నేటి నుంచే కాషాయం పండుగ: ఎన్నికలు - టార్గెట్ టీఆర్ఎస్ : పీఎంకు తలసాని స్వాగతం..!!
రెండు రోజుల కాషాయం పండుగ నేటి నుంచి ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. దీని కోసం కమలదళం నగరంలో మోహరించింది. ప్రధాని మోదీ ఈ మధ్నాహ్నం నగరానికి రానున్నారు. పార్టీ ప్రముఖ నేతలు.. కేంద్ర మంత్రులు.. బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు నగరంలోనే మకాం వేసారు. 2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించటం.. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కోవటం ఈ సారి సమవేశంలో ప్రధాన అజెండాగా మారుతోంది. ప్రధాని మోదీ పైన రాజకీయంగా దండ యాత్ర ప్రకటించిన సీఎం కేసీఆర్.. ప్రధాని స్వాగత కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు.

ప్రధానికి మంత్రి తలసాని స్వాగతం
రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్వాగతం పలుకుతారు. రెండు రోజుల సమావేశాల్లో తీర్మానాలు- రేపు జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగం పైన ఆసక్తి నెలకొని ఉంది. పలు రాష్ట్రాల్లో వరుసగా రానున్న ఎన్నికలు..దక్షిణాదిన పార్టీ విస్తరణ..ఎనిమిదేళ్ల మోదీ పాలన పైన సమీక్ష.. ప్రజల్లోకి మరింత విస్తృతంగా కేంద్ర నిర్ణయాలను తీసుకెళ్లడం పైన ఈ కార్యవర్గ సమావేశాల్లో అధినాయకత్వం దిశా నిర్దేశం చేయనుంది.
ఇప్పటికే బీజేపీ చీఫ్ నడ్డా నగరానికి చేరుకున్నారు. ప్రధానితో పాటుగా అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, గడ్కరీ తదితరులు ఈ రోజు నగరానికి చేరుకుంటారు. సమావేశాల కోసం మాదాపూర్ హెచ్ఐసీసీ (కాకతీయ) ప్రాంగణాన్ని సిద్దం చేసారు. వరుసగా రెండు సార్లు అధికారం దక్కించుకున్న బీజేపీ నాయకత్వం చేసింది.

ఎన్నికలు - టార్గెట్ టీఆర్ఎస్
మరో రెండేళ్లలోగానే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.. ఈలోగా పలు రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికల్లో విజయం సాధించడం కీలకంగా భావిస్తోంది. దీనికి ముందుగానే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రత్యేకించి తెలంగాణలో పాగా వేయడంపై ఈ కార్యవర్గ సమావేశాల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశముంది.
దక్షిణాదిలో కర్ణాటక, పుదుచ్చేరిలలో భాజపా అధికారంలో ఉంది. తమిళనాడు, కేరళలలో ఇప్పుడా అవకాశం లేదు కాబట్టి కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తిరిగి గెలవడంతోపాటు తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవడం తమలక్ష్యమని పార్టీ నాయకత్వం స్పష్టం చేస్తోంది. టార్గెట్ కేసీఆర్ అన్నట్లుగా హైదరాబాద్ వేదికగా పార్టీ నాయకత్వం వచ్చే ఎన్నికల వరకూ ఇక్కడ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేందుకు సిద్దమైంది. ముఖ్యనాయకులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి పార్టీకి అనుకూలమైన వాతావరణం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రధాని బహిరంగ సభ పై ఉత్కంఠ
రేపు ప్రధాని పాల్గొనే సభలో తెలంగాణ బీజేపీ లక్ష్యం.. కార్యాచరణ పైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇక, జాతీయ సమావేశాల్లో భాగంగా అగ్నిపథ్ ప్రకటన..తర్వాత తలెత్తిన పర్యవసానాల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న,చోట కేంద్రం ఇచ్చే సాయం గురించి నేరుగా లబ్ధిదారులకు సమాచారం అందేలా చేయటం పైనా నిర్ణయం తీసుకోనున్నారు.
భారీ హోర్డింగులు, బ్యానర్లు, పోస్టర్లు, జెండాలతో నగరాన్ని కాషాయమయం చేశారు. సుమారు 350 మంది కార్యవర్గ సమావేశానికి హాజరవుతున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ కౌంటర్ కార్యక్రమాలకు సిద్దం అవుతోంది. దీంతో..రెండు రోజుల పాటు హైదరాబాద్ కేంద్రంగా రాజకీయ వాతావరణం హీటెక్కటం ఖాయంగా కనిపిస్తోంది.