
కోదండరామ్‌కు అరవింద్ కేజ్రీవాల్ బంపర్ ఆఫర్.. విలీనంపై పార్టీ నేతలతో కీలకభేటీ; నిర్ణయం అదేనా!!
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ జన సమితి పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనను వ్యతిరేకిస్తూ, ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కేసీఆర్ తీరును నిరసిస్తూ కోదండరాం తెలంగాణ జన సమితి పార్టీతో ప్రజల్లోకి వెళ్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో రాణించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కోదండరాం పార్టీ తెలంగాణ లో పెద్దగా ఆదరణ పొందుతున్న దాఖలాలు కనిపించలేదు.

కోదండరామ్ కు ఆమ్ ఆద్మీ పార్టీ బంపర్ ఆఫర్
ఈ నేపథ్యంలో కోదండరామ్ కు ఉన్న మంచి నేపథ్యం కారణంగా ఆయనను గతంలోనే రెండు ప్రముఖ జాతీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కోదండరాం పార్టీ అయిన తెలంగాణ జన సమితిని తమ పార్టీలో విలీనం చేయాలని చర్చలు జరిపారు. కాని కోదండరాం ఇప్పటి వరకూ పార్టీని ఏ పార్టీలోనూ విలీనం చేయకుండా తెలంగాణ సర్కార్ పై నిరసన గళం వినిపిస్తూ కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక తాజాగా పంజాబ్‌లో ప్రభంజనం సృష్టించి అధికారాన్ని చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కోదండరాం పార్టీ ని ఆమ్ ఆద్మీ పార్టీలో విలీనం చేయాలని ప్రతిపాదనలు పెట్టినట్టు సమాచారం.

తెలంగాణా జనసమితి నేతలతో కోదండరామ్ రహస్య సమావేశం
ఇక ఈ నేపథ్యంలోనే తెలంగాణ జన సమితి పార్టీని విలీనం చేయడం గురించి ఇబ్రహీంపట్నం పరిధిలోని రావిరాల ఫామ్ హౌజ్ లో తెలంగాణ జన సమితి నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి కోదండరాం తో పాటు, ముఖ్య నేతలంతా హాజరయ్యారు. ఈ విషయం పై కోదండరాం పార్టీ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది.
రహస్యంగా నిర్వహించిన ఈ భేటీలో ఎక్కువ మంది నేతలు తెలంగాణ జన సమితి పార్టీని ఆమ్ఆద్మీ పార్టీలో విలీనం చేయడానికి మొగ్గు చూపినట్లు గా తెలుస్తుంది. అయితే టీజేఎస్ అధినేత కోదండరాం మాత్రం ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా అప్పటి దాకా వేచి చూసే ధోరణి అవలంబిద్దామని, అప్పుడు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుందామని నాయకులకు సూచించినట్టు సమాచారం.

తెలంగాణాపై ఆమ్ ఆద్మీ ఫోకస్ ... విలీనం కోసం టీజేఎస్ నేతలతో చర్చలు
తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల పై ఫోకస్ చేస్తూ ఆ ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్న తరుణంలో, తెలంగాణ రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కోదండరాం పార్టీ ని విలీనం చేయడం కోసం టీజేఎస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. పంజాబ్ ఎన్నికల్లో విజయం తర్వాత జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్రంపై కూడా ఫోకస్ చేస్తోంది.
అందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేత టీజేఎస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇక ఇదే సమయంలో ఈ నేపథ్యంలోనే ఒకటి రెండు రోజుల్లో అరవింద్ కేజ్రీవాల్ హైదరాబాద్ కు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

తెలంగాణాలో భవిష్యత్ ఎన్నికల రాజకీయాలలో కీలక పరిణామాలు
ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికలను ఫోకస్ చేస్తూ అటు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఎవరి వ్యూహాల్లో వారు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతుంటే, మూడవసారి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవడం లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు సాగిస్తుంది. మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వైయస్సార్ తెలంగాణ పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి దూకుడు చూపిస్తుంటే, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి కొత్త పార్టీలు కూడా ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల రాజకీయాలు ఊహించని పరిణామాలకు కేంద్రంగా మారతాయని తాజా పరిస్థితులను బట్టి అర్థమవుతుంది.