వీడియో: వణికిన శ్రీకాకుళం జిల్లా: చలిలో..భయాందోళనల మధ్య రోడ్ల మీద గడిపిన ప్రజలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల భూమి కంపించింది. పలు మండలాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. రాత్రివేళ.. గడ్డ కట్టించే చలిలో ఆరుబయటే గడిపారు. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవంచకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని చోట్ల ఇళ్లు బీటలు వారినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా అధికారులు పరిస్థితులను సమీక్షించారు. ప్రజలకు ధైర్యం చెప్పారు.
శ్రీకాకుళం-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఈ భూప్రకంపనలు నమోదయ్యాయి. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పలు చోట్ల ఇదే పరిస్థితి కనిపించింది. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోపేంట మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో ఈ ప్రకంపనలు సంభవించాయి. వారం రోజుల వ్యవధిలో భూప్రకంపనలు నమోదు కావడం ఇది రెండోసారి. భూమి స్వల్ప వ్యవధిలో నాలుగుసార్లు కంపించిందని స్థానికులు చెబుతున్నారు.

వెంటవెంటనే సంభవించిన ఈ ప్రకంపనలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఇళ్లల్లో ఉన్న వారు బయటికి పరుగులు తీశారు. కొన్ని గంటల పాటు రోడ్ల మీదే గడిపారు. గడ్డకట్టించే చలిలోనూ చాలాసేపటి వరకు వీధులు, ఆరుబయలు ప్రదేశాల్లో ఉన్నారు. ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. పిల్లాపాపలతో చాలాసేపటి వరకు రోడ్ల మీదే గడిపారు. ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. పురుషోత్తమపురం, ఇచ్ఛాపురం, తేలుకుంచి సహా సరిహద్దుకు అవతల ఉన్న ఒడిశా గ్రామాల్లోనూ ఇవే పరిస్థితులు కనిపించాయి.

ప్రకంపనలు స్వల్పమే కావడం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చిమ్మ చీకట్లు అలముకోవడంతో గ్రామస్తులు మరింత భయపడ్డారు. ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వృద్ధులు, చిన్నపిల్లలు భయంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. సెల్ ఫోన్ లైట్లలో చాలాసేపటి వరకు గడపాల్సి వచ్చింది.
వీడియో: వణికిన శ్రీకాకుళం జిల్లా: చలిలో..భయాందోళనల మధ్య రోడ్ల మీద గడిపిన ప్రజలు#Earthquake: #Srikakulam pic.twitter.com/qwQX21WNi8
— oneindiatelugu (@oneindiatelugu) January 5, 2022
రెండేళ్ల కిందట సరిగ్గా ఇదే జనవరిలో శ్రీకాకుళం జిల్లాలో భూమి ప్రకంపించిన విషయం తెలిసిందే. 2020 జనవరి 8వ తేదీన జిల్లాలోని రాజాంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి మండలాల్లోనూ గతంలో భూకంపం సంభవించింది. ఇప్పుడు తాజాగా జనవరిలోనే భూ ప్రకంపనలు సంభవించడం చర్చనీయాంశమైంది. దీనిపై జియాలాజికల్ సర్వే అధికారులకు నివేదికను పంపిస్తామని, అధ్యయనం చేయిస్తామని స్థానిక అధికారులు స్పష్టం చేశారు.