కరోనా కేసుల పెరుగుదలతో తెలంగాణ సర్కారు కీలకనిర్ణయం; ప్రభుత్వ డాక్టర్లు, నర్సుల సెలవులు రద్దు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కరోనా థర్డ్ వేవ్ ఆందోళన కొనసాగుతోంది. దాదాపు రోజుకు 1000 కి పైగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్న పరిస్థితులలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ కారణంగా కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆరోగ్య శాఖ నుండి తదుపరి నోటీసు వచ్చే వరకు రాష్ట్రంలోని ఆరోగ్య సిబ్బందికి అన్ని సెలవులను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు గురువారం ప్రకటించారు. థర్డ్ వేవ్ కు రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులను సిద్ధం చెయ్యాలని ఆదేశించారు.

కరోనా ప్రస్తుత పరిస్థితిపై తెలంగాణా హెల్త్ డైరెక్టర్
విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రస్తుతం, రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ మరియు ప్రైవేట్ బెడ్లలో 2.3 శాతం మాత్రమే వినియోగంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఆసుపత్రిలో చేరడంలో పెరుగుదల లేదని, ఒమిక్రాన్ కారణంగా ఎటువంటి మరణం నివేదించబడలేదని వెల్లడించారు. కోవిడ్ పాజిటివ్‌గా మారిన చాలా మంది వ్యక్తులు ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా ఆసుపత్రిలో చేరడం తాము చూస్తున్నామని పేర్కొన్నారు. 93 కంటే తక్కువ ఆక్సిజన్ స్థాయి ఉన్నవారు మాత్రమే ఆసుపత్రిలో చేరాలని ఆయన పేర్కొన్నారు.

మూడవ వేవ్‌కు దాదాపు 27000 పడకలు సిద్ధం
రోగుల నుంచి అనవసరంగా ఫీజులు వసూలు చేయడం, అనవసర పరీక్షలు చేయడం వంటివి చేస్తే ఈసారి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా నేరుగా జరిమానా విధిస్తామని రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు ఆయన తెలియజేశారు. ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలను రెండు తరంగాల కోసం అభ్యర్థించిందని, ఈసారి నేరుగా జరిమానా విధిస్తామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ నొక్కి చెప్పారు. మూడవ వేవ్‌కు దాదాపు 27000 పడకలు సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

మూడో తరంగాన్ని ఎదుర్కొనేందుకు ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది
ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా నియంత్రణకు, ప్రస్తుత ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధతకు సంబంధించిన మొత్తం పరిస్థితిని సమీక్షించారని చెప్పారు. ఈ మూడో తరంగాన్ని ఎదుర్కొనేందుకు ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య పెరగడం హెచ్చరికను సూచిస్తుందని, స్వల్ప లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, హోమ్ ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల ద్వారా పరీక్షించుకోవాలని సూచించారు.

లాక్ డౌన్ అవకాశాలను కొట్టిపారేసిన హెల్త్ డైరెక్టర్
పీహెచ్సీలలో కూడా RAT కిట్లు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయన్నారు . రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల RAT కిట్లు మరియు 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లను సిద్ధంగా ఉంచింది అని ఆయన తెలియజేశారు. రాబోయే 4 వారాల పాటు అన్ని ప్రజా కార్యక్రమాలను రద్దు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అన్ని రాజకీయ పార్టీలను అభ్యర్థించింది.
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా గుంపులు గా లేకుండా వ్యవహరించాలని కోరారు.లాక్ డౌన్ ప్రకటించే అవకాశాలను హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ కొట్టిపారేశారు. ప్రస్తుతం, మహమ్మారిని నియంత్రించడానికి మేము ఇతర పద్ధతులను ఉపయోగిస్తామని, లాక్డౌన్లు జీవనోపాధిపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. కోట్లాది మంది పౌరులకు ఇబ్బంది కలిగిస్తాయని ఆయన అన్నారు.