andhra pradesh telangana state tamilnadu drinking water minister CM kcr AP ys jagan mohan reddy ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు సీఎం కేసీఆర్ మంత్రులు ఏపీ
తమిళనాడులో నీటి కటకట.. తాగునీరు ఇచ్చేందుకు కేసీఆర్, జగన్ అంగీకారం, కానీ లేఖ...
తమిళనాడుకు తాగునీరు ఇవ్వడానికి సీఎం కేసీఆర్ అంగీకరించారు. తమ రాష్ట్రానికి నీరు ఇవ్వాలని తమిళనాడు మంత్రులు సీఎంను కోరగా.. సానుకూలంగా స్పందించారు. దీనిపై తమిళనాడు సీఎం పళనిస్వామి నుంచి తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులకు లేఖ రాయాలని సూచించారు. తమిళనాడు ప్రతిపాదన అందాక మూడు రాష్ట్రాల అధికారులు, నిపుణుల స్థాయి సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. అధికారులు నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని సంకేతాలు ఇచ్చారు.

రాష్ట్రాల మధ్య సంబంధాలకు మార్గదర్శకంగా మారతాయని కేసీఆర్ విశ్వసించారు. తాగునీటి అవసరాల విషయంలో రాష్ట్రాల మధ్య సహనపూరిత వాతావరణం కలిగి ఉండాలన్నారు. తమిళనాడు తాగునీటి సమస్య గురించి నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ప్రస్తావించానని కేసీఆర్ గుర్తుచేశారు. 70 వేల టీఎంసీ నీటి వనరుల్లో వ్యవసాయ అవసరాలకు పోగా 30 వేల టీఎంసీల మిగులు నీటి వనరులు ఉన్నాయి. 10 వేల టీఎంసీ నీటిని వినియోగించుకున్నా.. తాగునీటి సమస్య పరిష్కారమవుతోందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ వద్ద ఉన్న సమయంలో తమిళనాడు మంత్రులు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఇందుకు జగన్ కూడా సానుకూలంగా స్పందించారు. తమిళనాడు తాగునీటి సమస్యల తెలిసిన విషయమేనని.. సాయం చేద్దామనేలా కేసీఆర్ కల్పించుకొని మాట్లాడారు. ఇందుకు జగన్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. తమిళనాడు ప్రభుత్వం నుంచి లేఖ వస్తే.. అధికారుల సమావేశంతో నీటి విడుదలపై స్పష్టత రానుంది. ఈ సమావేశంలో తమిళనాడు మంత్రులు ఎస్పీ వేలుమణి, డీ జయకుమార్, తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.