కేసీఆర్ తోపుగాడు ఏం కాదు, బడా చోర్ సీఎం .. భద్రకాళీ ఆలయంలో ప్రమాణానికి సిద్ధమా ? బండి సంజయ్ సవాల్
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు వరంగల్ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ మందు తాగి రాష్ట్రాన్ని నడుపుతున్నారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ మేయర్ ఎన్నికల ఎందుకు జరపడం లేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. అంతేకాదు వరంగల్ అభివృద్ధిపై భద్రకాళి ఆలయంలో ప్రమాణం చేయడానికి వరంగల్ మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు.
ఓరుగల్లులో కదం తొక్కిన తెలంగాణా కాషాయ దళపతి బండి సంజయ్ .. భారీ ర్యాలీ తో పాటు కీలకనేతల చేరికలు

కేసీఆర్ దగుల్బాజీ ముఖ్యమంత్రి, బడా చోర్ ముఖ్యమంత్రి
కేసీఆర్ దగుల్బాజీ ముఖ్యమంత్రి, బడా చోర్ ముఖ్యమంత్రి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు . హైదరాబాద్ లో జరిగినట్టే వరంగల్లోనూ కేసీఆర్ కు ప్రజలు షాక్ ఇవ్వనున్నారని వ్యాఖ్యానించారు బండి సంజయ్ . ఢిల్లీకి వెళ్ళిన కేసీఆర్ ముందస్తు షెడ్యూల్ ఎందుకు పెట్టారో లేదో చెప్పాలని, బీజేపీని చూస్తే కేసీఆర్ కు వెన్నులో వణుకు పుడుతోంది అన్నారు బండి సంజయ్. కెసిఆర్ తోపుగాడు ఏం కాదని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గల్లంతు అవుతుందని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వరంగల్ లో బీజేపీ గెలువబోతుందని సర్వేలు చెప్తున్నాయి
వరంగల్ లో వరదలు వస్తే కేసీఆర్ ఎందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో వరద బాధితులకు 10000 ఇచ్చిన కేసీఆర్ వరంగల్లో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు బండి సంజయ్. వరంగల్ లో బీజేపీ గెలువబోతుందని సర్వేలు కూడా చెబుతున్నాయి అన్నారు. అందుకే వరంగల్ లో కెసిఆర్ ఎన్నికలు పెట్టడం లేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 196 కోట్ల రూపాయలను ఇచ్చిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్ళించి కేవలం నలభై కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని బండి సంజయ్ ఆరోపించారు.

గ్రేటర్ వరంగల్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీని వరంగల్ ప్రజలు బొంద పెడతారన్న బండి సంజయ్
వరంగల్ జిల్లాలో టిఆర్ఎస్ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అని ఆరోపణలు గుప్పించారు బండి సంజయ్. సీఎం కేసీఆర్ లక్ష ఉద్యోగాల హామీ ఏమైంది అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రమోషన్లు లేక పోలీసులు ఇబ్బంది పడుతున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. టు బి హెచ్ కె అంటే టు బేటా బాపు హరీష్ రావు , కేటీఆర్ గా మారిందని వ్యాఖ్యానించారు. రానున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీని వరంగల్ ప్రజలు బొంద పెడతారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఇప్పటికే బీజేపీ శ్రేణులను చూస్తే టీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారని పేర్కొన్నారు .