సోనియాపై అనుచిత వ్యాఖ్యలు?: అర్నాబ్ గోస్వామిపై తెలంగాణలో కేసు నమోదు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై తెలంగాణలో ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

అర్నాబ్‌పై కేసు నమోదు..
తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచన మేరకు టీపీసీసీ లీగల్ సెల్ ఛైర్మన్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి.. అర్నాబ్ గోస్వామిపై నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు నల్లకుంట పోలీసులు అర్నాబ్ పై కేసు నమోదు చేశారు.

సోనియాపై అనుచిత వ్యాఖ్యలంటూ..
టీవీ చర్చలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై అర్నాబ్ గోస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు అర్నాబ్ గోస్వామిపై ఫిర్యాదు చేశారు. అయితే, తనపై దాడికి కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, వాద్రా కుటుంబమే బాధ్యత వహించాలంటూ అర్నాబ్ గోస్వామి కూడా ముంబైలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

ముంబైలో అర్నాబ్ గోస్వామి ఫిర్యాదు..
కాగా, ముంబైలో బుధవారం రాత్రి ఆఫీసు నుంచి అర్నాబ్ గోస్వామి, ఆయన భార్య తమ కారులో ఇంటికి వెళుతుండగా కొందరు దుండగులు దాడి చేశారు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఇద్దరు దుండగులు గోస్వామి కారుపై నల్ల సిరా చల్లి బెదిరిస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేసి అక్కడ్నుంచి పరారయ్యారు. ఈ మేరకు అర్నాబ్ గోస్వామి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

దాడికి సోనియా, వాద్రాలదే బాధ్యత..
తనపై దాడి చేసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలేనని, అందుకే సోనియా గాంధీ, వాద్రా కుటుంబాలే బాధ్యత వహించాలని గోస్వామి డిమాండ్ చేస్తున్నారు. సోనియా, వాద్రా కుటుంబాలపై అనేక సందర్భాల్లో వచ్చిన తప్పుడు, నకిలీ వార్తలపై తానే స్వయంగా స్పందించి వారిపై ప్రజలకు ఓ స్పష్టత ఇచ్చానని తెలిపారు. అలాంటి తనపై దాడులు చేయడం సరికాదన్నారు. తాను ఇలాంటి దాడులకు భయపడనని అన్నారు. కాగా, గోస్వామిపై దాడిని ఖండించిన పలువురు కేంద్రమంత్రులు, నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.