
మీ చిల్లరబుద్దిని చూడలేకే.. పంచాయతీ నిధులు నేరుగా.. కేసీఆర్ కు బండి సంజయ్ కౌంటర్
మీ చిల్లర బుద్దిని చూడలేకే పంచాయతీ నిధులు నేరుగా కేంద్రం పంచాయతీలకు ఇస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. పంచాయతీ నిధులు నేరుగా పంచాయతీలకు కేంద్రం ఇవ్వడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. ఇక రాష్ట్రాలు ఉన్నది ఎందుకు అంటూ ప్రశ్నించారు. కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ కు ఘాటుగా బదులిచ్చారు.

కమీషన్ల కోసం పంచాయితీ నిధుల దారి మళ్లింపు .. ఆపేందుకే కేంద్రం నిర్ణయం
మీ కమీషన్ల కోసం పంచాయతీ నిధుల దారి మళ్లింపు చేస్తున్నారని, వాటిని ఆపేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని బండి సంజయ్ పేర్కొన్నారు. 73, 74 రాజ్యాంగ సవరణ స్పూర్తి మేరకే గ్రామాలకు నేరుగా నిధులు ఇస్తున్నారని బండి సంజయ్ వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో సర్పంచులు అడుక్కుతినే దుస్థితికి చేరింది వాస్తవం కాదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇక పంచాయతీలకు నిధుల విషయంలో మీ తప్పులను ప్రశ్నించిన సర్పంచులను సస్పెండ్ చేస్తున్నది నిజం కాదా? అంటూ బండి సంజయ్ నిలదీశారు.

పంచాయతీల అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకుంటుంది
గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులివ్వడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చిల్లర వ్యవహారంగా పేర్కొంటూ తప్పుపట్టడం దురదృష్టకరమని పేర్కొన్న బండి సంజయ్ రాజ్యాంగ స్పూర్తి మేరకే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులిస్తూ లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుస్తోందని తెలిపారు. విద్య, వైద్యం సహా 29 అంశాలను గ్రామాలకే బదలాయించాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నా... రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడుస్తూ గ్రామ పంచాయతీల అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకున్నదని ఆరోపించారు.

గ్రామ పంచాయతీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన కేసీఆర్ ది చిల్లర బుద్ది
రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇండ్లు సహా వివిధ పథకాలకు సంబంధించి లబ్ది దారుల ఎంపిక గ్రామ సభల ద్వారానే జరగాల్సి ఉన్నా వాటిపై ఎమ్మెల్యేలకు పెత్తనమిచ్చి గ్రామ పంచాయతీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన కేసీఆర్ ది చిల్లర బుద్ది కాక ఏమనాలి? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. కమీషన్ల కోసం గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులు పక్కదారి పట్టిస్తున్నారని, కమీషన్ల కోసం ట్రాక్టర్లు కొంటున్నది వాస్తవం కాదా? కేంద్ర నిధులను జీతాలకు మళ్లిస్తోంది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు.

కేసీఆర్ చేతగానితనం వల్ల సర్పంచ్ లకు కష్టాలు
గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నది నిజం కాదా? కేసీఆర్ చేతగానితనంవల్ల సర్పంచులు ఉన్న ఆస్తులను అమ్ముకుని అప్పులపాలై ఉపాధి కూలీలుగా, వాచ్ మెన్లుగా, సెక్యూరిటీ ఉద్యోగులుగా కాలం వెళ్లదీస్తున్నది వాస్తవం కాదా? అంటూ బండి సంజయ్ నిలదీశారు. గ్రామ పంచాయతీలు అంటే ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తి కేసీఆర్ అంటూ మండిపడ్డారు. ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలకు ప్రోత్సాహక నిధులు ఇవ్వకుండా ఏళ్ళ తరబడి జాప్యం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.

కేసీఆర్ కేంద్రం పై విమర్శలు చేయడం సిగ్గుచేటు
తండాలను పంచాయతీలుగా మార్చి నిధులు ఇవ్వకుండా తండాలను నిర్వీర్యం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని వేల కోట్ల కమీషన్లు దండుకుని పూర్తిగా దివాలా తీయించి అప్పుల కుప్పగా మార్చారని విరుచుకుపడ్డారు. అలాంటి కేసీఆర్ కేంద్రం పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.
ఉపాధి హామీ పథకం నిధులు విడుదల చేస్తున్నా వాటిని నెలల తరబడి చెల్లించకుండా కూలీలను ఇబ్బంది పెడుతున్నారు అంటూ మండిపడ్డారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం ఎన్నో నిధులు ఇస్తుంటే వాటిని గ్రామాల అభివృద్ధికి చేరనీయకుండా కమీషన్ల కోసం పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. మోడీ పాలన పై, కేంద్ర ప్రభుత్వం పై కెసిఆర్ విమర్శలు చేయడాన్ని మానుకోవాలని, లేదంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు తగిన బుద్ధి చెబుతారని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు.