hyderabad paripoornananda swami swami paripoornananda Governor esl narasimhan bandaru dattatreya bjp హైదరాబాద్ పరిపూర్ణానంద స్వామి స్వామి పరిపూర్ణానంద గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ బండారు దత్తాత్రేయ
పరిపూర్ణానంద బహిష్కరణ: గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు, మరి వారిమాటేమిటి?
హైదరాబాద్: శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నగరం నుంచి ఆరు నెలల పాటు బహిష్కరిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్ని కలిసి ఫిర్యాదు చేశారు.
బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి బుధవారం రాజ్‌భవన్ కు వెళ్లారు. అనంతరం మీడియాతో బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. స్వామి పరిపూర్ణానందను ఎందుకు గృహనిర్బంధం చేయాల్సి వచ్చిందో, 6నెలల పాటు హైదరాబాద్ నగర బహిష్కరణ ఎందుకు విధించారో విచారణ చేపట్టాలని గవర్నర్‌ని కోరామని చెప్పారు.
గవర్నర్ రాజ్యాంగ పరిరక్షకులుగా ఉన్నారు కనుక ఆయన్ని కలిశామని, ప్రభుత్వ చర్యలపై విచారణ జరపాలని కోరామని తెలిపారు. పోలీసులు తీసుకున్న ఈ చర్యలు సమర్థనీయం కాదని, స్వామి పరిపూర్ణానందపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిని తాము నిరసిస్తున్నట్టు చెప్పారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నగర బహిష్కరణ చేసే హక్కు పోలీసులకు ఎక్కడుందని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఎవరిపైనా అయినా ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తే వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత గవర్నర్ కు ఉందని, అందుకే, ఈ సంఘటనపై ఆయనకు ఫిర్యాదు చేశామని చెప్పారు.
పలు సందర్భాల్లో హిందువుల మనోభావాలు భంగపరిచేలా మజ్లిస్ పార్టీ నేతలు మాట్లాడారని, మరి, వారిపై ప్రభుత్వం, పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని కిషన్ రెడ్డి నిలదీశారు.