వీడియో: మొన్న వరంగల్..నేడు శ్రీకాకుళం: అఖండ సినిమా థియేటర్లో అగ్నిప్రమాదం
శ్రీకాకుళం: నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమాను ప్రదర్శిస్తోన్న మరో థియేటర్లో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు రోజుల కిందట తెలంగాణలోని వరంగల్‌లో ఓ థియేటర్లో అగ్నిప్రమాదం సంభవించిన ఘటనను విస్మరించకముందే తాజాగా శ్రీకాకుళంలోని ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. థియేటర్ యాజమాన్యం అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా అఖండ. విడుదలైన అన్ని చోట్ల సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇదివరకు వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ కంటే అత్యధిక కలెక్షన్లను సాధిస్తోంది. సినిమా విడుదలై అయిదు రోజుల కావస్తున్నా కలెక్షన్ల ప్రవాహం ఎక్కడే గానీ తగ్గట్లేదు. థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు పడుతున్నాయి. ఓవర్సీస్లోనూ అఖండ మేనియా కొనసాగుతోంది.
బాలకృష్ణ మొట్టమొదటి సారిగా అఖండగా అఘోరీ క్యారెక్టర్లో కనిపించారు. నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. బాలకృష్ణ చాలాకాలం తరువాత ఓ డిఫరెంట్‌తో కనిపించడం అభిమానులను థియేటర్లకు మళ్లీ మళ్లీ రప్పించుకుంటోంది. శివతత్వాన్ని చాటిన సినిమాగా అభిమానులు ప్రచారం చేస్తోన్నారు. హిందూధర్మాన్ని ఉన్నతంగా చిత్రీకరించిన మూవీగా పేరు తెచ్చుకుందీ అఖండ. శివతత్వానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సినిమాను సూపర్ హిట్ చేశారనే టాక్ తెచ్చుకుంది.
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న కలెక్షన్లు, అభిమానుల కోలాహలం మాటెలా ఉన్నప్పటికీ- అఖండను ప్రదర్శిస్తోన్న సినిమా థియేటర్లలో అనూహ్య, అసాధారణ సంఘటనలు చోటు చేసుకుంటోన్నాయి. ఇటీవలే వరంగల్‌లోని జెమిని థియేటర్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్వల్పంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం గానీ, గాయపడటం గానీ సంభవించలేదు. థియేటర్ యాజమాన్యం అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది.
ఇలాంటి ఘటనే శ్రీకాకుళంలో తాజాగా చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి రవిశంకర్ థియేటర్లో స్వల్పంగా మంటలు చెలరేగాయి. స్క్రీన్ వెనుక వైపు అమర్చిన సౌండ్ బాక్సుల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. స్క్రీన్ పాక్షికంగా కాలిపోయింది. ప్రేక్షకులు భయభ్రాంతులకు గురయ్యారు. బయటికి పరుగులు తీశారు. సౌండ్ సిస్టమ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. థియేటర్ యాజమాన్యం మంటలను అదుపులోకి తీసురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మూడు రోజుల కిందట తూర్పు గోదావరి జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జాస్తి రామకృష్ణ అఖండ సినిమా చూస్తూ మరణించిన విషయం తెలిసిందే. రాజమహేంద్రవరం శ్యామల థియేటర్లో ఆయన సినిమా చూస్తూ అకస్మాత్తుగా స్పృహ తప్పారు. థియేటర్ యాజమాన్యం ఆయనను ఆసుపత్రికి తరలించింది. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. సినిమా చూస్తోన్న సమయంలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో జాస్తి రామకృష్ణ మరణించారు.