వింబుల్డన్ ఫైనల్: సంప్రాస్ రికార్డు బద్దలయ్యేనా?, అడుగు దూరంలో ఫెదరర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వింబుల్డన్‌లో రోజర్‌ ఫెదరర్‌ అదరగొట్టాడు. తనకెంతగానో కలిసొచ్చిన ఈ టోర్నీలో ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండానే ఫైనల్‌కు దూసుకొచ్చాడు. సెమీ ఫైనల్లో థామస్‌ బెర్డిచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌)ను ఓడించిన ఫెదరర్ ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

రోజర్‌ ఫెదరర్‌కు ఇది పదకొండో వింబుల్డన్‌ ఫైనల్‌ కావడం విశేషం. 1974లో కెన్‌ రోజ్‌వెల్‌ తర్వాత వింబుల్డన్‌లో ఫైనల్‌ చేరిన పెద్ద వయస్కుడిగా రోజర్ ఫెదరర్‌ (35 ఏళ్లు) ఘనత వహించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో మూడో సీడ్‌ ఫెడెక్స్‌ 7-6 (7/4), 7-6 (7/4), 6-4తో 11వ సీడ్‌ థామస్‌ బెర్డిచ్‌ (చెక్‌)పై ఘన విజయం సాధించాడు.

ఇక్కడ ఏడుసార్లు విజేతగా నిలిచిన రోజర్‌ తనను ఐదేళ్లుగా ఊరిస్తున్న ఎనిమిదో టైటిల్‌తో పీట్‌ సంప్రాస్‌ రికార్డును బద్దలు కొట్టేందుకు విజయం దూరంలో నిలిచాడు. రెండు గంటల 18 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ ఐదో గేమ్‌లో అద్భుతమైన ఏస్‌తో బ్రేక్‌ సాధించిన ఫెదరర్ ఆపై సర్వీస్‌ నిలబెట్టుకొని 4-2తో ఆధిక్యం సాధించాడు.

ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు

కానీ, డబుల్‌ ఫాల్ట్‌తో సర్వీస్‌ కోల్పోవడంతో స్కోరు 4-4తో సమమైంది. తర్వాత ఇద్దరూ చెరో గేమ్‌ నెగ్గడంతో సెట్‌ టై బ్రేక్‌కు దారి తీసింది. ఇందులో.. బెర్డిచ్‌ పదేపదే తప్పిదాలు చేయడంతో రోజర్‌ సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక, రెండో సెట్‌లోనూ ఫెదరర్‌కు చెక్‌ ప్లేయర్‌ బెర్డిచ్ గట్టి పోటీ ఇచ్చాడు. నాలుగో గేమ్‌లో అద్భుత పోరాటంతో బ్రేక్‌ పాయింట్‌ కాపాడుకున్న బెర్డిచ్‌, ఏడో గేమ్‌లో బ్రేక్‌ సాధించే చాన్స్‌ కోల్పోయాడు. ఫెదరర్ రెండు డబుల్‌ ఫాల్ట్స్‌, పలు తప్పిదాలు చేసినా కచ్చితమైన విన్నర్లు సంధించి ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ సెట్‌ కూడా టై బ్రేక్‌కు వెళ్లగా రోజర్‌ అందులోనూ సునాయాసంగా నెగ్గాడు.

బెర్డిచ్‌లో తడబాటు

ఇక మూడో సెట్లో రోజర్‌ ఇంకా స్వేచ్ఛగా ఆడాడు. అతని సర్వీసులు మరింత పదునెక్కాయి. దీనికి తోడు బెర్డిచ్‌లో తడబాటు ఎక్కువైంది. పదే పదే బంతిని నెట్‌కు కొట్టాడు. ఏడో గేమ్‌లో బెర్డిచ్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన ఫెదరర్‌ 4-3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత సర్వీస్‌ కాచుకుని 5-3తో సెట్‌ను గెలిచాడు. ఆ తర్వాత పదో గేమ్‌లో 40-15తో నిలిచిన ఫెదరర్‌.. తన సర్వీస్‌లో బెర్డిచ్‌ బంతిని నెట్‌కు కొట్టడంతో 6-4తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఫెదరర్‌ 13 ఏస్‌లతో పాటు, 53 విన్నర్లు కొట్టాడు.

తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించిన మారిన్‌ సిలిచ్‌

మరో సెమీ ఫైనల్‌లో పదకొండో ప్రయత్నంలో 28 ఏళ్ల మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా) తొలిసారి ఫైనల్లో ప్రవేశించాడు. 2 గంటల 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సామ్‌ క్వెరీ (అమెరికా) తొలి సెట్‌ కోల్పోయినా.. గొప్పగా పుంజుకున్న ఈ ఏడో సీడ్‌ 6-7 (6-8), 6-4, 7-6 (7-3), 7-5తో వరుసగా మూడు సెట్లు నెగ్గి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను 25 ఏస్‌లతో పాటు 70 విన్నర్లు కొట్టాడు. ఓపెన్‌ శకంలో వింబుల్డన్‌ ఫైనల్‌ చేరేందుకు ఎక్కువ ప్రయత్నాలు చేసిన ఘనత సిలిచ్‌ (11)దే. తన కెరీర్‌లో రెండోసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు అర్హత పొందాడు.

Wimbledon : Stanislas Wawrinka out of Wimbledon

రెండో క్రీడాకారుడిగా సిలిచ్‌ గుర్తింపు

2001లో గొరాన్‌ ఇవానిసెవిచ్‌ తర్వాత క్రొయేషియా నుంచి వింబుల్డన్‌ టోర్నీలో ఫైనల్‌కు చేరిన రెండో క్రీడాకారుడిగా సిలిచ్‌ గుర్తింపు పొందాడు. 2014లో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన సిలిచ్‌ తన కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై గురి పెట్టాడు. ‘నమ్మశక్యంగా లేదు. ఈ టోర్నీ ఆరంభం నుంచి నేను అద్భుతంగా ఆడాను. ఫెడరర్‌కు వింబుల్డన్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. అయితేనేం అతనితో పోరుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అతని సవాల్‌కు సిద్ధంగా ఉన్నాను' అని సిలిచ్‌ వ్యాఖ్యానించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Swiss tennis great Roger Federer eased into his eleventh Wimbledon tennis championships final after defeating Tomas Berdych by 7-6, 7-6, 6-4 in the semi-final on Friday (July 14). Third seed Federer defeated 11th seed Berdych in 2 hours and 18 minutes to set up summit clash with seventh seed Marin Cilic on Sunday (July 16).
Please Wait while comments are loading...