చేతబడి చేశాడన్న అనుమానంతో ఏపీలో దారుణం ... స్మశానానికి తీసుకెళ్ళి హతమార్చి ఆపై దహనం
శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధించినా మనుషులలో ఇంకా మూఢనమ్మకాలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఫలితంగా చేతబడులు ,బాణామతులు జరుగుతున్నాయన్న మూఢ విశ్వాసాలు ప్రాణాలను బలి తీసుకునే దాకా వెళుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో దారుణం చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని కొందరు దారుణంగా హతమార్చారు. మృతుడి ఆనవాళ్లు దొరకకుండా శవాన్ని దహనం చేశారు.
మావోల ఘాతుకంతో ప్రజా ప్రతినిధులకు పోలీస్ అలెర్ట్ .. రాజకీయ వర్గాలకు టెన్షన్

శ్రీకాకుళం జిల్లాలో అమానుషం.. చేతబడి పేరుతో ఓ వ్యక్తి హత్య
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పుల్లగూడ గిరిజన గ్రామంలో జరిగిన అమానుష ఘటన ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో సంచలనంగా మారింది. చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో పుల్లగూడ కు చెందిన 44 ఏళ్ళ ఊలక నాయకమ్మ అనే వ్యక్తిని కాళ్లు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి స్మశానానికి తీసుకు వెళ్లి దారుణంగా కొట్టి హతమార్చారు. గత పది రోజుల క్రితం పుల్లగూడకు చెందిన ఊలక రమేష్ అనే వ్యక్తి మృతి చెందాడు . అయితే అతను చేతబడి చేయడం వల్లే మృతి చెందాడని భావించిన బంధువులు ఒడిశాలోని మరో భూత వైద్యుని సంప్రదించారు.

అర్దరాత్రి ఇంటిపై దాడి చేసి వ్యక్తిని స్మశానానికి తీసుకెళ్ళి ఘాతుకం
ఒడిశాలోని భూత వైద్యుడు నాయకమ్మ చేతబడి చేయడం వల్లే రమేష్ మృతి చెందాడని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన బంధువులు గ్రామానికి తిరిగి వచ్చిన తరువాత నాయకమ్మను చంపేయవలసిందిగా అతని కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు. వారు తిరస్కరించడంతో అర్ధరాత్రి నాయకమ్మను ఇంటి నుండి బయటకు తీసుకొచ్చి నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లకు, చేతులకు వైర్లు కట్టి స్మశానానికి తీసుకువెళ్లారు. అక్కడ నాయకమ్మను తీవ్రంగా కొట్టి చంపారు.

ఆనవాళ్ళు దొరక్కుండా తగలబెట్టిన ఓ వర్గం .. పోలీసుల దర్యాప్తు
మృతదేహం ఆనవాళ్లు దొరక్కుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా స్మశానం లోనే దహనం చేశారు.
మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్మశానంలో శవాన్ని దహనం చేసిన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఈ కేసు దర్యాప్తు కి కావాల్సిన ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ కాలంలో కూడా చేతబడి చేస్తున్నారనే విశ్వాసాలు ఇంకా గ్రామాలలో ఉండటంపై హేతువాద సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ప్రజల మూఢనమ్మకాలను నిరోధించేలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలంటున్నారు.