రేవంత్‌తో పంతం నెగ్గించుకున్న మహేశ్వర్ రెడ్డి-కొక్కిరాలకు షాక్-ఇంద్రవెల్లి సభ ముంగిట్లో కీలక పరిణామం
కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ఇంద్రవెల్లిలో ఈ నెల 9న కాంగ్రెస్ తలపెట్టిన దళిత గిరిజన దండోరా సభ నిర్వహణ బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును తప్పించడంలో ఆయన సఫలీకృతమయ్యారు.తాజాగా ఆ బాధ్యతలను కాంగ్రెస్ నాయకత్వం ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్‌కు అప్పగించింది. దీంతో కొక్కిరాలకు షాక్ ఇచ్చినట్లయింది. ఉమ్మడి జిల్లాలో కీలక నేతలుగా ఉన్న మహేశ్వర్ రెడ్డి,ప్రేమ్ సాగర్ రావుల మధ్య విభేదాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

జానారెడ్డి,షబ్బీర్ అలీలను రంగంలోకి దింపిన రేవంత్...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలక నేతలుగా ఉన్న మహేశ్వర్ రెడ్డి,ప్రేమ్ సాగర్ రావుల మధ్య చాలాకాలంగా విభేదాలు నెలకొన్నాయి. తాజాగా ప్రకటించిన ఇంద్రవెల్లి సభ వీరి మధ్య విభేదానలు మరోసారి బహిర్గతం చేసింది. ఈ సభ నిర్వహణ బాధ్యతలు రేవంత్ రెడ్డి ప్రేమ్ సాగర్ రావుకు అప్పగించడంతో మహేశ్వర్ రెడ్డి ఆగ్రహంతో రగిలిపోయారు. ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ గాంధీ భవన్లో రేవంత్‌పై ఫైర్ అయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పశ్చిమ ప్రాంతంలో జరిగే సభకు తూర్పు ప్రాంతానికి చెందిన నేతకు ఎలా బాధ్యతలు అప్పగిస్తారని నిలదీశారు.అప్పటినుంచి పార్టీతో కాస్త అంటీముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో మహేశ్వర్ రెడ్డిని చల్లబరిచేందుకు రేవంత్ సీనియర్లు జానారెడ్డి,షబ్బీర్ అలీలను రంగంలోకి దించారు.

అప్పటినుంచి దూరంగా మహేశ్వర్ రెడ్డి...
ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన హుజురాబాద్ ఎన్నికల సన్నద్ధ సమావేశానికి కూడా మహేశ్వర్ రెడ్డి దూరంగా ఉన్నారు. మరోవైపు ఇంద్రవెల్లి సభ ఏర్పాట్లను ఇటీవల ఎమ్మెల్యే సీతక్క,ప్రేమ్ సాగర్ రావు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నేతలు సైతం ప్రేమ్ సాగర్ రావుకు నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సభ గడువు దగ్గరపడుతున్న సమయంలో ఈ విభేదాలు పార్టీకి శ్రేయస్కరం కాదని భావించిన రేవంత్ రెడ్డి... మహేశ్వర్ రెడ్డి వద్దకు సీనియర్లను పంపించి రాయబారం నెరిపారు.

పంతంకం నెగ్గించుకున్న మహేశ్వర్ రెడ్డి...
పార్టీ నాయకత్వంపై అలక వీడాలని,పార్టీలో ఎవరికి ఇచ్చే ప్రాధాన్యం వారికి ఉంటుందని సీనియర్లు మహేశ్వర్ రెడ్డితో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే మహేశ్వర్ రెడ్డి మాత్రం ఇంద్రవెల్లి సభ నిర్వహణ బాధ్యతల నుంచి కొక్కిరాలను తప్పించాల్సిందేనని డిమాండ్ చేయడంతో అందుకు అంగీకరించక తప్పలేదని సమాచారం. దీంతో ఆ బాధ్యతలను ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్‌కు అప్పగించారు. ఈ నిర్ణయంతో మహేశ్వర్ రెడ్డి అలకవీడి మళ్లీ యాక్టివ్‌గా మారినట్లు తెలుస్తోంది.

కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు షాక్...
మరోవైపు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. నిజానికి సభ నిర్వహణ బాధ్యతలు అనూహ్యంగా ఆయన చేతిలోకి వచ్చాయి. అడగకుండానే రేవంత్ రెడ్డి ఆ బాధ్యతలు అప్పగించారు.
సభ ఏర్పాట్లు,జన సమీకరణ పనుల్లో ఆయన నిమగ్నమై ఉండగానే అనూహ్యంగా ఇప్పుడాయన్ను బాధ్యతల నుంచి తప్పించారు. ఇది రాష్ట్ర కాంగ్రెస్ కార్యక్రమని... కాబట్టి ఇందులో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ బాధ్యత ఏమీ ఉండదని ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నప్పటికీ... ఆయన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదు. దీంతో కొక్కిరాలకు ప్రాధాన్యం తగ్గించినట్లయింది. ఈ నేపథ్యంలో ఆయన సభకు హాజరవుతారా లేదా అన్న సందేహాలు,అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అనూహ్యంగా కొక్కిరాల చేతికి బాధ్యతలు... అంతలోనే షాక్...
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక హైదరాబాద్‌లోని చిరాన్ పోర్ట్ క్లబ్లో కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆయనతో భేటీ అయిన సంగతి తెలిసిందే. తన మద్దతుదారులు,మంచిర్యాల జిల్లా కార్యకర్తలతో భారీగా తరలివచ్చిన ఆయన జిల్లా కాంగ్రెస్ తరుపున రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తమ మధ్య విభేదాలేమీ లేవని స్పష్టం చేశారు. ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ... కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ నాయకత్వంలో పనిచేస్తామన్నారు. ఇదే సభలో ఇంద్రవెల్లి సభ బాధ్యతలను ప్రేమ్ సాగర్ రావుకు అప్పగిస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు. అయితే రాష్ట్ర కమిటీలో చర్చించకుండా ఇలా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడమేంటని మహేశ్వర్ రెడ్డి ఎదురు తిరిగారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌లో కీలక నేతలు...
నిజానికి మహేశ్వర్ రెడ్డి,ప్రేమ్ సాగర్ రావు ఇద్దరూ కాంగ్రెస్‌ను వీడే యోచనలో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకునే సూచనలు కనిపించట్లేదన్న కారణంతో బీజేపీలో చేరేందుకు మహేశ్వర్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే అప్పట్లో రేవంత్ రెడ్డే మహేశ్వర్ రెడ్డిని బీజేపీలోకి వెళ్లకుండా ఆపారన్న ప్రచారం ఉంది. త్వరలో తనకు టీపీసీసీ వస్తుందని... అంతదాకా వేచి చూడాలని రేవంత్ చెప్పడంతో ఆయన ప్రయత్నాలు విరమించుకున్నారనే ప్రచారం ఉంది. ఇటీవల మహేశ్వర్ రెడ్డి ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి రేవంత్‌తో కలిసి ఆయన యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ఇక కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గతంలో టీఆర్ఎస్లో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అవన్నీ ఊహాగానాలకే పరిమితమయ్యాయి తప్ప ఆయన పార్టీ మారలేదు. వైఎస్ హయాంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చక్రం తిప్పిన కొక్కిరాల... గతంలో మంచిర్యాల,కాగజ్ నగర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. రేవంత్ నాయకత్వంలో ప్రస్తుత మంచిర్యాల జిల్లాలో మళ్లీ తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన భార్య సురేఖ మంచిర్యాల డీసీసీగా వ్యవహరిస్తున్నారు.