బ్రాండ్ విస్తరణ దిశగా షారుక్: కేప్‌టౌన్ ఫ్రాంఛైజీ కొనుగోలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రాంఛైజీకి బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సహా యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో టీ20 లీగ్‌లో అడుగుపెడుతున్నాడు. క్రికెట్ దక్షిణాఫ్రికా నిర్వహించనున్న గ్లోబల్‌ టీ20 లీగ్‌లో షారుఖ్‌ ఖాన్‌ ఓ ఫ్రాంఛైజీని కొనుగోలు చేశాడు.

ఈ లీగ్‌లో కేప్‌టౌన్‌ నైట్‌రైడర్స్‌ ఫ్రాంఛైజీని షారుఖ్‌ ఖాన్‌ కొన్నాడు. దక్షిణాఫ్రికా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ జేపీ డుమినిని ఈ ఫ్రాంఛైజీ ప్రధాన ఆటగాడిగా తీసుకుంది. ఈ లీగ్‌లో మొత్తం 8 జట్లు ఉన్నాయి. డర్బన్‌, బినాని, ప్రిటోరియా, స్టెలెన్‌బాష్‌, బ్లూఫాంటైన్‌, పోర్ట్‌ ఎలిజబెత్‌ కేంద్రాలుగా మిగతా ఆరు ఫ్రాంఛైజీలు లీగ్‌లో పాల్గొంటాయి.

 T20 Global League: Shah Rukh Khan now co-owns Cape Town Knight Riders

ఈ లీగ్ తొలి సీజన్‌ నవంబర్-డిసెంబర్‌లో ఆరంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా 10 దేశాలకు చెందిన 400 మంది ఆటగాళ్లను ఆగస్టు 19న వేలం నిర్వహించనున్నారు. కాగా, షారుఖ్‌కు కరీబియన్‌ టీ20 లీగ్‌లోనూ ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ పేరుతో ఓ జట్టు ఉన్న సంగతి తెలిసిందే.

మరోవైపు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ యాజమాన్య సంస్థ జీఎంఆర్‌ గ్రూప్‌ సైతం గ్లోబల్‌ టీ20 లీగ్‌లో ఓ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసింది. జొహానెస్‌బర్గ్‌ కేంద్రంగా నడిచే ఫ్రాంఛైజీని ఈ సంస్ధ కొనుగోలు చేసింది. ఈ ప్రాంఛైజీ పేసర్ రబాడను ప్రధాన ఆటగాడిగా ఎంచుకుంది.

టీ20 గ్లోబల్ లీగ్‌లో ప్రాంఛైజీని కొనుగోలు చేయడం పట్ల కోల్‌కతా నైట్ రైడర్స్ సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్ వెంకీ మైసూర్ మాట్లాడుతూ నైట్ రైడర్స్ బ్రాండ్‌ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడమే తమ లక్ష్యమని చెప్పాడు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ లీగ్ అభిమానులకు మద్దతు ఉంటుందని అన్నాడు.

ఇక కేప్ టౌన్ విషయానికి వస్తే వరల్డ్ క్లాస్ సిటీ అని, క్రికెట్‌ను ఎంతగానో ప్రేమించే అభిమానులు ఉంటారని తెలిపాడు. ఇక షారుక్ ఖాన్ సైతం ఈ లీగ్ పట్ల ఎంతో ఆతృతతో ఉన్నానని చెప్పుకొచ్చాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Shah Rukh Khan and the co-owners of Kolkata Knight Riders (KKR) and Trinbago Knight Riders (TKR) today (June 19) came together to own Cape Town Franchisee of T20 Global League, a Cricket South Africa (CSA) initiative.
Please Wait while comments are loading...