రేవంత్ కు సహాయ నిరాకరణ - సంజయ్ కు హైకమాండ్ అండ: కేసీఆర్ కు అసలైన పోటీ ఎవరు..!!
తెలంగాణలో అతి తక్కువ కాలంలోనే రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకంతో పార్టీ దూకుడుగా కనిపిస్తోంది. అదే సమయంలో తెలంగాణలో ఎంతో కాలంగా సీఎం కేసీఆర్ లక్ష్యంగా రాజకీయం చేస్తున్న రేవంత్ కు కాంగ్రెస్ అధినాయకత్వం ఎన్నో ఆశలతో టీపీసీసీ పగ్గాలు అప్పగించింది. దీంతో..పార్టీ కేడర్ లోనూ కొత్త జోష్ కనిపించింది.

బీజేపీ అగ్రెసివ్ రాజకీయం
అయితే, రేవంత్ నియామకం నుంచే పార్టీలో కొంత మంది నిరసన వ్యక్తం చేసారు. ఇప్పుడు అది పీక్ కు చేరింది. రేవంత్ లక్ష్యంగా వ్యతిరేక శిబిరం మాటల తూటాలు పేల్చుతోంది. వారిని కంట్రోల్ చేయటంలో అధినాయకత్వం సైతం మీనమేషాలు లెక్కిస్తోంది. రేవంత్ నిర్వహించిన దళిత- గిరిజన సభలకు స్పందన బాగానే ఉన్నా.. దానిని కొనసాగించటంలో వెనుక బడ్డారు. పార్టీల వ్యక్తిగత ప్రతిష్ఠ.. రేవంత్ నిర్ణయాలు వారికి నచ్చకపోవటంతో కాంగ్రెస్ లో మరలా కొంత నైరాశ్యం కనిపిస్తోంది. రేవంత్ పరిస్థితికి పూర్తి భిన్నంగా బీజేపీ రాజకీయం చేస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు పార్టీ అధినాయకత్వం పూర్తిగా మద్దతుగా నిలుస్తోంది. బండి సంజయ్ కోసం తానే కదలి వచ్చినట్లుగా పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డా చెప్పుకొచ్చారు.

రేవంత్ కు సీనియర్ల సహాయ నిరాకరణ
జాతీయ నేతలు బండి సంజయ్ ను జైళ్లో వేయగానే తెలంగాణకు వరుసగా వస్తున్నారు. దీంతో.. టీఆర్ఎస్ - బీజేపీ కలిసే ఇదంతా చేస్తున్నాయంటూ కాంగ్రెస్ ఢిఫెన్స్ గేమ్ మొదలు పెట్టింది. కానీ, గ్రౌండ్ లెవల్ లో కేడర్ లో జోష్ నింపటం పైన ఫోకస్ చేయటం లేదు. తాజాగా జరిగిన టీపీసీసీ సమావేశంలోనూ ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసారు.. ఎవరిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారనే అంశాలు మినహా... పార్టీ పరంగా ఏం చేయాలనే దాని పైన చర్చ లేదు. రేవంత్ ఏ నిర్ణయం తీసుకున్నా.. పార్టీలోని సీనియర్ల నుంచి మద్దతు కనిపించటం లేదు. రేవంత్ నిర్ణయాల కంటే..వ్యతిరేకిస్తున్న వారి వ్యాఖ్యలే ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి. రేవంత్ ఏ నిరసన చేయాలన్నా.. ఇంటి గేటు కూడా దాటనీయకుండా ప్రభుత్వం అడ్డుకుంటున్నారు. ఆ సమయంలో అండగా నిలవాల్సిన పార్టీ నేతలు..ముందుకు రావటం లేదు.

రేవంత్ వర్సస్ సంజయ్ నాయకత్వంపై చూపు
దీంతో..కాంగ్రెస్ లో నెలకొన్ని అంతర్గత సమస్యలను తెలంగాణలో పూర్తిగా సద్వినియోగం చేసుకొని తామే టీఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వీడటం లేదు. పార్టీ జాతీయ నాయకత్వం సైతం తెలంగాణ బీజేపీ నేతలకు పూర్తిగా అండగా నిలుస్తోంది. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యామ్నాయం అన్న సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్లేలా రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలను ఎండ గట్టడంతో పాటు ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొం టున్న ప్రధాన సమస్యలపై ఉద్యమిస్తూ ప్రజా మద్దతును కూడగట్టేలా కార్యక్రమాలు చేపడుతోంది. ధాన్యం కొనుగోలు అంశం ద్వారా బీజేపీని సీఎం కేసీఆర్ ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. అందులో రాజకీయంగా పై చేయి సాధించింది.

బండికి అండగా బీజేపీ హైకమాండ్
వెంటనే దీనికి కౌంటర్ గా తెలంగాణలోని సమస్యల పైన బీజేపీ ఫోకస్ చేసింది. నిరుద్యోగుల సమస్య, ప్రభుత్వ ఉద్యోగుల విభజన, ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలు ఇలా వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంచుకుని కార్యాచరణను అమలు చేస్తోంది. కాంగ్రెస్ లో ఇటువంటి ప్రణాళికల కంటే నేతల మధ్య విభేదాలే ప్రధాన అజెండాగా మారుతున్నాయి. గ్రేటర్ ఎన్నికలు...దుబ్బాక.. బద్వేలు ఎన్నికల్లో విజయం తరువాత సహజంగానే బీజేపీలో నైతిక బలం పెరిగింది. ఇక, సంజయ్ సైతం దూకుడుగా వెళ్తున్నారు. రేవంత్ సైతం దూకుడు స్వభావం ఉన్న నాయకుడే అయినా.. మద్దతు మాత్రం కరువైంది. కేడర్ కోరుకుంటున్నా.. రేవంత్ అడుగులకు సీనియర్ల సహకారం ఉండటం లేదు.

టీఆర్ఎస్ కు ధీటుగా ఇద్దరిలో ఎవరు
దీంతో.. ప్రస్తుతం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం మారిపోతోంది. బీజేపీ కేంద్ర మంత్రులు..జాతీయ నేతలు తెలంగాణకు వచ్చి కేసీఆర్ ను టార్గెట్ చేయటం ద్వారా సహజంగానే ప్రజల అటెన్షన్ వారి వైపు మళ్లుతోంది. కాంగ్రెస్ నుంచి ఆ చొరవ కనిపించటం లేదు. దీంతో..ఇప్పుడు సీఎం కేసీఆర్ కు ఎవరు పోటీ ఇవ్వగలరనే అంశం పైన అనేక రకాలుగా ఈ ఇద్దరి నేతల మధ్య పోలుస్తూ విశ్లేషణలు మొదలయ్యాయి. 2023లోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో..ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయంగా పరిస్థితి హీటెక్కింది.