బీజేపీ ఆఫీస్ ముందు ఆత్మహత్యాయత్నం చేసిన కార్యకర్త గంగుల శ్రీనివాస్ మృతి
హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బిజెపి కార్యకర్త గంగుల శ్రీనివాస్ మృతిచెందాడు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ నవంబర్ 1వ తేదీన బిజెపి కార్యాలయం ఎదుట కార్యకర్త శ్రీనివాస్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అక్కడే ఉన్న పార్టీ కార్యాలయ సిబ్బంది, స్థానికులు మంటలను ఆర్పినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే తీవ్ర గాయాలపాలైన గంగుల శ్రీనివాస్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు .

ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి గంగుల శ్రీనివాస్ మృతి
ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బీజేపీ కార్యకర్త గంగుల శ్రీనివాస్ మృతి చెందాడు.
తీవ్రగాయాలతో అతని శరీరంలోని అవయవాలు దెబ్బతినడంతో అతని బ్రతికించడానికి డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. మొదట చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన బిజెపి నాయకులు, తరువాత అతన్ని అక్కడి నుండి సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ ను బ్రతికించడం కోసం శాయశక్తులా ప్రయత్నం చేశారు.

బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ ఆత్మహత్యాయత్నం
దుబ్బాక ఉప ఎన్నికల ఉద్రిక్తతల నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తుమ్మలగూడెం కు చెందిన గంగుల శ్రీనివాస్ బిజెపి జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ, బిజెపి కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లో కాలుతున్న బండి సంజయ్ అన్న అక్రమ అరెస్టు చేశారంటూ శ్రీనివాస్ తన నిరసనను తెలియజేశారు. బండి సంజయ్ కోసం, బిజెపి కోసం ప్రాణాలు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నారంటూ నినాదాలు చేసిన అతన్ని కాపాడడం కోసం శత విధాల ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే అతను 58శాతం కాలిపోవడంతో బ్రతికించడం కష్టమైంది.

శ్రీనివాస్ ను మృతితో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు
మంటల్లో కాలి తీవ్రగాయాల పాలైన శ్రీనివాస్ ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు సందర్శించి పరామర్శించారు. మెరుగైన వైద్యం చేయాలని వైద్యులను కోరినా అతని పరిస్థితి విషమించడంతో వైద్యులు కాపాడలేకపోయారు. శ్రీనివాస్ మృతి పట్ల బీజేపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేసి కుటుంబ సభ్యులకు అందించనున్నారు.