టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్: సంక్రాంతికి 4233 ప్రత్యేక బస్సులు, రిజర్వేషన్ కొన్నింటికే
హైదరాబాద్: సంక్రాంతి రెండు తెలుగు రాష్ట్రాలకూ పెద్ద పండగే. ఈ క్రమంలో సంక్రాంతి పర్వదినం సందర్బంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) మంచి వార్తను అందించింది.
సంక్రాంతికి సొంతుళ్లకు వెళ్లే ప్రజల కోసం 4,233 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. వచ్చే ఏడాది అంటే 2023 జనవరి 7 నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడపనుంది. వీటిలో 585 బస్సు సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు.

ఈ మేరకు టీఆర్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఆర్టీసీ అధికారులు, సిబ్బందితో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ 10 శాతం బస్సులను అదనంగా నడుపుతున్నట్లు ఆయన తెలిపారు.
ఈ మొత్తం 4,233 బస్సు సర్వీసుల్లో.. అమలాపురంకు 125, కాకినాడకు 117, కందుకూరుకు 83, విశాఖపట్నంకు 65, పోలవరానికి 51, రాజమండ్రికి 40 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. మరోవైపు ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్స్డ్ టికెట్ బుకింగ్‌ను 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచామని, వచ్చే ఏడాది జూన్ వరకు అందుబాటులో ఉంటుందని టీఎస్ఆర్టీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.