
జేబీఎస్ వద్ద బీజేపీ నిరసనలు; బండి సంజయ్ హౌస్ అరెస్ట్.. భగ్గుమన్న తెలంగాణాబీజేపీ బాస్!!
ఇప్పటికే విపరీతంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యుడు విలవిలలాడుతున్న పరిస్థితి తెలిసిందే. ఇక ధరాఘాతంతో అల్లాడుతున్న సామాన్యుడికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ ఛార్జీల పెంపుతో షాకిచ్చింది. సామాన్యులను ఇబ్బంది పెట్టేలా పెరిగిన ఆర్టీసీ ఛార్జీలపై ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఇక నేడు బీజేపీ ఆందోళనలు కొనసాగనున్న నేపథ్యంలో పోలీసులు బండి సంజయ్ ను హౌస్ అరెస్ట్ చేశారు.

డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ ఛార్జీల బాదుడు..
తెలంగాణ రాష్ట్రంలో కిలోమీటర్ల వారీగా పెంచిన డీజిల్ సెస్ వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది . సెస్ రూపంలో ఆర్టీసీ ఛార్జీల మోత మోగించనుంది. దీంతో సామాన్యులపై పెను భారం పడనుంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని బయటపడెయ్యడం కోసం డీజిల్ సెస్ అనివార్యమని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చెబుతున్నారు. అయితే డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ చార్జీల బాదుడు సామాన్యులను మరింత ఆర్థిక కష్టాల్లోకి నెడుతోంది అని ప్రతిపక్ష పార్టీలు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
జేబీఎస్ వద్ద బీజేపీ నిరసనలకు పిలుపు .. బండి సంజయ్ హౌస్ అరెస్ట్
ఈ క్రమంలోనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జేబీఎస్ వద్ద ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ నిరసనకు పిలుపునిచ్చారు.జేబీఎస్ వద్ద నిరసన కార్యక్రమానికి బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బంజారా హిల్స్ లోని బండి సంజయ్ ఇంటిని ముట్టడించిన పోలీసులు ఆయనను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో బంజారాహిల్స్‌లోని బండి సంజయ్ నివాసానికి పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు చేరుకున్నారు. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో సామాన్యుడిపై భారం వేశారని, జేబీఎస్ లో నిరసన చేసి తీరుతామని తేల్చి చెబుతున్నారు బీజేపీ నేతలు.

తనను హౌస్ అరెస్ట్ చెయ్యటంపై బండి సంజయ్ ఆగ్రహం
ఇదిలా ఉంటే తనను హౌస్ అరెస్టు చేయడంపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఆర్టీసీ ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడానికి కూడా వెళ్లనివ్వరా..? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ఆర్టీసీ చార్జీలు పెంచడం మూర్ఖత్వం కాదా..? అంటూ నిలదీశారు. టీఆర్ఎస్ సర్కారు మూడేళ్లలో ఐదుసార్లు చార్జీలు పెంచింది. పేదలను బస్సుల్లో కూడా తిరగనివ్వరా..? నడుచుకుంటూ తిరగాలా..? అని బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

రేపిస్టులను అరెస్ట్ చెయ్యరు కానీ బీజేపీ నేతల హౌస్ అరెస్ట్ లా? బండి సంజయ్ ఫైర్
ఇదే సమయంలో ఇండ్లు ముట్టడించాల్సిన అవసరం పోలీసులకు ఎందుకొచ్చింది..? అంటూ ప్రశ్నించారు బండి సంజయ్. రేపిస్టులను అరెస్టులు చేయడం చేతకాదు కాని, పోలీసులు బిజెపి నాయకుల ఇండ్లను ముట్టడించడం ఏంటి..? అంటూ మండిపడ్డారు. రాజకీయ పార్టీలు ఇండ్లు ముట్టడించడం చూశాం.. కాని, పోలీసులే ఇలా ఇండ్లను ముట్టడించడం టీఆర్ఎస్ హయాంలోనే చూస్తున్నాం అంటూ బండి సంజయ్ టిఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇదే పోలీసు ఫోర్స్ రేపిస్టులను, క్రిమినల్స్ ను కట్టడి చేస్తే బాగుంటుంది. శాంతి భద్రతల సమస్య ఉండదు అని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్భందాలు, అరెస్టులు, కేసులతో తెలంగాణ బిజెపి సాగిస్తున్న ఉద్యమాన్ని ఆపలేరని బండి సంజయ్ తేల్చిచెప్పారు.