వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ సంచలనం సృష్టించాడు. ఎనిమిదోసారి వింబుల్డన్‌ టైటిల్‌ గెలిచి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈ ప్రపంచ ఐదో ర్యాంకర్ 6-3, 6-1, 6-4తో ప్రపంచ ఆరో ర్యాంకర్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై నెగ్గి ఈ ఘనత సాధించాడు.

తద్వారా ప్రపంచ టెన్నిస్‌లో వింబుల్డన్ టైటిల్ గెలిచిన అతి పెద్ద వయస్కుడిగా ఆర్థర్‌ ఆషె (32 ఏళ్లు, 1976) రికార్డుని అధిగమించాడు. మరోవైపు పీట్ సంప్రాస్ (7 టైటిల్స్) రికార్డును అధిగమించాడు. మొత్తంగా స్విస్ ప్లేయర్‌కు ఇది 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. అంతేకాదు 1976 తర్వాత వింబుల్డన్‌లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా టైటిల్ నెగ్గిన తొలి ఆటగాడు ఫెదరర్.

1976లో జాన్‌ బోర్గ్‌ తొలిసారి ఇలా నెగ్గాడు. ఫైనల్లో సిలిచ్‌ ఏ దశలోనూ రోజర్‌కు పోటీ ఇవ్వలేకపోయాడు. అతను మూడు డబుల్‌ ఫాల్ట్స్‌, 23 అనవసర తప్పిదాలు చేశాడు. బలమైన ఏస్‌లు కొట్టడంలో దిట్ట అయిన సిలిచ్‌ ఐదు ఏస్‌లు, 16 విన్నర్లకే పరిమితంకాగా.. ఫెడెక్స్‌ 8 ఏస్‌లు, 23 విన్నర్లతో ఆకట్టుకున్నాడు.

ఉల్లాసంగా కనిపించిన ఫెదరర్

ఉల్లాసంగా కనిపించిన ఫెదరర్

తన కెరీర్‌లో 11వ వింబుల్డన్ ఫైనల్ ఆడుతున్న ఫెదరర్ (ఓవరాల్‌గా 29వ ఫైనల్) కోర్టులో చాలా ఉల్లాసంగా కనిపించాడు. భారీ ఏస్‌లు కొడతాడని పేరున్న సిలిచ్‌ను బేస్‌లైన్‌కు పరిమితం చేస్తూ తన రాకెట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. గంటా 41 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రోజర్ ఫెదరర్ ఎక్కడా తడబడలేదు.

సిలిచ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వని ఫెదరర్

సిలిచ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వని ఫెదరర్

మ్యాచ్‌ ఆరంభమైన తీరు చూస్తే హోరాహోరీ పోరు తప్పదేమో అనిపించింది. ఆరంభంలో సిలిచ్‌ అలవోకగా సర్వీసు నిలుపుకుంటే... ఫెదరర్‌ తడబడ్డాడు. తన తొలి రెండు సర్వీసు గేముల్లోనూ డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. నాలుగో గేమ్‌లో అతను ప్రత్యర్థికి బ్రేక్‌ అవకాశాన్ని ఇచ్చాడు. కానీ, సిలిచ్‌ రిటర్న్‌ నెట్‌కు తగలడంతో రోజర్‌ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మారిన్‌కు వచ్చిన ఏకైక బ్రేక్‌ చాన్స్‌ అదే. ఆపై, రోజర్‌ అతనికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తర్వాతి గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ను ఫెదరర్‌ బ్రేక్‌ చేశాడు. సిలిచ్‌ పోటీ అంతా నాలుగో గేమ్‌ వరకే సాగింది. ఐదో గేమ్‌లో అతడి సర్వీసును బ్రేక్‌ చేసిన ఫెదరర్‌ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.

తిరగబెట్టిన సిలిచ్ గాయం

తిరగబెట్టిన సిలిచ్ గాయం

కోర్టులో జారిపడడంతో సిలిచ్‌ కాలి పాదం గాయం తిరగబెట్టింది. దీంతో అతని ఆట గతితప్పింది. పెద్ద బ్యాండేజ్ కట్టించుకుని పెయిన్ కిల్లర్స్ తీసుకొని మళ్లీ కోర్టులోకి అడుగుపెట్టాడు. అయితే మునుపటిలాగా కోర్టులో చురుకుగా కదల్లేకపోవడంతో బలమైన ఏస్‌లు సంధించలేకపోయాడు. గత ఆరు రౌండ్లలో 130 ఏస్‌లు కొట్టిన సిలిచ్.. రెండో సెట్ ముగిసేసరికి రెండు ఏస్‌లకే పరిమితమయ్యాడు. దీంతో సర్వీస్‌ నిలబెట్టుకొన్న ఫెదరర్ 4-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కచ్చితమైన టైమింగ్‌, పవర్‌ఫుల్‌ బ్యాక్‌హ్యాండ్‌ రిటర్న్‌లు సంధించిన ఫెడెక్స్‌ నెట్‌ గేమ్‌, ర్యాలీల్లో అదరగొడుతూ సెట్‌ పాయింట్‌పై నిలవగా.. సిలిచ్‌ చేసిన డబుల్‌ ఫాల్ట్‌తో సెట్‌ నెగ్గాడు.

రెండో సెట్‌లో దూకుడు పెంచిన ఫెదరర్

ఇక, రెండో సెట్‌లో రోజర్‌ మరింత దూకుడు పెంచాడు. ఏస్‌తో తొలి పాయింట్‌ రాబట్టిన అతను.. సర్వీస్‌ విన్నర్‌తో మొదటి గేమ్‌ నెగ్గాడు. రెండో గేమ్‌లోనే బ్రేక్‌ సాధించిన మూడోసీడ్‌.. ఆపై మరో ఏస్‌తో సర్వీస్‌ నిలబె ట్టుకొని 3-0తో ముందంజ వేశాడు. ఓటమి ఖాయమని తెలిసి చేంజోవర్‌ టైమ్‌లో సిలిచ్‌ కోర్టుసైడ్‌లో ఉన్న కుర్చీలో కూర్చొని బాధతో కన్నీళ్లు పెట్టాడు. ముఖాన్ని టవల్‌తో కప్పి ఏడుస్తున్న అతణ్ణి ట్రెయినర్‌, డాక్టర్‌ ఓదార్చారు. తర్వాత సిలిచ్‌ ఒత్తిడిలో మరిన్ని తప్పిదాలకు పాల్పడ్డాడు. పేలవ బ్యాక్‌హ్యాండ్‌ షాట్లతో పాయింట్లు చేజార్చాడు. దీంతో ఫెదరర్ ఆరో గేమ్‌లో మరో బ్రేక్‌ సాధించాడు. ఆ వెంటనే తన సర్వీస్‌లో రెండో సెట్‌ను గెలుచుకున్నాడు.

మెడికల్‌ టైమ్‌

అవుట్‌ తీసుకున్న సిలిచ్‌ ఎడమ కాలి పాదానికి బ్యాండేజ్‌ కట్టుకున్నాడు. పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకుని నొప్పితోనే మూడోసెట్‌ను మొదలుపెట్టిన సిలిచ్.. ఆరు గేమ్‌ల వరకు బాగానే పోరాడాడు. సర్వీస్‌లను కాపాడుకుంటూ 3-3తో స్కోరును సమం చేశాడు. ఏడో గేమ్‌లో సర్వీస్‌ను చేజార్చుకోవడంతో గేమ్ 4-3తో ఫెదరర్ వైపు టర్న్ అయ్యింది. 9వ గేమ్‌లో మళ్లీ సర్వీస్‌ను నిలబెట్టుకున్నా అప్పటికే నష్టం జరిగిపోయింది. 8, 10వ గేమ్‌లో సర్వీస్‌ను కాపాడుకున్న ఫెదరర్ అద్భుతమైన ఏస్‌తో సెట్‌ను, వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Switzerland's Roger Federer defeated Croatia's Marin Cilic by 6-3, 6-1, 6-4 in the final to lift record eighth Wimbledon Tennis Championship title here on Sunday (July 16). Five years after his last Wimbledon triumph, the 35-year-old Federer captured a record eighth All England Club title without losing a single set in the tournament at the Centre Court.
Please Wait while comments are loading...