వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిజర్వేషన్లపై రగడ.. 23 శాతమైతే కష్టం.. బీసీ నేతల అల్టిమేటం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికే పరిమితం కానుండటంతో బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించట్లేదు. దీంతో బీసీలకు 23.81, ఎస్సీలకు 20.46, ఎస్టీలకు 5.73 శాతం రిజర్వేషన్లు ఖరారయ్యే ఛాన్సుంది. ఇదే జరిగితే కొత్త పంచాయతీ రాజ్ చట్టంలో ప్రభుత్వం 34 శాతంగా పొందుపరిచిన బీసీ రిజర్వేషన్లు 10.19 శాతం మేర తగ్గిపోనున్నాయి.

జనాభా దమాషా ప్రకారం దాదాపు 54 శాతం ఉన్న బీసీ ఓటర్లకు అనుగుణంగా 23.81 శాతం రిజర్వేషన్లు సరిపోవని వాదిస్తున్నాయి బీసీ సంఘాలు. పంచాయతీ రాజ్ చట్టంలో పొందుపరిచిన 34 శాతాన్ని ఇంకా పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈనేపథ్యంలో కేవలం 23.81 శాతం రిజర్వేషన్లంటే ఒప్పుకొనే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో మరోసారి కోర్టుల మెట్లెక్కేందుకు సిద్ధమవుతున్నాయి.

లెక్కల్లో తేడా.. బీసీలకు నష్టమేనా?

లెక్కల్లో తేడా.. బీసీలకు నష్టమేనా?

పంచాయతీ రాజ్ కొత్త చట్టంలో చేసిన సవరణల ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు అన్నీ కలిపి 60.19 శాతంగా ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎట్టిపరిస్థితుల్లో 50 శాతానికి మించొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. మరోవైపు జనవరి 10 లో గా పంచాయతీ ఎన్నికలు పూర్తికావాలన్న హైకోర్టు ఆదేశాలతో దానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేసింది ప్రభుత్వం. అందుకనుగుణంగా పంచాయతీ రాజ్ కొత్త చట్టంలో రిజర్వేషన్లు 50 శాతానికి సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.

కొత్త జిల్లాల ఏర్పాటుతో 12,751 గ్రామ పంచాయతీలున్నాయి. వీటి ప్రకారం పంచాయతీ రాజ్ కొత్త చట్టంలో పేర్కొన్న విధంగా 60.19 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే.. బీసీలకు 34 శాతం కోటా కింద 3,440 పంచాయతీ స్థానాలు లభించేవి. కానీ 50 శాతం రిజర్వేషన్ల ప్రాతిపదికన బీసీలకు 23.81 శాతం లెక్కతో కేవలం 2,409 పంచాయతీలు మాత్రమే దక్కనున్నాయి. దీన్నిబట్టి చూస్తే దాదాపు 1000 స్థానాలు బీసీలకు దక్కకుండా పోతున్నాయన్నమాట.

రిజర్వేషన్లపై పట్టువీడని బీసీ సంఘాలు

రిజర్వేషన్లపై పట్టువీడని బీసీ సంఘాలు

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆర్డినెన్స్ తీసుకొచ్చి 50 శాతం రిజర్వేషన్లకే సర్కార్ మొగ్గు చూపడంతో.. బీసీ సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. ఒకవేళ 50 శాతం రిజర్వేషన్లు అమలయితే బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందనేది వారి వాదన. ఇప్పటికే పంచాయతీ రాజ్ కొత్త చట్టంలో పేర్కొన్నవిధంగా కాకుండా జనాభా దమాషా ప్రకారం ఇంకా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

అందులో పొందుపరిచిన 34 శాతం నుంచి 55.7 శాతానికి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చాలా సందర్భాల్లో డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే సహించేది లేదని హెచ్చరిస్తూనే ఉన్నారు. హడావిడిగా కాకుండా కోర్టులకు పరిస్థితులు వివరించి ఆర్నెళ్లు ఆలస్యమైనా సరే బీసీ రిజర్వేషన్లు తేల్చాకే ప్రభుత్వం ఎన్నికలకు వెళితే బాగుంటుందనేది బీసీ సంఘం నేతల వాదనగా కనిపిస్తోంది.

బీసీ కులాల గణనపై శ్రవణ్ పోరు

బీసీ కులాల గణనపై శ్రవణ్ పోరు

బీసీ కులాల గణన పూర్తయ్యాకే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని మొదటినుంచి వాదిస్తున్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్. ఈమేరకు మరోసారి తన గళం వినిపించారు. సీఎం కేసీఆర్ తో పాటు పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ కార్యదర్శికి లేఖలు రాశారు. బీసీ రిజర్వేషన్ల వర్గీకరణ పూర్తిచేసి, దాని ప్రకారమే పంచాయతీ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పించాల్సిందిగా పేర్కొన్నారు.

2014 లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 52 శాతం బీసీలు ఉన్నారని.. దాని ప్రకారమే రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ ఉపకులాల వెనుకబాటుతనం బేస్ చేసుకుని కులగణన చేపట్టాలని అప్పట్లో ప్రభుత్వాన్ని కోరితే పట్టించుకోలేదని, అందుకే హైకోర్టుకు వెళ్లామని గుర్తు చేశారు. శాస్త్రీయ విధానంలో బీసీ కులాల గణన జరగాలని కోరారు. ఈ విషయం హైకోర్టు చెప్పినా.. ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా దీనిపై ప్రభుత్వం దృష్టి సారించలేదని మండిపడ్డారు. మొత్తానికి పంచాయతీ ఎన్నికలపై దూకుడు పెంచిన ప్రభుత్వం ఒకవైపు.. రిజర్వేషన్లపై పట్టువీడని బీసీ సంఘాలు మరోవైపు.. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

English summary
BC unions are concerned that the reservation in Panchayat elections is limited to 50 per cent is not sufficient. According to the population estimates, 23.81 percent reservation is inadequate to the BC voters who are about 54 percent. In the Panchayati Raj Act, as per the new law, 60.19 per cent of the reservation was implemented, while the BC's had 34 per cent quota of 3,440 panchayats. But on the basis of 50 percent reservation, BC's will get only 2,409 panchayats as 23.81 per cent. The leaders of the unions warn that there is no compromise on the reduction of BC's reservation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X