ప్రజల కన్నా ప్రాజెక్టులే మిన్న.. కేసీఆర్పై దత్తన్న ఫైర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతుంది. సీఎం కేసీఆర్ లక్ష్యంగా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని మండిపడుతున్నారు. తాజాగా కేసీఆర్పై బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఫైరయ్యారు. కేసీఆర్కు ప్రజల కన్నా .. ప్రాజెక్టులే మిన్న అని మండిపడ్డారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ. రాష్ట్రానికి ప్రాజెక్టులు అవసరమేనని అభిప్రాయపడ్డారు. కానీ ముందు ప్రజలు అని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రజలను మరచి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని విమర్శించారు. ఎప్పుడు ప్రాజెక్టుల పేరుతో కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పేరుకుపోయిందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న నిధులను కూడా సక్రమంగా వినియోగించడం లేదని విమర్శించారు.

ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా ఏకీపారేశారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావ లాంటిదని విమర్శించారు. ఆ పార్టీ బలహీనత బలమైన నాయకత్వం లేకపోవడమేనన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని కేసీఆర్ను డిమాండ్ చేశారు. విమోచన దినం ఎందుకు జరపడం లేదని కేసీఆర్ను ప్రశ్నిస్తున్నారు.