
ఆ డబ్బులు రైతులకు తక్షణం ఇవ్వండి: సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగలేఖ
రాష్ట్రంలో అనేక సమస్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా యాసంగి వడ్లు కొనుగోలు చేసిన డబ్బులను వెంటనే రైతులకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో బండి సంజయ్ పలు అంశాలను ప్రస్తావించారు.

యాసంగిలో కొనుగోలు చేసిన వడ్లకు డబ్బులు చెల్లించలేదు: బండి సంజయ్
సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ రాసిన బహిరంగ లేఖలో వడ్ల కొనుగోలు రాష్ట్రప్రభుత్వం చేపట్టాలని బిజెపి తెలంగాణా శాఖ చేసిన పోరాటాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి ధాన్యం కొనుగోలు ప్రారంభించిన విషయం మీకు రాష్ట్ర రైతాంగానికి విధితమే, అయితే రాష్ట్ర ప్రభుత్వం యాసంగి లో కొనుగోలు చేసిన వడ్ల కు ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదు అని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి ధాన్యం డబ్బుల చెల్లింపులు ఆలస్యం కావడంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు అని బండి సంజయ్ వెల్లడించారు.

ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు రైతులను అప్పుల ఊబిలోకి నెడుతున్నారు
ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నా యాసంగి పంట డబ్బు చేతికి రాక పోవడంతో డబ్బుల కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకున్న కొంతమంది ప్రైవేటు వడ్డీ వ్యాపారులు చాలా జిల్లాలలో రైతులకు అప్పుల ఆశ చూపి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు అని పేర్కొన్నారు. అమ్మిన పైసలు రాలేదు.. రైతుబంధు డబ్బులు అందలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని బండి సంజయ్ తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1286 కొనుగోలు కేంద్రాల ద్వారా1,91, 852 మంది రైతుల నుండి 11.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారని పేర్కొన్న బండి సంజయ్ ఈ మొత్తం ధాన్యం విలువ 2197.16 కోట్ల రూపాయలు అని వెల్లడించారు. వీటిలో ఇంకా 517.16 కోట్లు ప్రభుత్వం రైతులకు బకాయి పడిందని బండి సంజయ్ పేర్కొన్నారు.

మీ రాజకీయ అవసరాల కోసం సాధారణ రైతులను బలిపశువులను చేస్తున్నారు
రాష్ట్ర ప్రభుత్వ అహంకారపూరిత ప్రకటనలతో దాదాపు 14 లక్షల ఎకరాలలో రైతులు వరి పంట వేయలేదని దీంతో వరి వెయ్యని రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని బండి సంజయ్ తెలిపారు . తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ పై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉన్నా మీ ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం సాధారణ రైతులను బలిపశువులను చేస్తున్నారంటూ బండి సంజయ్ మండిపడ్డారు. రైతు సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం అని చెప్పుకునే మీరు రైతాంగాన్ని నిలువునా దివాలా తీయిస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

యాసంగి పంట డబ్బులు వెంటనే ఇవ్వండి
మీ ప్రభుత్వం చెప్పే దానికి చేసే దానికి పొంతన లేదని బండి సంజయ్ మండిపడ్డారు. వానాకాలం సీజన్ ప్రారంభమైనా వ్యవసాయ శాఖ మంత్రి గానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ కనీసం క్షేత్రస్థాయి పర్యటనలు చేయలేదని, ఇది రైతుల పై మీ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ కు నిదర్శనమని బండి సంజయ్ ఆక్షేపించారు.
యాసంగి పంట కొనుగోలు డబ్బులు వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు, ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల వంటి విషయాలను వ్యవసాయ శాఖ మొద్దునిద్ర వీడే విధంగా చర్యలు చేపట్టాలని బండి సంజయ్ సూచించారు.

ఫాం హౌస్ నుండి కేసీఆర్ బయటకు రావాలి .. రైతులకు పెట్టుబడి సాయం అందించాలి
అన్ని జిల్లాల్లో రైతు సంఘాలతో, అన్ని రాజకీయ పార్టీలతో రైతాంగ సమస్యలపై జిల్లా కలెక్టర్ లు సమావేశాలు ఏర్పాటు చేయాలని, రైతులకు అవసరమైన పెట్టుబడి సాయం వెంటనే అందించాలని, తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే ఫాం హౌస్ నుండి బయటకు వచ్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష జరపాలని కోరుతున్నామని బండి సంజయ్ తన లేఖలో ప్రస్తావించారు.