దీపావళి: ఊరికి పేరు, గ్రామస్తుల సంతోషం
దీపావళి.. చెడుపై మంచి సాధించిన విజయం. దీపాల వెలుగుతో ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటారు. పండగల పేర్లతో ఊర్లు ఉండడం చాలా అరుదు. కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం దీపావళి పేరుతో ఓ ఊరుంది. గార మండలంలో ఈ ఊరుకు దీపావళి పేరు ఉంది. శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించిన రాజు.. ఈ గ్రామానికి దీపావళి అని పేరు పెట్టినట్లు స్థానికులు చెబుతుంటారు. దీనిపై చుట్టుపక్క గ్రామాల్లో ఓ కథ ఉంది.
శ్రీకాకుళాన్ని పాలించిన రాజు కళింగపట్నం ప్రాంతానికి అప్పుడప్పుడు గుర్రంపై ఇదే ప్రాంతం మీదుగా వెళ్లేవారు. ఒక రోజు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. అక్కడ సమీపంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న కూలీలు రాజును గుర్తించి సపర్యలు చేశారు. రాజు కోలుకున్న తర్వాత వారికి కృతజ్ఞతలు చెప్పారు. ఆ రోజు దీపావళి కావడంతో ఆ గ్రామానికి దీపావళిగా నామకరణం చేశారు. ఇప్పటి రెవెన్యూ రికార్డుల్లోనూ ఈ ఊరి పేరు దీపావళిగానే ఉంది. గ్రామంలో సుమారు వెయ్యి మంది జనాభా ఉన్నారు.

దివాళి పండగ పేరు గ్రామానికి ఉండటం విశేషం. దీంతో గ్రామస్తులు సంబరపడుతున్నారు. తమ ఊరికి వెలుగు అర్థం వచ్చేలా పేరు ఉండటం మంచిదని అంటున్నారు. మిగతా గ్రామాల వారికి ఆదర్శంగా నిలిచామని అంటున్నారు.
నరక చతుర్దశి వేకువ జామున చంద్రోదయం అయిన తర్వాత ఒక గంట వరకు దేవతలకూ, బ్రాహ్మణులకూ, పెద్దలకూ, తల్లికి, గోవులకు హారతులు ఇచ్చి వాళ్ల దీవెనలు పొందాలన్నది శాస్త్ర చెబుతోంది. తర్వాత అభ్యంగన స్నానం ఆచరించి దేవతారాధన చేయాలి. అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లు తలపై నువ్వుల నూనె అంటి, నుదుట కుంకుమబొట్టు పెట్టి మంగళహారతి ఇస్తారు. తోబుట్టువుల మధ్య అనుబంధాలు పదికాలాలు పచ్చగా ఉండాలన్నది ఈ వేడుకలో అంతరార్థం. ప్రతిరోజూ మంగళప్రదంగా కొనసాగాలని ఆడపడుచుల నుంచి హారతులు అందుకొని, యథాశక్తి వారికి బహుమతులు సమర్పించడం సంప్రదాయంగా స్థిరపడింది. దీపావళి సందర్భంగా అపమృత్యుదోషం నశించడం కోసం నరకాధిపతి యముడి ప్రీత్యర్థం దీపదానం కూడా చేస్తారు. తర్వాత అమావాస్య రాత్రి లక్ష్మీపూజ నిర్వహించాలని శాస్త్ర తెలిపింది.