వామ్మో.. ఏందిది.. ఏడాది క్రితం పోస్టుపై ఇప్పుడు కేసా.. టీడీపీ నేత ఆత్మహత్య..
ప్రతిపక్ష కార్యకర్తలకు వేధింపులు తప్పడం లేదు. పాత కేసులను తోడి.. మరీ కేసులు పెడుతున్నారు. దీంతో టీడీపీ నేతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏడాది క్రితం పెట్టిన సోషల్ మీడియా పోస్టుపై తాజాగా కేసు నమోదు చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన టీడీపీ నేత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
గతేడాది పంచాయతీ ఎన్నికల సమయంలో టెక్కలి నియోజకవర్గ వైసీపీ నేతపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టారని టీడీపీ సోషల్ మీడియా సభ్యుడు కోన వెంకటరావుపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం వెంకటరావు ఇంటికి చేరుకున్న టెక్కలి, మందస పోలీసులు ఆయన ఇంటిలో లేకపోవడంతో పోలీస్ స్టేషన్కు రావాల్సి ఉంటుందని ఆయన భార్య కృష్ణవేణిని హెచ్చరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న భర్తకు కృష్ణవేణి విషయం చెప్పడంతో మనస్తాపం చెందిన వెంకటరావు రాత్రి ఏడు గంటల సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

టీడీపీ నేతలు, కార్యకర్తలు నిన్న ఉదయం ఆసుపత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసుల వేధింపులు భరించలేకే వెంకటరావు ఆత్మహత్య చేసుకున్నారని, మంత్రి అప్పలరాజు ఒత్తిడితో ఇలా చేశారని ఆరోపించారు. వెంకటరావు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం వరకు ఆసుపత్రి వద్దే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆసుపత్రికి చేరుకున్న డీఎస్పీ శివరామిరెడ్డి టీడీపీ నాయకులతో చర్చలు జరిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, బాధితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వెంకటరావు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై స్పందించిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. వెంకటరావును ఆత్మహత్యకు పురిగొల్పిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వైసీపీ నేతలపై తక్షణమే హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.