ఏపీ నేతలు ఏం సంకేతాలిస్తున్నారు?: తిరుమల డిక్లరేషన్, మంత్రుల వ్యాఖ్యలపై బండి సంజయ్
హైదరాబాద్: మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాల పట్ల రాజకీయ జోక్యంతో వివాదాలు చేయడం తగదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయ కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
అందుకే కేసీఆర్ ఫాం హౌస్ నుంచి రావడం లేదు: దావత్ ఇస్తామంటూ బండి సంజయ్

మత వ్యవహారాల్లో రాజకీయ జోక్యమా?
‘కలియుగ ప్రత్యక్ష దైవం.. కోట్లాది మంది భక్తుల విశ్వాసమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం కేంద్రంగా జరుగుతున్న రాజకీయ, వివాదాస్పద పరిణామాలు చాలా బాధాకరం. రాజకీయ కారణాలతో మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాల్లో వివాదాలు సృష్టించడం దురదృష్టకరం' అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

ఏపీ మంత్రిపై పరోక్షంగా సంజయ్ ఆగ్రహం..
‘కొందరు నేతలు హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుని అనుచితంగా మాట్లాడం గర్హనీయం. అంతర్వేదిలో రథం కాలిపోతే.. చెక్క కాలిపోయిందంటూ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం దారుణం. ఇలాంటి వారిని కట్టడి చేయాల్సిన వాళ్లు మౌనంగా ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ప్రధాని మోదీపై, యూపీ సీఎం యోగిపై కొందరు నేతలు నోరు జారి అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ప్రభుత్వంలోని కొందరు నేతలు సంయమనం కోల్పోయి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు. సమాజంలోని అన్ని వర్గాల్ని సమదృష్టితో చూడాల్సిన పాలకులు.... ప్రజల మనోభావాల్ని దెబ్బతీసేలా వ్యవహరించడం, మాట్లాడటం సరికాదు' అంటూ ఏపీ మంత్రి కొడాలి నానిపై బండి సంజయ్ మండిపడ్డారు.

ఏపీ నేతలు ఏం సంకేతాలిస్తున్నారు?
‘కొందరు నేతలు బాధ్యతను మరచి విమర్శలు చేయడం ఫ్యాషన్ గా భావిస్తున్నారు. అంతర్వేదిలో రథం కాలిపోతే, చెక్క కాలిపోయిందంటూ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం దారుణం. దేశవ్యాప్తంగా హిందూ సమాజం స్పందిస్తున్నా, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేతల్ని కట్టడి చేసి, చర్యలు తీసుకోవాల్సిన నేతలు మౌనం వహించడం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి' అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఏపీ మంత్రి కొడాలి నాని హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యల చేయడంపై ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. కొడాలి నానిపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు.