బాసర ఆలయంలో వర్గపోరు: ప్రధాన ఆర్చకుడిపై సస్పెన్షన్ వేటు
అదిలాబాద్: బాసర సరస్వతీ విగ్రహం తరలింపు వివాదంపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. వివాదానికి కారణమైన ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. ఆయనను సస్పెండ్ చేశారు.
ఇటీవల బాసర పుణ్యక్షేత్రంలోని సరస్వతీ మాత విగ్రహాన్ని ఓ స్కూల్‌లో అక్షరాభ్యాసం కోసం తరలించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. గుడిలోని అమ్మవారి విగ్రహాన్ని తరలించడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో మంత్రి చర్యలు తీసుకున్నారు.

కాగా, దేవస్థానంలోని పండితులు, ఉద్యోగుల మధ్య ఉన్న వర్గపోరే వివాదానికి కారణమని అంటున్నారు. ఇటీవలే పండితులు అమ్మవారికి ఆలస్యంగా నైవేద్యం సమర్పించారు. అది విమర్శలకు తావిచ్చింది.
అది మరిచిపోకముందే ప్రయివేటుగా అక్షర శ్రీకార పూజలు నిర్వహించిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో పండితులు, ఉద్యోగుల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరడమే కాదు.. ఈ గొడవకు రాజకీయ రంగూ పులుముకుంది.
రెండు వర్గాలు విడిపోయాయి. దేవస్థాన పండితుల మధ్య మూడు గ్రూపులు, ఆలయ ఉద్యోగుల్లో రెండు గ్రూపులు ఉన్నాయని తెలుస్తోంది. ఆలయంలో నెలకొంటున్న వివాదానికి స్థానిక నాయకులూ కారణమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగులు, పండితులందరు స్థానికులే కావడంతో ఆయా పార్టీ నాయకులు గ్రూపులకు వెనుక ఉండి మద్దతు పలుకుతున్నారు. నేతల మద్దతు ఉండటంతో దేవస్థానంలో కొందరు ఉద్యోగుల అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇక్కడికి వచ్చిన అధికారులు సైతం ఆయా గ్రూపులను పెంచి పోషిస్తున్నారని చెబుతున్నారు. దేవస్థానంలో ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస ఘటనలతో ఆలయంలో పరిపాలన అదుపు తప్పిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆలయ ప్రాంగణం నుంచి ఒక విగ్రహం తీసుకెళ్లితే వారం తర్వాత గుర్తించడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. స్పీకర్ మధుసూదనా చారి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆలయ సందర్శన సమయంలో ఆలయ అధికారులు అక్కడే ఉన్నప్పటికీ పండితులు అమ్మవారికి ఆలస్యంగా నైవేద్యం సమర్పించాల్సిన పరిస్థితి తలెత్తడం గాడితప్పిన పాలనకు నిదర్శనమనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
హైకోర్టులో పిటిషన్
బాసర ఆలయంలో ఇద్దరు పండితులు నల్గొండ జిల్లా దేవరకొండ ప్రయివేటు స్కూల్లో పూజలు నిర్వహించిన ఘటన నేపథ్యంలో గురువారం దేవస్థాన అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. సస్పెన్షన్‌కు గురైన ఇద్దరు పండితులు హైకోర్టు వెళ్లే యోచనలో ఉండటంతో ఈ మేరకు వారు నిర్ణయం తీసుకున్నారు. తమ వాదనలు విన్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని కోరారు.