మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒకేరోజు 13మంది మృతి, వాచ్‌మన్‌గా చేరిన తెల్లారే.. రాజధానిలో రైతు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పుల బాధ తాళలేక రైతన్నలు బలవంతంగా తనువు చాలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం దాదాపు పదమూడు మంది రైతులు మరణించారు.

పదిమంది ఆత్మహత్య చేసుకోగా, ఇద్దరు గుండె పోటుతో మృతి చెందారు. హైదరాబాదులోని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం రామ్‌సాగర్‌కు చెందిన జగ్గొళ్ల మల్లేష్‌(58) తొలుత తాపీ మేస్త్రీగా పని చేశాడు.

20 ఏళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లాడు. 2001లో పోలీసులకు లొంగిపోవడతో ప్రభుత్వం రూ.40 వేల విలువైన సెంట్రింగ్‌ సామగ్రి ఇచ్చింది. మల్లేష్‌ శరీరం సహకరించక వాటితో పని చేయలేదు. తనకున్న మూడెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు.

 13 farmers die in single day, Medak farmer ends life in Hyderabad

రెండేళ్ల కిందట ఎకరం అమ్మాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. అందరికీ పెళ్లిళ్లు చేశాడు. మిగిలిన రెండెకరాల్లో మొక్కజొన్న, పత్తి వేయగా పంట ఎండిపోయింది. మొత్తం రూ.ఆరు లక్షల దాకా అప్పు చెల్లించాల్సి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆర్నెల్ల కిందట రెండెకరాల భూమిని రూ.50 వేలకు కుదువ పెట్టాడు. ఈ నేపథ్యంలో పంట చేతికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో పట్నంలో ఏదైనా పని చేసుకొని బతకాలని గత బుధవారం అల్వాల్‌లో ఉండే బావమరిది శ్రీనివాస్‌ ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు కొంపల్లిలోని అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా చేరాడు.

 13 farmers die in single day, Medak farmer ends life in Hyderabad

ఏం జరిగిందో తెలియదు కానీ శనివారం రాత్రి బాలంరాయి పంప్‌హౌస్‌లో తువ్వాలుతో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొదట గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో లభించిన చరవాణి ఆధారంగా మృతుడి కుమారుడికి సమాచారం అందించడంతో వివరాలు తెలిశాయి.

శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అప్పు కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతోనే మల్లేష్‌ తనువు చాలించినట్లుగా చెబుతున్నారు. రెండేళ్లుగా సరిగా పంటలు పండటం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఎక్కడా అప్పు పుట్టక పోవడంతో... గురువారం కొంపల్లిలో వాచ్‌మన్‌గా పని దొరికింది. శుక్రవారం హైదరాబుదులోని తన బావమరిది ఇంటికి రాకపోవడంతో... అతను ఫోన్ చేశాడు. డబుల్‌ డ్యూటీ చేస్తున్నట్లు చెప్పాడు. చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కొడుకు నాచారంలో నివాసముంటూ రిఫ్రిజిరేటర్‌ మరమ్మతుల కేంద్రంలో పని చేస్తున్నాడు రెండేళ్ల క్రితమే ఇతను హైదరాబాద్‌కు వలస వచ్చాడు.

 13 farmers die in single day, Medak farmer ends life in Hyderabad

కరీంనగర్ జిల్లాలోని చంద్రగిరికి చెందిన రైతు నర్సయ్య అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.2 లక్షల అప్పులు, భార్యకు అనారోగ్యం. దీంతో, ఆదివారం పురుగుల మందు తాగాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

ఆరపల్లికి చెందిన రైతు రాజయ్య అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మునుగోడు మండలం కొరటికల్‌కు చెందిన యువరైతు అంబేడ్కర్‌ ఉరివేసుకున్నాడు. పంటకు పెట్టుబడి, సోదరి పెళ్లికి అతను పెద్ద మొత్తంలో అప్పు చేశాడు.

ఆత్మకూరు(ఎం) మండలం ఇందిరానగర్‌కు చెందిన ఆండాళ్‌ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. నిజామాబాద్ జిల్లాలోని జనగామకు చెందిన రైతు దేవయ్య చేనులో ఉరివేసుకున్నాడు. ఆలూర్‌కు చెందిన రమేష్ గౌడ్‌ సాగుతో పాటు, ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ వెళ్లేందుకు కూడా అప్పులు చేశాడు.

అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్‌ జిల్లాలోని కాప్రికి చెందిన గంగారెడ్డి పంటల సాగుకు ఆరు లక్షల రూపాయల అప్పు చేశాడు. పంట మాత్రం రాలేదు. దీంతో, పురుగుల మందు తాగి చనిపోయాడు.

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం అంతప్పగూడలో అప్పుల బాధతో విషగుళికలు మింగి జంగయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా ముచ్చర్లలో రైతు కోలా సత్యనారాయణ చేనులో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లాలో ఇద్దరు గుండెపోటుతో మృతి చెందారు.

English summary
Thirteen harried farmers had their lives ended across five districts of the Telangana on Sunday, probably the largest number in a single day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X