తెలంగాణలో తగ్గని కరోనా ఉధృతి: 3944 కరోనా కేసులు, ముగ్గురు మృతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 3,944 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ సోకి ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,51,099 కాగా, మరణాల సంఖ్య 4,081కి పెరిగింది.
రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 7,07,498 ఉండగా, తాజాగా 2,444 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 94.20 శాతం ఉంది. ఇక ఐసోలేషన్లో 39,520 మంది ఉన్నట్లు తెలంగా వైద్య, ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.

ఇక, ఇవాళ మొత్తం 97,549 శాంపిల్స్ పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 3,17,76,018 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు, కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1372 మందికి మహమ్మారి సోకినట్లు తెలిపారు. తర్వత స్థానాల్లో మేడ్చల్ జిల్లాలో 288 మంది, రంగారెడ్డి జిల్లాలో 259 మంది, హన్మకొండ జిల్లాలో 117, ఖమ్మం జిల్లాలో 135, నిజామాబాద్ జిల్లాలో 105, సంగారెడ్డి 120 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇక, మిగిలిన జిల్లాల్లో 100 లోపే కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
భారతదేశంలో కోవిడ్-19
గురువారం, భారతదేశంలో వరుసగా మూడవ రోజు రోజుకు మూడు లక్షల కంటే తక్కువ కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, 24 గంటల్లో 2,86,384 తాజా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో, దేశం 573 కోవిడ్ -19 మరణాలు సంభవించాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 22,02,472కి తగ్గింది.
భారతదేశంలో మొత్తం కోవిడ్ -19 పాజిటివిటీ రేటు ప్రస్తుతం 17 శాతంగా ఉందని మీడియా సమావేశంలో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ సుజీత్ సింగ్ ఓమిక్రాన్ సబ్-వేరియంట్ BA.2 ఇప్పుడు భారతదేశంలో ఎక్కువగా ఉందని తెలియజేసారు.
అంతకుముందు, అంతర్జాతీయ ప్రయాణీకులను విశ్లేషించేటప్పుడు వేరియంట్ BA.1 మరింత ఆధిపత్యం చెలాయించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడులు ప్రస్తుతం అధిక పాజిటివిటీ రేటు నమోదవుతోంది.
కాగా, ఢిల్లీలో గురువారం కోవిడ్ -19 ఆంక్షలను సడలించినప్పటికీ, కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది, ఇంకా తమ రక్షణను వదలవద్దని కోరింది.