Srikakulam: విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం: బాలిక అప్రమత్తం.. చితగ్గొట్టిన స్థానికులు
మహిళలు, మైనర్ బాలికలపై కొనసాగుతున్న అత్యాచారాలు, హత్యోదంతాల పర్వానికి నిరసనగా దేశవ్యాప్తంగా నిరసలు కొనసాగుతున్నప్పటికీ.. మానవ మృగాల అరాచకాలకు అడ్డుకట్ట పడట్లేదు. ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో మహిళలు, విద్యార్థినులు కామాంధుల చేతుల్లో బలి అవుతూనే ఉన్నారు. ఇదే తరహా ఉదంతం మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో కూడా చోటు చేసుకుంది. బాలిక అప్రమత్తంగా ఉండటం, స్థానికులు సకాలంలో గుర్తించడంతో నిందితుడు జైలు పాలయ్యాడు.

రాజాం నుంచి రేగడి వెళ్తుండగా..
శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన రేగడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అత్యాచారానికి ప్రయత్నించిన యువకుడు ఆటో డ్రైవర్. అతని పేరు వాకాడ సురేష్. రాజాం నుంచి పాఠశాల విద్యార్థినులను వారి ఇళ్లకు తరలిస్తుంటాడు. ఇది అతని రోజువారి దినచర్య. రేగడికి చెందిన బాధిత విద్యార్థిని తరచూ అతని ఆటోలో రాజాంలోని పాఠశాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని రోజులాగే గురువారం సాయంత్రం పాఠశాల నుంచి వాకాడ సురేష్ ఆటోలో తిరుగుముఖం పట్టారు.

ఆటోను దారి మళ్లించి..
పాడేరు-ముంచంగిపుట్టు క్రాస్ రోడ్డు నుంచి తన గ్రామానికి వెళ్లడానికి ఆటోను ఆశ్రయించిందా విద్యార్థిని. ఆ సమయంలో ఆమెతో పాటు మరి కొందరు ఆటోలో ఉన్నారు. కొంతదూరం వెళ్లాక.. అందరూ ఆటో నుంచి దిగిపోవడంతో విద్యార్థిని ఒక్కరే ఉన్నారు. దీనితో వాకాడ సురేష్.. విద్యార్థినిపై కన్నేశాడు. ఆటోను దారి మళ్లించాడు. ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు.

దేహశుద్ధి చేసిన స్థానికులు
విద్యార్థిని గట్టిగా కేకలు వేయడం, నిర్మానుష్య ప్రదేశంలో ఆటో కనిపించడంతో స్థానికులు అప్రమత్తం అయ్యారు. సురేష్ ను చితగ్గొట్టారు. చెప్పులతో కొట్టారు. అనంతరం రేగడి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు రేగడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సబ్ ఇన్ స్పెక్టర్ బాలరాజు తెలిపారు. నిందితుడి నేపథ్యాన్ని తెలుసుకుంటున్నామని చెప్పారు డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేయాలని జిల్లా ఆర్టీఓ అధికారులకు విజ్ఞప్తి చేస్తామని అన్నారు.