తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి: 20వేల దిగువకు యాక్టివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. శుక్రవారం 35,280 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1273 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,30,274కి చేరింది.
తాజాగా, కరోనా బారినపడి ఐదుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1303కు చేరింది. ఈ మేరకు శనివారం ఉదయం వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా, 1708 మంది కరోనా నుంచి కోలుకున్నారని, దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 2,09,034కు చేరింది.

తెలంగాణలో ప్రస్తుతం 19,937 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 16,809 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని, మిగితావారు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది. ఇక హైదరాబాద్ నగర పరిధిలో 227 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కరోనా బారినపడ్డ నాగర్కర్నూల్ ఎమ్మెల్యే, ఎంపీ
కరోనా బారినపడుతున్న ప్రముఖులు, ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కరోనా బారినపడగా.. తాజాగా మరో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు కూడా కరోనా సోకింది. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి కూడా కరోనా బారినపడ్డారు. గత రెండ్రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లో పరీక్ష చేయించుకోగా.. కరోనా పాజిటివ్ అని తేలింది.
దీంతో ఆయన హోంక్వారంటైన్లోనే ఉంటున్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేగాక, గత వారం రోజులుగా తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన సూచించారు. నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కూడా కరోనా బారినపడ్డారు. ఇటీవల ఎల్లూరు వద్ద కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్ఐ) పంపులు మునిగిన పరిస్థితిని పరిశీలించి వచ్చాక.. అస్వస్థతకు గురయ్యారు. పరీక్షలు నిర్వహించుకోగా ఎంపీకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.