వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఐడీ-డబ్బులకు డిమాండ్-ఏం చేశారంటే?
వైఎస్సార్సీపీ సీనియర్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు సైతం ఫేస్ బుక్ నకిలీ ఐడీల బెడద తప్పడం లేదు. ఆయన పేరుతో నిర్వహిస్తున్న ఫేస్ బుక్ ఐడీని హ్యాక్ చేసిన కొందరు అంగతుకులు తాజాగా అకౌంట్ కు లింక్ అయి ఉన్న మిత్రుల్ని డబ్బులు అడగుతున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో కలకలం రేపుతోంది.
ధర్మాన ప్రసాదరావు పేరుతో ఉన్న ఫేస్ బుక్ ఐడీ నుంచి డబ్బుల కోసం ఆయన ఫేస్ బుక్ ఖాతాలో ఉన్న కొందరు మిత్రులకు విజ్ఞప్తులు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో వారిలో కొందరు డబ్బులు కూడా సమర్పించుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మొహమాటంగా వారు ధర్మాన దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. దీంతో ఆయన అవాక్కయ్యారు. ఫేస్ బుక్ ఐడీ హ్యాక్ కు గురైనట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. ప్రభుత్వంలో కీలక స్ధానాల్లో ఉన్న కుటుంబానికే ఇలా జరిగితే ఇక సామాన్యుల పరిస్ధితి ఏంటని ఆయన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

చివరికి తన ఫేస్ బుక్ ఐడీ హ్యాకింగ్ జరిగిందని తెలుసుకున్న ధర్మాన.. దీనిపై తన ఫేస్ బుక్ మిత్రుల్ని అప్రమత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ధర్మాన ఫేస్ బుక్ ఖాతాకు దాదాపు 20 వేల మంది మిత్రులు, ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఇందులో ఎవరెవరికి ఈ విధంగా డబ్బుల కోసం విజ్ఞప్తులు వెళ్లాయో తెలుసుకునేందుకు ధర్మాన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా ఫేస్ బుక్ లో ఇలాంటి బాధితుల కోసం, తన మిత్రుల్ని అప్రమత్తం చేసేందుకు ఆయన ఓ పోస్టు కూడా పెట్టారు. ఇప్పుడు ఈ పోస్టు చర్చనీయాంశమవుతోంది.

ఈ పోస్టులో ధర్మాన... ప్రజలకు విన్నపం, నా పేరుతో ఫేస్ బుక్ లో ఒక ఫేక్ అకౌంట్ తయారు చేసి ఆకతాయిలు డబ్బులు అడుగుతున్నారని విషయం నా దృష్టికి వచ్చింది. నేను ఎవరికీ డబ్బులు అడగడం లేదు అనే విషయం ప్రజలు గమనించి, ఇలాంటి మెసేజ్ లకు స్పందించవద్దు అని మనవి. ఇట్లు మీ ధర్మాన ప్రసాదరావు అంటూ పెట్టారు. దీంతో అప్పటికే డబ్బులు సమర్పించుకున్న వారు లబోదిబోమంటున్నట్లు తెలుస్తోంది.