బీజేపీ జాతీయకార్యవర్గ సమావేశాలు: జులై1న హైదరాబాద్కు జేపీ నడ్డా..భారీ ర్యాలీ; షెడ్యూల్ ఇదే!!
హైదరాబాద్ వేదికగా జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించేలా, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, పలువురు బీజేపీ అగ్రనేతలు హైదరాబాద్లో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇక ఈ నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ బిజెపి నేతలు జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

జులై 1న హైదరాబాద్ కు జేపీ నడ్డా.. భారీ ర్యాలీతో స్వాగతం
ఇదిలా ఉంటే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు సారథ్యం వహించనున్నారు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆయన ఈ క్రమంలో జులై 1వ తేదీన ఉదయం హైదరాబాద్ కు చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి సమావేశాలు జరిగే నోవాటెల్ వరకు జేపీ నడ్డాను భారీ ర్యాలీతో స్వాగతించాలని బిజెపి రాష్ట్ర నేతలు నిర్ణయం తీసుకున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలతో బీజేపీ మైలేజ్ పెంచుకోవాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల షెడ్యూల్ ఇదే
ఇక జులై 1వ తేదీన సాయంత్రం నడ్డా అధ్యక్షతన జరిగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల భేటీలో, కార్యవర్గ సమావేశాల అజెండాను, సమావేశంలో చేయాల్సిన తీర్మానాలను గురించి చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. జూలై 2వ తేదీన ఉదయం పదాధికారుల సమావేశం నిర్వహిస్తారు. ఇక అదే రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి 3 వ తేదీ సాయంత్రం ఐదు గంటల దాకా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తారు. ఆపై మూడవ తేదీన సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోడీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేయడానికి కూడా తెలంగాణ బిజెపి నేతలు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నారు.

మోడీ రాక నేపధ్యంలో రెండు చోట్ల బస ఏర్పాట్లు..
వచ్చే నెల 2వ తేదీన హైదరాబాద్ కు ప్రధాని నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో ప్రధాని మోడీ బస కోసం నోవాటెల్ హోటల్ తో పాటుగా, రాజ్ భవన్ లోనూ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని షెడ్యూల్ చూస్తే రెండవ తేదీ మధ్యాహ్నం బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుండి రాజ్ భవన్ కు గానీ లేదా నేరుగా నోవాటెల్ కు గాని వెళ్లనున్నారు. ఆయనతోపాటు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులకు నోవాటెల్ లో భద్రత మరియు బస ఏర్పాట్లు చేస్తున్నారు.