మంత్రివేనా.. ఒళ్ళు బరువెక్కిందా .. మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై టీడీపీ నేతల ఆగ్రహం
రాజధాని అమరావతి ప్రాంత రైతుల పై ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తనపై పోటీ చేసి గెలవాలని.. రాజధాని ప్రాంత రైతుల పై పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వ్యాఖ్యలు చేసిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడిన మంత్రి సిదిరి అప్పలరాజు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వ్యాఖ్యలు చేశారు.
మంత్రి ధర్మానకు మతి చలించింది.. బాబుతో పోటీనా... టీడీపీ సీనియర్ నేతల రివర్స్ పంచ్

మంత్రి అప్పలరాజుకు రివర్స్ కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేతలు
ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్లిన వారు రైతులు ఎలా అవుతారని ప్రశ్నించారు. అంతేకాదు టీడీపీ నేత కూన రవికుమార్, బుద్దా వెంకన్నలను ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు మంత్రి అప్పలరాజు . టీడీపీ నేత కూన రవికుమార్ ను చూడగానే బాగా కొవ్వెక్కినట్టు తెలుస్తోందని ఇక బుద్ధా వెంకన్న ఎవడో ఏదో వాగుతున్నాడు అని టిడిపి నేతలపై విమర్శలు గుప్పించిన మంత్రి అప్పలరాజు కు టిడిపి నేతలు కౌంటర్ ఇచ్చారు.
బెదిరింపులకు భయపడటానికి నేను చిన్న పిల్లవాడిని కాదంటూ కూన రవికుమార్ మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై మండిపడ్డారు.

వైసీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారంటూ కూన ఫైర్
వైసీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. ప్రభుత్వ వైఖరిని ఎవరూ ప్రశ్నించకూడదన్నట్లుగా వైసీపీ మంత్రులు వ్యవహరిస్తున్నారని కూన రవికుమార్ ఫైరయ్యారు. టిడిపి చరిత్ర తెలుసుకొని మంత్రి అప్పలరాజు మాట్లాడాలని హితవు పలికారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్ అసభ్యంగా మాట్లాడిన మాటలు వైసీపీ నేతలకు వినపడలేదా అని ప్రశ్నించిన కూన రవికుమార్ బూతులను సమర్థించడానికి క్యాబినెట్ మంత్రి పదవి కావాలా అంటూ ప్రశ్నించారు.

మంత్రి అప్పలరాజుకు ఒళ్ళు బరువెక్కిందన్న కూన రవి కుమార్
మంత్రి అప్పలరాజుకు ఒళ్ళు బరువెక్కిందని , అప్పలరాజు బరువు తగ్గించడానికి పలాస ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ రివర్స్ పంచ్ వేశారు కూన రవికుమార్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. అప్పలరాజు మంత్రి అయిన తర్వాత ఉద్దానం ప్రజలకు చేసింది ఏంటి అంటూ ప్రశ్నించారు. నిన్నగాక మొన్న మంత్రి అయినా అప్పలరాజు కూడా మాట్లాడేవాడా అంటూ మండిపడ్డారు కూన రవి కుమార్.
సిక్కోలు ప్రజలకు 16 నెలల పాలనలో 16 రూపాయల పని కూడా చెయ్యలేదని విమర్శలు గుప్పించారు కూన రవి కుమార్ .

మంత్రి అప్పలరాజు బర్తరఫ్ కు డిమాండ్
టిడిపి సీనియర్ నేత బుద్దా వెంకన్న మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై భగ్గుమన్నారు మంత్రివర్గం నుండి అప్పల రాజు ను బర్తరఫ్ చేయాలంటూ బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు . వైసిపి పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, రైతులను కించపరిచేలా వైసీపీ మంత్రులు మాట్లాడుతున్నారని బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల గర్వం, అహంకారం పతాక స్థాయికి చేరిందని విమర్శించిన బుద్ధా వెంకన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి వైసీపీ మంత్రులు వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రైతులు పెయిడ్ ఆర్టిస్ట్ లా ... భగ్గుమన్న బుద్దా వెంకన్న
రైతులు విమానాలు ఎక్కకూడదని ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు . రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వ్యాఖ్యానించడం దారుణమని బుద్ధ వెంకన్న పేర్కొన్నారు. మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు దేశంలోని రైతులు అందర్నీ అవమానించడమేనని పేర్కొన్న బుద్ధా వెంకన్న మంత్రివర్గం నుండి అప్పల రాజు ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులు పులివెందులకు చెందిన పులి రాజుల్లా మాట్లాడుతున్నారు అంటూ బుద్ధా వెంకన్న మండిపడ్డారు.