విషాదం: కొనుగోలు ఆలస్యం.. ధాన్యం కుప్పపైనే కుప్పకూలి ప్రాణం వదిలిన రైతు
మెదక్: కామారెడ్డిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ధాన్యం కొనుగోళ్లలో జరిగిన జాప్యం ఓ రైతు మరణానికి కారణమైంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు బీరయ్య(57) గుండెపోటుతో మృతి చెందాడు.
ధాన్యం కొనుగోలు ఆలస్యమవుతుండటంతో తన ధాన్యం కుప్ప వద్ద కాపలా కోసం వచ్చిన రైతు బీరయ్య అక్కడే నిద్రించాడు. అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ధాన్యం కుప్పపైనే ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం తెల్లవారుజామున తోటి రైతులు చూసేసరికి విగత జీవిగా ఉండటంతో రైతులంతా కన్నీటిపర్యంతమయ్యారు.

రైతు బీరయ్యకు ఎకరం సొంత పొలం ఉండగా.. మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. ఇటీవల కోతలు పూర్తి చేసి అక్టోబర్ నెల 27న లింగంపేట కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాడు. అదే రోజు అక్కడున్న సిబ్బంది సీరియల్ నెంబర్ రాసుకోగా.. బీరయ్య వంతు 70 నెంబర్ వచ్చింది. అయితే, గత వారం రోజుల నుంచే లింగంపేట కేంద్రంలో కొనుగోళ్లు ప్రారంభించారు.
ఇక గురువారం దీపావళి, అంతకుముందు రోజు వర్షం కారణంగా కాంటా వేయలేదు. ధాన్యం కేంద్రానికి తెచ్చినప్పటి నుంచి రాత్రి, పగలు కాపలా ఉండాల్సి వస్తోంది. రాత్రిపూట కూడా రైతులు అక్కడే నిద్రిస్తున్నారు. ధాన్యం తూకం వేసేందుకు ఒక్కో రైతు సుమారు 20 రోజులకుపైగా ఎదురుచూడాల్సి వస్తుండటం గమనార్హం.
లింగంపేట కేంద్రానికి మొత్తం 207 మంది రైతులు ధాన్యం తీసుకురాగా, వారం రోజుల నుంచి కేవలం 23 మంది రైతులవే తూకం వేశారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటం, మూడు రోజులుగా కాంటా బంద్ ఉండటంతో రైతు బీరయ్య మానసికంగా ఆందోళన చెంది చనిపోయి ఉంటాడని తోటి రైతులు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 34 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, అన్ని చోట్లా కొనుగోళ్లలో కాలయపాయన జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోని పలు ప్రాంంతాల్లో కూడా ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు టీఆర్ఎస్ సర్కారుపై మండిపడుతున్నాయి. అయితే, రైతుల మొత్తం పంటను కొనుగోలు చేస్తామని మంత్రులు చెబుతున్నారు.