తెలంగాణలో కొత్తగా 3603 కరోనా కేసులు: వైద్య సిబ్బందికి హరీశ్ రావు అభినందనలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 3,603 కొత్త పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఓ వ్యక్తి కోవిడ్ బారినపడి మృతిచెందాడు. కరోనా నుంచి 2,707 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,34,815కు చేరగా.. మొత్తం రికవరీ కేసులు 6,98,649కు పెరిగాయి. మృతుల సంఖ్య 4072కు పెరిగింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 93,397 నమూనాలను పరీక్షించామని.. ఇప్పటివరకు చేసిన టెస్ట్‌ల సంఖ్య 3,13,78,819గా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

56వేల పడకలు సిద్ధం
కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 56 వేల పడకలు ఏర్పాటు చేశామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కరోనా కేసులతో వస్తున్న రోగులకు సత్వర వైద్యం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇంటింటికీ ఫీవర్ సర్వే చేస్తూ... ఉచిత మెడికల్ కిట్లను అందిస్తున్నామని తెలిపారు. ఎవరూ కార్పోరేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని సూచించారు.
ప్రభుత్వం అందరికీ ఆరోగ్య భరోసా కల్పిస్తుందని మంత్రి తెలిపారు. ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకోవాలి, అనుమానం ఉంటే హోమ్ ఐసోలేషన్ కిట్ వాడాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు. ఇప్పటికే ప్రభుత్వం కరోనా ఎదుర్కొనేందుకు ఆరోగ్యశాఖ సన్నద్ధమైందని తెలిపారు.
వైద్య సిబ్బందికి హరీశ్ రావు అభినందనలు
కరోనా క్లిష్ట సమయంలో అద్భుత మైన వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని ట్విట్టర్ వేదికగా అభినందించారు మంత్రి హరీశ్ రావు. కరోనా వేళ రాష్ట్ర వైద్య సిబ్బంది అద్భుత సేవలు అందిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన గర్బిణికి కరోనా సోకినా,నిర్మల్ జిల్లా భైంసా ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవం చేయడంతో పాటు, జనగామ ఎంసీహెచ్ ఆస్పత్రిలో కరోనా సోకి క్లిష్ట పరిస్థితిలో ఉన్న గర్బిణికి సురక్షితంగా డెలివరీ చేశారు. క్లిష్ట పరిస్థితులలో వెలకట్టలేని సేవలందిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్న రాష్ట్ర వైద్య సిబ్బందికి అభినందనలు అని ప్రశంసించారు హరీష్ రావు.