కేసీఆర్కు బండి సంజయ్ లేఖ: రైతుల కోసం డిమాండ్లు; ఉగాది వరకు డెడ్లైన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మీరు రాసిన బహిరంగ లేఖ యావత్తు పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని బండి సంజయ్ లేఖ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన బండి సంజయ్
ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ రాసిన లేఖ కేవలం ప్రజలను తప్పుదారి పట్టించడం కోసమేనని బండి సంజయ్ పేర్కొన్నారు. 317 జీవోను సవరించాలి అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన భారతీయ జనతా పార్టీ తీవ్రమైన ఉద్యమాలు చేస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పట్ల కూడా బిజెపి ఉద్భవిస్తుందని బండి సంజయ్ వెల్లడించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని నిరుద్యోగుల పక్షాన మహోద్యమానికి శ్రీకారం చుట్టామని బండి సంజయ్ పేర్కొన్నారు.

ప్రజల మైండ్ డైవర్ట్ చెయ్యటం కోసం మోడీకి కేసీఆర్ లేఖ రాశారన్న బండి సంజయ్
అయితే రాష్ట్రంలో బిజెపి చేస్తున్న ఉద్యమం ద్వారా ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసి ప్రజల మైండ్ డైవర్ట్ చేశాడని, తద్వారా కొత్త డ్రామాకు తెరతీశారు అని బండి సంజయ్ బహిరంగ లేఖ ద్వారా పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల అనుసరిస్తున్న విధానాల వల్ల సంతోషంగా సంక్రాంతి పండుగను చేసుకోవాల్సిన రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు నేడు కన్నీళ్ళతో సకినాల పిండిని తడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని బండి సంజయ్ పేర్కొన్నారు.

చేసిన తప్పులు దిద్దుకోకుండా ఎదురుదాడి .. రాజకీయ డ్రామాలన్న బండి సంజయ్
చేసిన తప్పులను సరిదిద్దు కోకుండా ఎదురు దాడి చేస్తూ రాజకీయ డ్రామాలు ఆడుతున్న కారణంగా ఇక ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో తాము బహిరంగ లేఖ రాస్తున్నానని వెల్లడించారు బండి సంజయ్. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి కేంద్రం పని చేస్తుందని బండి సంజయ్ వెల్లడించారు. ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలులో భాగంగా ఏటా కనీస మద్దతు ధర పెంచడంతో పాటు రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టిందని బండి సంజయ్ పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ డెడ్ లైన్
సీఎం కేసీఆర్ ముందు పలు డిమాండ్లను ఉంచిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాటిని ఉగాది వరకు అమలు చేయాలని డెడ్లైన్ విధించారు. లేకుంటే కేసీఆర్ సర్కార్ పై ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బండి సంజయ్ సీఎం కేసీఆర్ ముందు ఉంచిన డిమాండ్లు పరిశీలిస్తే 2017 ఏప్రిల్ 13న మీరు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర రైతాంగానికి ఉచితంగా ఎరువులను సరఫరా చేయాలని బండి సంజయ్ సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలన్నారు.

డిమాండ్లు నెరవేర్చాలన్న బండి సంజయ్
కేంద్రం కేటాయించిన నిధులను తక్షణమే ఖర్చు చేసి రైతుల పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించడంతో పాటు పంటల ప్రణాళికలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఒడ్లు, పత్తి, మొక్కజొన్న సహా రైతులు పండించే పంటలకు క్వింటాలుకు 500 రూపాయల చొప్పున బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. విత్తన సబ్సిడీని పూర్తిగా అమలు చేయాలని, నకిలీ విత్తనాలను పూర్తిగా అరికట్టాలని వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రైతాంగ సంక్షేమం కోసం కేసీఆర్ పై ఒత్తిడికి వెనకాడం
గతంలో ఇచ్చిన ఈ మేరకు పాలీహౌస్ సబ్సిడీని పునరుద్ధరించాలని ఎస్సీ, ఎస్టీ రైతులకు అదనపు పాలీహౌస్ నిర్మాణానికి ప్రోత్సాహకాలను అందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడం కోసం క్రాప్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలన్నారు. మార్కెట్లో ఈనామ్ పద్ధతిని ప్రవేశ పెట్టి రైతులకు మేలు చేయాలని పేర్కొన్నారు. డ్రిప్ ఇరిగేషన్ లో భాగంగా ఎస్సీలకు 90 శాతం, బీసీలకు 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని బండి సంజయ్ కెసిఆర్ ముందు డిమాండ్లను ఉంచారు. రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడానికి ముందు కెసిఆర్ ఈ డిమాండ్లను అమలు చేయాలని, లేదంటే రైతాంగ సంక్షేమం కోసం కేసీఆర్ పై ఒత్తిడి తీసుకురావడానికి వెనుకాడబోమని బండి సంజయ్ తెలిపారు.