న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పన్నెండేళ్ల కష్టానికి ఫలితం: కంటతడి పెట్టిన సాక్షి మాలిక్

రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌ 2016లో భారత్‌కు తొలి పతకం అందించిన రెజ్లర్ సాక్షి మాలిక్ వెనక 12ఏళ్ల సుదీర్ఘమైన కఠోర శ్రమ దాగివుంది. కాగా, రాఖీ పండగ రోజున ఆమె పతకం తెచ్చి పండగకు మరింత శోభను తెచ్చింది. ఒక్క పతకం కావాలంటూ 125 కోట్ల మంది ప్రజలు వేచిచూస్తున్న తరుణంలో 24ఏళ్ల సాక్షి వారి కలను సాకారం చేసింది.

కోట్లాది భారతీయులకు 'కాంస్య పతకం'నే రాఖీగా అందించింది సాక్షి. దీంతో భారతీయులకు ఒకేరోజు రెండు పండుగలు చేసుకునే అవకాశం కల్పించినట్లయింది. ఒలింపిక్స్‌లో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంటే.. పతకం అందుకోవాలన్నది ఆమె కల. అందుకోసం ఎన్నో కష్టనష్టాలను దాటింది. అలుపెరగకుండా సాధన చేసింది.

థాంక్యూ సాక్షి: 'శోభాడే చెంప చెళ్లుమనిపించావ్'

హర్యానాలోని రొహ్‌తక్‌కు దగ్గర్లోని మోఖ్రా గ్రామం ఆమె స్వస్థలం. తనకి చిన్నప్పటి నుంచీ క్రీడలంటే ఆసక్తి. పదకొండేళ్ల వరకు చదువు, ఆట రెండింటినీ కొనసాగించింది. ఆ తర్వాత చదువు కొనసాగించడమా? లేక రెజ్లింగ్‌నే ఎన్నుకోవడమా? అనే ప్రశ్న ఎదురైంది. అయితే, ఎలాంటి సందేహం లేకుండా ఆమె రెజ్లింగ్‌ను ఎంపిక చేసుకుంది. కాగా, ఆమె మాటతో అమ్మ సుదేష్‌.. నాన్న సుఖ్‌బీర్‌ ఆశ్చర్యపోయారు.

'కుస్తీ(రెజ్లింగ్) అంటే మాటలు కాదు. చాలా కష్టపడాలి. దేహదాఢ్యం కావాలి. పోటీలో గాయాలు అవుతాయి' అని నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే, కూతురు పట్టుదలను గమనించి.. చివరకు ఆమెను ప్రోత్సహించేందుకు నిర్ణయించుకున్నారు.

Sakshi Malik

విమర్శలకు బెదరలేదు

పన్నెండేళ్ల వయస్సులో కోచ్ ఈశ్వర్‌ దహియా వద్ద శిక్షణకు చేరింది సాక్షి. ఆ క్రీడలో పట్టూ.. ఒడుపుల్ని నేర్చుకుంది. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో మెలకువల్ని అభ్యసించింది. అప్పటికి ఆమె ఉన్న ప్రాంతంలో కుస్తీ అబ్బాయిల క్రీడ మాత్రమే. ఆ ఆటను సాధన చేయాలన్నా.. సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలన్నా అబ్బాయిలతో పోటీ పడాల్సిందే. అలా తర్ఫీదు పొందుతున్న ఆమెకు స్థానికులూ.. బంధువుల నుంచి విమర్శలు, వెక్కిరింపులు ఎదురయ్యాయి.

ఆడపిల్లకు ఈ కుస్తీ పోటీలెందుకు? అని చాలామంది చులకనచేశారు. ఆ సమయంలో కోచ్‌ ఈశ్వర్‌ ఆమెకు ధైర్యం చెప్పి అండగా నిలిచారు. కోచ్ ప్రోత్సాహంతో స్థానిక పోటీల్లో విజయాలు సాధించడం మొదలుపెట్టింది. గెలిచిన ప్రతిసారీ 'బీట్‌ ద బెస్ట్‌' అనుకుంది. ఈ విజయాలు ఆమెకి అభినందనల్ని తెచ్చిపెట్టాయి. అంతేగాక, చులకన చేసిన వారే 'నీతో ఓ ఫొటో తీసుకుంటాం' అనే పరిస్థితిని తీసుకొచ్చారు.

ఒలింపిక్స్‌ పయతనం

అంతర్జాతీయ పోటీల్లో అడుగుపెట్టిన సాక్షికి ప్రారంభంలోనే విజయం వరించింది. 2010 జూనియర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకుంది. ఆ తర్వాత 2014 డేవ్‌ షుల్జ్‌ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో స్వర్ణం సాధించి సత్తా చాటింది.

అదే ఏడాది కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం గెలిచిన సాక్షికి ఒంపిక్స్‌లో పతకమే లక్ష్యమైంది. ఈ క్రమంలో ఆమె కఠోర సాధన చేసింది. 2015 ఆసియా రెజ్లింగ్‌ పోటీల్లో కాంస్యం సొంతమయ్యాక.. సమ్మర్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌కి సన్నద్ధమైంది. అందులో కాంస్యం నెగ్గి రియోలో పోటీలకి అర్హత సాధించింది.

రియోలో భారత్‌కు తొలి పతకం: సాక్షి మాలిక్ అసాధారణ పోరాటంరియోలో భారత్‌కు తొలి పతకం: సాక్షి మాలిక్ అసాధారణ పోరాటం

రియోలో పడి లేచిన కెరటంలా..

రియోలో 58 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో పోటీకి దిగిన సాక్షి మాలిక్‌ అసాధారణ పోరాటాన్ని ప్రదర్శించింది. తొలి రౌండ్‌లో జొహాన్న మాట్సన్‌ (స్వీడన్‌)తో తలపడ్డ సాక్షి 0-4తో వెనుకబడింది. కానీ, ఆఖరి పది సెకన్లలో ప్రత్యర్థిని రింగ్‌లోంచి బయటకు నెట్టేసి.. కింద పడేసి పాయింట్లు సాధిస్తూ 5-4తో విజయం సాధించింది.

ప్రిక్వార్టర్స్‌లో మరియానా చెర్దివరాతో హోరాహోరి పోరు సాగింది. ఇద్దరికీ 5-5 పాయింట్లు వచ్చాయి. కానీ ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయించిన సాక్షినే విజయం వరించింది. తర్వాత జరిగిన క్వార్టర్స్‌లో రష్యా ప్రత్యర్థి కోబ్లోవా చేతిలో ఓడిపోయింది. కోబ్లోవా ఫైనల్‌ చేరడంతో 'రెపిచేజ్‌' రౌండ్లలో తలపడే అవకాశం సాక్షికి లభించింది.

తొలి రౌండ్‌లో మంగోలియాకు చెందిన పురెవ్‌డోర్జిన్‌ ఓర్కాన్‌ని 12-3 తేడాతో ఓడించి.. కిర్గిజిస్థాన్‌కి చెందిన బెకావోతో తుది పోరుకు సిద్ధమైంది. బెకావో బలమైన ప్రత్యర్థి. 0-5తో ముందంజ వేసింది. ఇక పోటీ ముగిసిందనే అనుకున్నారంతా. చివరి క్షణాల్లో సాక్షి పడి లేచిన కెరటమైంది. వరుసగా 8 పాయింట్లు సాధించి చెకావోను మట్టి కరిపించింది. కాంస్యం సాధించి పతకాల పట్టికలో భారత్‌ని చేర్చింది.

కాగా, ఈ పోటీకి కొన్ని గంట ముందు 48 కేజీల (ఫ్రీస్టైల్‌) క్వార్టర్‌ ఫైనల్‌లో హర్యానాకి చెందిన వినేశ్‌ ఫోగట్‌తో పోటీ పడింది. వినేశ్‌... సాక్షికి మంచి స్నేహితురాలు. ఇద్దరిదీ ఒకే రాష్ట్రం.. ఒకే లక్ష్యం. పతకాన్ని సాధించాలన్న ఆశతో బరిలోకి దిగిన వినేశ్‌ పోటీలో తీవ్రంగా గాయపడింది. విలవిల్లాడుతున్న ఆమెను మోకాలు పక్కకు జరిగిందన్న అంచనాతో హుటాహుటిన స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత రెపిచేజ్‌ పోటీల్లో పాల్గొన్న సాక్షి మాలిక్‌ ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. చావో రేవో అన్నట్లు పోటీలో తలబడి భారత్‌కు తొలి పతకం అందించింది.

'రెజ్లింగ్‌లో పతకం గెలిచిన మెదటి భారతీయురాలిని నేనవుతానని ఎప్పుడూ అనుకోలేదు. పన్నెండేళ్లు పడ్డ కష్టానికి ఫలితం ఇది' అంటూ సంతోషంతో కన్నీటి పర్యంతమైంది. భారత్‌కు పతకం అందించి పతకం రాలేదని బాధను తీర్చడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపింది. భారత్‌కు మరిన్ని పతకాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X