
బిగ్ బాస్ లో టీఆర్ఎస్ ఎంపీ - నాగార్జున కీలక నిర్ణయం : ప్రభాస్ మార్గంలోనే నాగ్..!!
బిగ్ బాస్ షో లో టీఆర్ఎస్ ఎంపీ ఎంట్రీ ఇచ్చారు. కంటెస్టెంట్స్ తో పాటుగా ఆడియన్స్ కు ఒక మంచి సందేశం ఇచ్చారు. ఆయన స్పూర్తిగా కింగ్ నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఎంపీ రావటంతో..బిగ్ బాస్ షో లో ఆసక్తి కర చర్చ సాగింది. మొక్కలు నాటడమే ఒక కార్యక్రమంగా పెట్టుకుని కోట్లాది మొక్కలు నాటించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను బిగ్‌బాస్ స్టేజీపైకి నాగార్జున ఆహ్వానించారు. బిగ్ బాస్ హౌస్‌లో 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' నినాదం మార్మోగింది.

టీఆర్ఎస్ ఎంపీ ఎంట్రీతో షో లో..
షో లోకి వస్తూనే ఆయన బిగ్‌బాస్ హౌస్‌లో నాటమని హోస్ట్ నాగార్జునకు ఒక మొక్కను బహుకరించారు. పచ్చదనమే రేపటి ప్రగతి పథమని బిగ్‌బాస్ షో వేదికగా చాటిచెప్పారు. ఈ చాలెంజ్ ప్రారంభమై 3 సంవత్సరాలు పూర్తైందని చెప్పారు. గడిచిన మూడేళ్లలో 16 కోట్ల మొక్కలు నాటానన్న ఎంపీ సంతోష్‌కుమార్ ఈ చాలెంజ్‌లో సెలబ్రిటీలు సైతం ముందుకు వచ్చి అడవులను దత్త తీసుకున్నారని తెలిపారు. హీరో ప్రభాస్ 1650 ఎకరాలు దత్తత తీసుకుని దాన్ని హరితవనంగా మార్చేందుకు సిద్ధపడ్డారని పేర్కొన్నారు.

నిర్ణయం ప్రకటించిన నాగార్జున
ఈ సందర్భంగా నాగార్జున కూడా ఒక అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటానని ముందుకు వచ్చారు. ఎంపీ సంతోష్ కుమార్ ఎక్కడ చూపిస్తే అక్కడ వెయ్యి ఎకరాలు దత్తత తీసుకుని మొక్కలు పెంచడానికి నాగ్ సిద్ధమయ్యారు. ప్రజలు కూడా మూడు వారాలు మూడు మొక్కలు నాటి ఈ ఏడాదికి మంచి ముగింపు పలుకుదామని పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం ముగిసిపోవడానికి ఇంకా మూడు వారాల సమయం ఉందని.. ఇప్పటి వరకు ఎన్నో చేసుంటాం కానీ, ఈ మూడు వారాలు.. వారానికి ఒకటి చొప్పున మూడు మొక్కలు నాటి 2021కి మంచి ఫినిషింగ్ ఇవ్వాలి' అంటూ నాగార్జున హౌస్‌లోని కంటెస్టెంట్లకు, ప్రేక్షకులకు పిలుపునిచ్చారు.

సంతోష్ గ్రీన్ ఛాలెంజ్ తో ప్రముఖుల స్పందన
ఇప్పటికే సంతోష్ కుమార్ పిలుపుతో పలువురు రాజకీయ - సినీ సెలబ్రెటీలు ముందుకు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవితో సహా.. పలువురు రాజకీయ నేతలు సైతం మొక్కలు నాటుతూ గ్రీన్ ఛాలెంజ్ ను కంటిన్యూ చేస్తున్నారు. ఎంపీ సంతోష్ కుమార్ బిగ్ బాస్ షో లో ఎంట్రీ.. గ్రీన్ ఛాలెంజ్ జై సందేశం...నాగార్జున నిర్ణయం తో ఈ ఆదివారం బిగ్ బాస్ షో ఆసక్తి కరంగా మారింది. కంటెస్టెంట్ల ఎలిమినేషన్... వారి టాస్కులతో ప్రతీ వారం సందడిగా సాగే బిగ్ బాస్ లో ఇప్పుడు ఒక సందేశాత్మక కార్యక్రమం.. నాగార్జున తీసుకున్న నిర్ణయం స్పెషల్ గా నిలిచింది.