సిరిసిల్లలో వ్యభిచార కూపాలు... చదువు పేరుతో నరకం... ఆరేళ్ల తర్వాత విముక్తి...
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఓ వ్యభిచార గృహం నుంచి ఓ మైనర్ బాలికకు విముక్తికి లభించింది. ఆరేళ్లుగా వ్యభిచార కూపంలో చిక్కుకుపోయి నరకం అనుభవించిన ఆ బాలికను పోలీసుల సహాయంతో బంధువులు బయటకు తీసుకొచ్చారు. పట్టణంలో వ్యభిచార గృహాల నిర్వహణ యథేచ్చగా సాగుతున్నా... ఇన్నాళ్లు పోలీసులు,అధికారులు పట్టించుకోకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. మంత్రి కేటీఆర్ సొంత ఇలాఖాలో వెలుగుచూసిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది.

అసలేం జరిగింది...
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ బాలిక చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆరేళ్ల క్రితం ఓరోజు శ్రీరాంపూర్‌లోని తన నానమ్మ వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే శ్రీవాణి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని శ్రీవాణి ఆమెకు మాయ మాటలు చెప్పింది. నిన్ను నేనే చదివిస్తానని చెప్పి సిరిసిల్లకు తీసుకెళ్లి ఓ వ్యభిచార గృహంలో అమ్మేసింది. అప్పటినుంచి ఆ బాలిక అక్కడే చిక్కుకుపోయింది.

తెలియని ఆచూకీ..
బాలిక శ్రీవాణితో వెళ్లిన విషయం ఆమె నానమ్మకు గానీ బంధువులకు గానీ తెలియదు. దీంతో బాలిక కనిపించట్లేదంటూ ఆరేళ్ల క్రితం బెల్లంపల్లి పోలీస్ స్టేషన్లో బంధువులు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఓరోజు బాలిక మేనమామ రాజలింగుకు గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ వ్యక్తి బాలిక గురించి సమాచారం ఇవ్వడంతో ఆమె బంధువులు బెల్లంపల్లి నుంచి సిరిసిల్లకు వెళ్లారు.

ఆరేళ్లుగా నరకం అనుభవించానన్న బాలిక...
బాధిత బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి ఆమెకు విముక్తి కల్పించారు. ఆరేళ్లుగా అక్కడ నరకం అనుభవించానని బాలిక పోలీసులతో వాపోయింది. భువనగిరి,సిద్దిపేటలకు చెందిన మరికొందరు అమ్మాయిలు వ్యభిచార గృహంలో మగ్గుతున్నట్లు బాధిత బాలిక వెల్లడించినట్లు తెలుస్తోంది. నిజానికి ఇక్కడ వ్యభిచార గృహాల సంగతి స్థానికంగా అందరికీ తెలుసునని... అయినప్పటికీ ఏ అధికారి చర్యలు తీసుకోవట్లేదన్న విమర్శలున్నాయి. చిన్న పిల్లలను సైతం ఇక్కడి వ్యభిచార గృహాల్లో విక్రయిస్తుంటారన్న ప్రచారం ఉంది.

బలవంతంగా వ్యభిచారంలోకి...
ప్రస్తుతం అక్కడి వ్యభిచార గృహాల్లో మరో 10,15 మంది బాలికలు ఉండవచ్చునని సోషల్ మీడియాలో ప్రచారంలో జరుగుతోంది. వీరందరూ బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపబడ్డవారేనని చెబుతున్నారు. అయితే కొంతమంది తమకు తాముగా వ్యభిచార వృత్తిలోకి దిగినవారు కూడా ఉన్నారని తెలుస్తోంది. తాజాగా ఎస్పీ రాహుల్ హెగ్దే ఆదేశాల మేరకు పోలీసులు వ్యభిచార గృహాలపై దాడులు చేశారు. అక్కడి బాలికల ఆధార్, జనన ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. ఈ వృత్తిని మానేసి ఇకనైనా వేరే జీవనోపాధి చూసుకోవాలని నిర్వాహకులను హెచ్చరించారు.

గతంలోనూ సిరిసిల్లలో...
గతంలో ఇదే సిరిసిల్లలోని ఎస్సీ హాస్టల్లో క్యాటరింగ్ కాంట్రాక్టర్ దేవయ్య విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే. డబ్బులిస్తానని చెప్పి తమను లైంగికంగా లొంగదీసుకోవాలని చూసేవాడని అతనిపై కొంతమంది బాలికలు ఫిర్యాదు చేశారు. దీంతో దేవయ్యతో పాటు అతనికి సహకరించిన మహిళా వార్డెన్‌ను కూడా పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేశారు.