బాలు పాటలు రోజూ పాడుకుంటానన్న బాలకృష్ణ .. దేవుడు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదన్న కళాతపస్వి
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అస్తమయం తెలుగు సినీ ప్రపంచానికి మాత్రమే కాదు, భారతీయ సినీ ప్రపంచానికి తీరనిలోటని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేని లోటు పూరించలేనిదని ఆవేదనకు గురవుతున్నారు. నందమూరి బాలకృష్ణ , కళాతపస్వి విశ్వనాధ్ తమ స్పందన తెలియజేశారు . ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
ఎస్పీ బాలు గాత్రం అజరామరం అన్న చంద్రబాబు .. మిస్ అవుతున్నానంటూ రజనీకాంత్ .. మమతా బెనర్జీ కూడా ..

ఎస్పీ బాలు నిష్క్రమణ యావత్ సినీ ప్రపంచానికే తీరని లోటు : బాలకృష్ణ
ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపట్ల సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. 16 భాషల్లో 40 వేల పాటలకు పైగా పాడిన భారతదేశం గర్వించే గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నిష్క్రమణ యావత్ సినీ ప్రపంచానికి తీరని లోటు అని ఆయన అభివర్ణించారు. వ్యక్తిగతంగా తనకు బాలుతో ఉన్న అనుబంధాన్ని గురించి ఆయన గుర్తు చేసుకున్నారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం తన తండ్రి ఎన్టీఆర్ కు, తనకు కూడా అద్భుతమైన పాటలు పాడారని, ఇప్పటికీ ప్రతి రోజు ఆ పాటలు వింటూ ఉంటానని ఆయన పేర్కొన్నారు.

ఆ పాట రోజూ పాడుకుంటా .. ఆయన్ను గుర్తు చేసుకుంటా : బాలయ్య
తమ సినిమాల కోసం చాలా అద్భుతమైన పాటలు బాల సుబ్రహ్మణ్యం పాడారని బాలకృష్ణ పేర్కొన్నారు. ముఖ్యంగా భైరవద్వీపం సినిమా లో ఆయన ఆలపించిన శ్రీతుంబుర నారద నాదామృతం పాటను ఎప్పుడూ పాడుకుంటూనే ఉంటానని పేర్కొన్నారు. ఆయన పాటలను పాడుకుంటూ ప్రతిక్షణం ఎస్పీ బాలసుబ్రమణ్యం ని తలచుకుంటూ ఉన్నానని బాలకృష్ణ చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప గాయకుడు, గొప్ప వ్యక్తి మనతో లేకపోవడం ఎంతో విచారకరమని ఆయన పేర్కొన్నారు. బాలసుబ్రమణ్యం పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా అంటూ బాలకృష్ణ తెలిపారు.

దేవుడు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదు : కళాతపస్వి విశ్వనాధ్
ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపట్ల కళాతపస్వి కె.విశ్వనాథ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన నోట మాటలు రావడం లేదని భగవంతుడు ఇంత అన్యాయం చేస్తాడని అనుకోలేదు అంటూ ఆయన బాధ పడ్డారు. ఇంత తొందరగా బాలు ఈ లోకాన్ని వదలి వెళతారని అనుకోలేదని పేర్కొన్నారు. బాలసుబ్రహ్మణ్యం తన సోదరుడే కాదు తనకు ఆరో ప్రాణం అని ఇలాంటి సమయంలో మాట్లాడటానికి మాటలు కూడా రావటం లేదని కళా తపస్వి విశ్వనాధ్ బాలు ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులంతా దీన్ని సహించవలసిన సమయమని ఇంతకంటే తానేమీ మాట్లాడలేనని విశ్వనాథ్ చెప్పారు.

పార్థివ దేహాన్ని సందర్శిస్తున్న సినీ ప్రముఖులు , అభిమానులు
మరోపక్క బాలసుబ్రమణ్యం పార్ధివదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రి నుండి కోడంబాకంలోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు . ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం నివాసంలో ఏర్పాట్లు చేశారు. బాలసుబ్రహ్మణ్యం నివాసం వద్ద ఇప్పటికే అభిమానులు భారీగా చేరుకున్నారు. తమ అభిమాన గాయకుడు భౌతికకాయం వద్ద అశ్రునివాళి అర్పిస్తున్నారు. సినీ ప్రముఖులు ఆయన ఇంటికి తరలి వెళుతున్నారు .అస్తమించిన బాలసుబ్రమణ్యం ను చూసి కన్నీటి పర్యంతం అవుతున్నారు. అటువంటి మహానుభావుడ్ని కోల్పోవడం, భరతమాత ముద్దుబిడ్డని కోల్పోవడమే అని పలువురు పేర్కొంటున్నారు.

సంగీత ప్రపంచాన్ని శోక సంద్రంలో ముంచి దివికేగిన ధృవతార
గత నలభై రోజులుగా చెన్నై ఆసుపత్రిలో అనారోగ్యంతో పోరాటం చేసిన బాలసుబ్రమణ్యం చివరకు నేడు తుది శ్వాస విడిచారు. అందరినీ విడిచి దివికేగిన ధ్రువతారగా మారారు.
తెలుగు సినీ చరిత్రలోనే ఈ రోజు అత్యంత విషాదకరమైన రోజుగా పేర్కొంటున్నారు .
ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణంతో సంగీత ప్రపంచ శోకసంద్రంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరిగి కోలుకోవాలని పలువురు ప్రముఖులు, దేశ విదేశాల్లో ఉన్న ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పూజలు, ప్రార్థనలు చేశారు. అయినప్పటికీ ఆయన అందరినీ విడిచి సెలవంటూ వెళ్ళిపోయారు .