హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మక్కా మసీదు పేలుళ్ల కేసు కొట్టివేత: నాంపల్లి ఎన్ఐఏ కోర్టు తుది తీర్పు, భారీ బందోబస్తు

|
Google Oneindia TeluguNews

Recommended Video

నాంపల్లి ఎన్ఐఏ కోర్టు తుది తీర్పు, భారీ బందోబస్తు

హైదరాబాద్: 11ఏళ్ల నాటి మక్కా మసీదు పేలుళ్ల కేసును నాంపల్లి ఎన్ఐఏ కోర్టు కొట్టివేసింది. నిందితులపై నేరారోపణ నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో సోమవారం కోర్టు ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. ఐదుగురు నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాద్‌ నగర పోలీసులు కోర్టు, పాతబస్తీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

చదవండి: 2007 మక్కా మసీదు పేలుళ్లు: ఎప్పుడేం జరిగింది?

నిందితులపై అభియోగాలు రుజువు కాకపోవడంతో ఐదుగురిని నిర్ధోషులుగా కోర్టు పేర్కొందని, కేసు కొట్టివేసిందని న్యాయవాదులు తెలిపారు. నిందితులైన ఆసిమానంద, దేవేంద్ర గుప్తా, లోకేష్ శర్మ, భరత్ భాయి, రాజేష్ చౌదరిలను నిర్దోషులుగా ప్రకటించిందని తెలిపారు.

ఇప్పటికే ఇద్దరు నిందితులు బెయిలుపై ఉన్నారని, మరో ముగ్గురుపై వేరే కేసులు ఉన్న కారణంగా వారు జైల్లోనే ఉండాల్సి ఉంటుందని తెలిపారు. మిగితా నిందితులపై ఛార్జీషీటు కొనసాగుతోందని న్యాయవాదులు తెలిపారు. నాంపల్లి కోర్టు తీర్పును పరిశీలించాల్సి ఉందని ఎన్ఐఏ పేర్కొంది. తీర్పును పరిశీలించాకే తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపింది.

2007, మే18న పేలుడు

2007 మే 18న మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో చార్మినార్‌ సమీపంలోని మక్కామసీదు ఆవరణలోగల వజూఖానా వద్ద ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌(ఐఈడీ) బాంబు పేలడంతో 9మంది మరణించగా, 58 మంది గాయపడ్డ సంగతి తెలిసిందే. అక్కడికి సమీపంలోనే పేలని మరో ఐఈడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఘటన జరిగిన సమయంలో మసీదులో ప్రార్థనలు జరుగుతుండటంతో సుమారు 5వేల మందికి పైగా ఉన్నారు. పేలుడు అనంతరం జరిగిన అల్లర్లను అణిచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో ఐదుగురు మృతిచెందారు. ఈ ఘటనలపై తొలుత హుస్సేనీఆలం ఠాణాలో కేసులు నమోదయ్యాయి. ఘటన తీవ్రత దృష్ట్యా కేసుల దర్యాప్తును సీబీఐ చేపట్టింది.

అయితే ఉగ్రవాద దుశ్చర్య కావడంతో భారత హోంమంత్రిత్వ శాఖ కేసు దర్యాప్తు బాధ్యతను 2011 ఏప్రిల్‌ 4న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కి అప్పగించింది. అప్పట్లో రెండు కేసుల్ని తిరిగి నమోదు చేసిన ఎన్‌ఐఏ మొత్తం పదిమంది నిందితుల్ని గుర్తించింది. సీబీఐ ఒకటి, ఎన్‌ఐఏ రెండు అభియోగపత్రాల్ని న్యాయస్థానంలో నమోదు చేశాయి. 2014 ఫిబ్రవరి 13న నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి.

కాగా, సీబీఐ తొలుత ఇద్దరు నిందితుల్ని అరెస్ట్‌ చేసింది. 2010 జూన్‌ 17న రాజస్థాన్‌కు చెందిన దేవేంద్రగుప్తా అలియాస్‌ బాబీ, మధ్యప్రదేశ్‌కు చెందిన లోకేశ్‌ శర్మ అలియాస్‌ అజయ్‌ తివారిని అరెస్ట్‌ చేశారు. అదే ఏడాది నవంబరు 19న కీలక నిందితుడు నాబకుమార్‌ సర్కార్‌ అలియాస్‌ అసీమానంద పోలీసులకు చిక్కడంతో కుట్రకోణం వెలుగు చూసింది. గుజరాత్‌లోని డాంగ్‌ ప్రాంతానికి చెందిన అసీమానంద హరిద్వార్‌ అత్మాల్‌పూర్‌లోని పరమహంస ఆశ్రమంలో తలదాచుకున్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేశారు. కాగా, విచారణలో కీలక ఆధారాలు లభించాయి. దేశంలో ఒక వర్గం ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని మరోవర్గం పేలుళ్లకు పాల్పడుతోందనే కారణంతో మక్కామసీదు పేలుడు ఘటనకు పాల్పడినట్లు వెల్లడైంది.

మక్కామసీదు పేలుడు ఘటనతో ప్రమేయమున్న మరో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుజరాత్‌ వల్సాద్‌కు చెందిన భారత్‌ మోహన్‌లాల్‌ రతేశ్వర్‌ అలియాస్‌ భారత్‌భాయి 2011 డిసెంబరు 3న, మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేందర్‌ చౌదరి అలియాస్‌ సముందర్‌ 2013 మార్చి 2న పోలీసులకు చిక్కారు. పేలుడు ఘటనలో ప్రమేయమున్న మధ్యప్రదేశ్‌ ఇండోర్‌కు చెందిన సందీప్‌ వి డాంగే అలియాస్‌ వాసుదేవ్‌, రామచంద్ర కల్సంగ్రా రాంజీ అలియాస్‌ ఓమ్‌జీ మాత్రం ఇంకా దొరకలేదు.

మధ్యప్రదేశ్‌ దేవాస్‌కు చెందిన మరో నిందితుడు సునీల్‌జోషి పేలుడు జరిగిన ఏడాదే హత్యకు గురయ్యాడు. మరో ఇద్దరు నిందితులు తేజ్‌రామ్‌ పార్మార్‌, అమిత్‌చౌహన్‌పై ఇంకా విచారణ కొనసాగుతున్నట్లు అభియోగపత్రంలో పేర్కొంది. 11ఏళ్ల మక్కా మసీదు పేలుళ్ల కేసులో సోమవారం తీర్పు వెలువడిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

English summary
A special NIA court will pronounce judgment in the 2007 Mecca Masjid bomb blast case on Monday, 11 years after the powerful explosion killed nine people and injured more than 50 during Friday prayers near Hyderabad’s iconic Charminar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X