వివాహితపై కన్ను: భర్త హత్యకు సుపారీ, స్లో పాయిజన్, నిందితుడు పోలీసులకు చిక్కాడిలా
హైదరాబాద్:వివాహితపై కన్నేసిన ఓ వ్యక్తి ఆమెను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించాడు. అంతేకాదు ఆమె భర్తను హత్య చేసేందుకు సుఫారీ ఇచ్చాడు.అయితే ఎట్టకేలకు ఈ విషయాన్ని పోలీసులు చేధించారు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లైంగిక వేధింపులకు సంబంధించి ప్రభుత్వాలు కఠిన చట్టాలు చేస్తున్నా కామాంధుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. మహిళల బలహీనతలు, లేదా వారి కుటుంబ పరిస్థితులను ఆసరాగా చేసుకొని కామాంధులు వారిని లోబర్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
హైద్రాబాద్ బంజారాహిల్స్ర్ లో ఓ వివాహితను ఓ ప్రైవేట్ ఆసుప్రతిలో పనిచేసే ఓ వ్యక్తి లోబర్చుకొనేందుకు ప్రయత్నించాడు. ఆమెను వివాహం చేసుకొనేందుకుగాను అడ్డుగా ఉన్నాడని భర్తను కూడ చంపేందుకు ఓ వ్యక్తికి సుపారీ ఇచ్చాడు అయితే సుపారీ తీసుకొన్న వ్యక్తి అసలు విషయాన్ని పోలీసులకు చెప్పడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివాహితను వలలో వేసుకొనే ప్లాన్
హైద్రాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14 వెంకటేశ్వర నగర్ కమ్యూనిటీ హల్ ప్రాంతానికి చెందిన మాల్యాద్రి అనే వ్యక్తి జూబ్లీహిల్స్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో స్పెషల్ క్వాలిటీ మెయింటెన్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. అతడికి వివాహమై భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 2న, శ్రీకృష్ణానగర్ కు చెందిన ఓ వివాహిత, తన భర్త కాలుజారి పడడంతో కాలు విరిగిపోయింది అంబులెన్స్ కోసం ఫోన్ చేస్తే మాల్యాద్రి ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఆ వివాహితను తన వలలో వేసుకొనేందుకు ప్లాన్ చేశాడు.

ఫిజియోథెరపిస్ట్తో ప్రతి రోజూఇంటికి
ప్రైవేట్ ఆసుప్రతికి ట్రీట్ మెంట్ చేసుకొన్న తర్వాత బాధితుడి ఇంటికి ఫిజియోథెరపిస్టును తీసుకొచ్చి సదరు యువతి భర్తకు మాల్యాద్రి మసాజ్ లు చేయించేవాడు. ఈ వంకతో అక్కడే ఎక్కువసేపు గడిపేవాడు. ఆ వివాహితను ఎలాగైనా తన వలలో వసేకొనేందుకు శత విధాల ప్రయత్నాలు చేశాడు.ఆ కుటుంబానికి అండగా ఉంటానని నమ్మించాడు. అవకాశం కోసం ఎదురుచూడసాగాడు.

ఉద్యోగం ఇప్పిస్తానని ఇలా
వివాహిత ఎమ్మెస్సీ నర్సిగ్ పూర్తి చేసింది. అంతేకాదుఆమె మూడు పీజీలు చేసింది. అయితే ఉన్నత విద్యావంతురాలైన ఆమెకు ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం కల్పిస్తామని భర్తను నమ్మించాడు మాల్యాద్రి వివరాలను నమోదు చేసుకొనేందుకు గాను భార్య, భర్తల ఫోన్లను తీసుకొని ఓ యాప్ ను క్రియేట్ చేశాడు. ఈ యాప్ ద్వారా భార్య, భర్తలు ఏం మాట్లాడుతున్నారనే విషయాలను తెలుసుకొనేవాడు.ఆమె ఎక్కడికి వెళ్ళేది తెలుసుకొనేవాడు. భార్యపై భర్తకు అనుమానం కలిగేలా చేశాడు. భర్త పేరుతో రాసినట్టుగా అపోలో ఆసుపత్రికి లేఖలు రాశాడు.

వివాహిత భర్తను హత్య చేసే కుట్ర
ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వివాహితను లోబర్చుకొనేందుకు పక్కా ప్లాన్ ను అమలు చేశాడు. వివాహితకు తన మధ్య వివాహేతర సంబంధం ఉందని అనుమానించి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిందని వివాహితకు చెప్పాడు. దీంతో భయంతో ఆ వివాహిత పుట్టింటికి వెళ్ళిపోయింది. శాశ్వతంగా వివాహిత భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు. నందినగర్ కు చెందిన ఓ వ్యక్తిని కలిసి వివాహిత భర్తను హత్య చేయాలని సుపారీ ఇచ్చాడు. అయితే సుపారీ తీసుకొన్న వ్యక్తి అసలు విషయం పోలీసులకు చెప్పాడు.

పోలీసుల విచారణలో తేలిన వాస్తవాలు
ఈ విషయమై పోలీసులు విచారణ చేస్తే మరిన్ని ఆసక్తి కరమైన విషయాలు వెలుగు చూశాయి. వివాహిత భర్తను హత్య చేయడం సాధ్యం కాకపోతే , స్లో పాయిజన్ ఇవ్వడం ద్వారా శాశ్వతంగా మంచానికే పరిమితం చేయాలని ప్లాన్ చేశాడు. ఈ మేరకు ఈ ప్లాన్ ను అమలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. భర్త మంచానికే పరిమితమైతే ఆమెను శాశ్వతంగా తన వద్దే ఉంచుకోవచ్చని ఆయన ప్లాన్ చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.