వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌: డ్రాలో సింధు, సైనాలకు 'బై'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో వరుసగా ఐదోసారి భారత్‌కు పతకం వచ్చేలా ఉంది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో 21న ప్రారంభం కానున్న ఈ టోర్నీ డ్రా వివరాలను బుధవారం ప్రకటించారు. ఈ డ్రాలో భారత ఏస్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, శ్రీకాంత్‌లకు తొలి రౌండ్‌లో బై లభించింది.

తొలిసారి భారత్‌ తరఫున సింగిల్స్‌ విభాగాల్లో ఏకంగా ఎనిమిది మంది బరిలోకి దిగనున్నారు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, అజయ్‌ జయరామ్, సమీర్‌ వర్మ... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్, రితూపర్ణ దాస్, తన్వీ లాడ్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

World Badminton Championships: Easy draw for Sindhu, Saina, Srikanth

ఈ టోర్నీలో రియో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు నాలుగో సీడ్‌గా బరిలోకి దిగుతుండగా, సైనా నెహ్వాల్ 12వ సీడ్‌గా బరిలోకి దిగుతుంది. వీరిద్దరికీ తొలి రౌండ్‌లో 'బై' లభించింది. రెండో రౌండ్‌లో సబ్రీనా జాక్వెట్‌ (స్విట్జర్లాండ్‌) లేదా నటాల్యా వోట్‌సెక్‌ (ఉక్రెయిన్‌)లతో సైనా... కిమ్‌ హో మిన్‌ (కొరియా) లేదా హదియా హోస్నీ (ఈజిప్ట్‌)లతో సింధు ఆడే చాన్స్‌ ఉంది.

క్వార్టర్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ సున్‌ యు (చైనా)తో సింధు, ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ సుంగ్‌ జీ హున్‌ (కొరియా)తో సైనా ఆడే అవకాశం ఉంది. ఈ టోర్నీలో సైనా, సింధు వేర్వేరు పార్శాల్లో ఉన్నందున కేవలం ఫైనల్లోనే ఎదురయ్యే అవకాశముంది. పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్‌గా పోటీపడనున్న శ్రీకాంత్‌ తొలి రౌండ్‌లో సెర్గీ సిరాంట్‌ (రష్యా)తో ఆడనున్నాడు.

ఇక రెండో రౌండ్‌లో లిన్‌ యు సియెన్‌ (చైనీస్‌ తైపీ) లేదా లుకాస్‌ కోర్వీ (ఫ్రాన్స్‌)లతో... ప్రిక్వార్టర్‌ ఫైనల్లో టామీ సుగియార్తో (ఇండోనేసియా) లేదా హు యున్‌ (హాంకాంగ్‌)లతో శ్రీకాంత్‌ తలపడే అవకాశం ఉంది. ఇక క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌కు టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ సన్‌ వాన్‌ హో (దక్షిణ కొరియా) ఎదురయ్యే అవకాశముంది.

ఈ టోర్నీలో శ్రీకాంత్ కాస్తంత మెరుగ్గా ఆడితే సెమీఫైనల్‌కు చేరుకోవడం కష్టమేమీ కాదు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్‌ వరకు చేరుకుంటే కనీసం కాంస్య పతకం వస్తుంది. పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు పతకం వచ్చి 34 ఏళ్లు అయింది. ఈ విభాగంలో భారత్‌కు లభించిన ఏకైక కాంస్య పతకాన్ని ప్రకాశ్‌ పదుకొనే (1983లో) అందించారు.

పురుషుల సింగిల్స్‌ ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో వీ నాన్‌ (హాంకాంగ్‌)తో 15వ సీడ్‌ సాయిప్రణీత్‌, లుకా వ్రాబెర్‌ (ఆస్ట్రియా)తో 13వ సీడ్‌ అజయ్‌ జయరామ్‌, పాబ్లో అబియాన్‌ (స్పెయిన్‌)తో సమీర్‌ వర్మ తలపడుతున్నారు. ఇక పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమిత్‌ రెడ్డి, సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి, మిక్స్‌డ్‌లో ప్రణవ్‌ జెర్రీ, చోప్రా-సిక్కిరెడ్డి జోడీలు పోటీపడనున్నాయి.

గత చివరి నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో భారత్‌కు నాలుగు పతకాలు వచ్చాయి. 2011లో మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడీ, 2013, 2014లలో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు కాంస్య పతకాలు సాధించగా... 2015లో మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ రజత పతకం సాధించింది.

ఇక ఒలింపిక్స్‌ పోటీలు జరిగిన ఏడాది మాత్రం వరల్డ్ చాంపియన్‌షిప్‌ను నిర్వహించరు. ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. మరోవైపు వరల్డ్ చాంపియన్‌షిప్‌కు గ్లాస్గో నగరం 1997 తర్వాత మళ్లీ ఆతిథ్యమిస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
With top shuttlers PV Sindhu, Saina Nehwal and Kidambi Srikanth assured of a safe passage till the quarter-finals, India can hope to bag a couple of medals at the World Championships which is to be held in Scotland from August 21. Unlike in the Olympics, a semi-final finish will assure the player at least a bronze medal at the Worlds.
Please Wait while comments are loading...