సిద్దిపేట సీపీకి వార్నింగ్, సిటీ పోలీసులకు కొశ్చన్స్, కాప్లపై అర్వింద్ గుస్సా.. నా పేరు అంటూ..
దుబ్బాక ఉప ఎన్నిక పోరు టీఆర్ఎస్- బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేయడంతో పీక్‌కి చేరింది. బండి సంజయ్ రాక, అరెస్ట్.. దీక్షలతో అట్టుడుకుతోంది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా హాట్ కామెంట్స్ చేశారు. సిద్దిపేట సీపీ, హైదరాబాద్ పోలీసులపై విరుచుకుపడ్డారు.

నా పేరు అర్వింద్..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పోలీసులు వ్యవహరించిన తీరును అర్వింద్ తప్పుపట్టారు. సీపీ జోయల్ డేవిస్ పోలీసా.. గూండా అంటూ ధ్వజమెత్తారు. జోయల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు. జోయల్ నా పేరు అరవింద్.. నీ పేరు గుర్తు పెట్టుకుంటా అంటూ స్వరంతో హెచ్చరించారు.

సంజయ్ దీక్ష
బండి సంజయ్ కరీంనగర్లో దీక్ష చేస్తుండగా.. కొందరు బీజేపీ నేతలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. అయితే హైదరాబాద్‌లో గల అర్వింద్ ఇంటి వద్దకు కూడా వచ్చారు. తన ఇంటి ముందు పోలీసులు మోహరించడంతో బయటకు వచ్చారు. ఏసీపీకి ఫోన్ చేసి మాట్లాడారు అర్వింద్.

ఇంటి ముందు ఎందుకు ఉన్నారు..
ఇంటి ముందు పోలీసులు ఎందుకు ఉన్నారని ప్రశ్నించగా.. ఛలో ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ పిలుపు ఇవ్వడంతో బీజేపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నామని ఏసీపీ చెప్పారు. అయితే తాము ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు ఇవ్వలేదని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నారో ఫాంహౌస్‌లో ఉన్నారో చెప్పాలని అర్వింద్ ప్రశ్నించారు.

ముందస్తు అరెస్టులు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా ఛలో ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ నేతలు పిలునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమై.. బీజేపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు, రాజసింగ్, మోత్కుపల్లి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బయటకు వెళ్ళటానికి వీలు లేదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రగతి భవన్ వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు.