శవంతో కలిసి జీవనం .. కుళ్ళి కంపు కొడుతున్నా పట్టించుకోని కుటుంబం .. ఆ ఇంట్లో ఏం జరిగింది ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి ఆదిత్య నగర్ కాలనీలో ఓ ఇంట్లో 60 ఏళ్ల మహిళ మృతి చెందినా పట్టించుకోకుండా కుటుంబ సభ్యులు ఆ శవంతో కలిసే జీవనం సాగించారు . రోజుల తరబడి మృతదేహం ఇంట్లో ఉండడంతో శవం కుళ్లిపోయిన దుర్వాసన వస్తున్నా వారికి అదేమీ పట్టనట్టుగానే వ్యవహరించారు .ఇక కాలనీవాసులు ఆ దుర్వాసన భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్యంత భయానకమైన, విషాదకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.
పూజారి సజీవ దహనం .. దేవుడి మాన్యాల వివాదంలో ల్యాండ్ మాఫియా ఘాతుకం

శ్రీకాకుళం జిల్లాలో దారుణం .. మహిళ మృతి చెందినా పట్టించుకోని కుటుంబం
శ్రీకాకుళం రూరల్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పోలాకి సత్యనారాయణ అనే వ్యక్తి ఇరిగేషన్ శాఖలో అటెండర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు . ఆయనకు 60 సంవత్సరాల వయసున్న భార్య ఈశ్వరమ్మ, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరంతా ఆదిత్య నగర్ కాలనీ లోని తమ సొంత ఇంట్లో నివసిస్తున్నారు. ఎప్పుడూ ఇరుగుపొరుగు వారితో ఎలాంటి సంబంధం లేకుండా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే ఇటీవల సత్యనారాయణ భార్య ఈశ్వరమ్మ మరణించారు. ఆమె చనిపోయింది అన్న విషయాన్ని కూడా కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు.

శవం కుళ్ళి కంపు కొడుతున్న ఇళ్ళు చూసి షాక్ అయిన పోలీసులు
యధావిధిగా ఎవరి పని వారు చేసుకుంటూ ఏమీ జరగనట్టుగానే అదే ఇంట్లో ఉంటున్నారు. అయితే రోజులు గడిచే కొద్దీ శవం కుళ్ళి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇంటికి వెళ్ళి అక్కడి పరిస్థితులు చూసిన పోలీసులు షాక్ కు గురయ్యారు. ఈశ్వరమ్మ శవం మంచంపైన కుళ్లిపోయి కనిపించింది. ఇక ఇల్లంతా చెత్తా చెదారంతో నిండి ఉంది. ఆ ఇంట్లో నివసిస్తున్న వారంతా మతిస్థిమితం లేనట్లుగా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. అసలు వారు ఏం జరిగింది, ఈశ్వరమ్మ ఎలా చనిపోయింది అనే విషయాన్ని కూడా చెప్పలేకపోతున్నారు.

తిండి లేక మహిళ మృతి చెందినట్టు భావిస్తున్న పోలీసులు
ఇంట్లో అందరి మానసిక పరిస్థితి ఒకే విధంగా ఉండటం చూసిన పోలీసులు, ఈశ్వరమ్మ ఆహారం లేకపోవడం వల్ల చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. అసలు వీరందరి మానసిక స్థితి ఈ విధంగా మారడానికి గల కారణమేంటి? ఆ ఇంట్లో ఏం జరిగింది? ఈశ్వరమ్మ ఎలా మృతి చెందింది. ఈశ్వరమ్మ మానసిక పరిస్థితి ఎలా ఉండేది ? ఆ కుటుంబం గతంలో ఏ విధంగా ఉండేది ? వంటి అన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

శవంతోనే సహజీవనం చేసిన కుటుంబం .. ఆస్పత్రికి తరలింపు , మృతదేహం దహనం
స్థానికులు మాత్రం వాళ్లు మొదటి నుంచి అలానే ఉన్నారని, సత్యనారాయణ ఒక్కడే బయటకు వెళ్లి ఎప్పుడైనా సామాన్లను తీసుకు వచ్చే వారిని, వారు ఎవరితోనూ మాట్లాడేవారు కారని చెప్తున్నారు. ఏది ఏమైనా ఇంట్లో ఉన్న మనిషి చనిపోయారు అన్న విషయం కూడా అర్థం చేసుకోలేని వారి మానసిక పరిస్థితిపై స్థానికంగా చర్చ జరుగుతోంది. శవం కుళ్లిపోయి వాసన వస్తున్నా పసిగట్టలేని , శవంతోనే రోజుల తరబడి సహజీవనం చేసిన విషాదకర పరిస్థితులను గుర్తించిన పోలీసులు, వారిని వైద్య చికిత్స నిమిత్తం మానసిక వైద్య ఆస్పత్రికి తరలించారు .ఈశ్వరమ్మ మృతదేహానికి రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా దహన సంస్కారాలు నిర్వహించారు