడించాడు. కానీ ఉమేశ్ ఎక్కువసేపు నిలబడకపోవడంతో అతను అవుటైన కొద్దిసేపటికే భారత్ తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

రాంచీ టెస్టులో పుజారా అరుదైన రికార్డు

రాంచీ టెస్టులో పుజారా అరుదైన రికార్డు

కాగా, రాంచీ టెస్టులో పుజారా అరుదైన రికార్డును సాధించాడు. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులను (525) ఎదుర్కొన్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. దీంతో తన గురువు రాహుల్ ద్రవిడ్ పేరు మీద ఉన్న రికార్డును పుజారా అధిగమించాడు. 2004లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో ద్రవిడ్ 495 బంతులను ఎదుర్కొని 270 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో పుజారా 525 బంతుల్లో 202 పరుగులు సాధించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Team India batsman Cheteshwar Pujara scored 202 runs off a marathon 525 deliveries and created the record of facing most balls in an innings by an Indian batsman.
Please Wait while comments are loading...