
పాఠాలు చెప్పే ఆచార్యులే గుణపాఠాలు కూడా నేర్పుతారు.!ఆస్తుల జీవో వెనక్కి తీసుకోవాలన్న బీజేపి.!
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులను ఈ రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోందన్నారు బీజేపీ శాసన సభా పక్ష నాయకుడు, రాజాసింగ్. టీచర్లతో సహా, విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దొంగల మాదిరిగా చూస్తున్నారని మండిపడ్డారు.ఉపాధ్యాయులతో సహా విద్యాశాఖలో పనిచేస్తున్నఉద్యోగుల ఆర్థిక వివరాలు ఇవ్వాలని తాజాగా పాఠశాల విద్యాశాఖ ప్రొసీడింగ్స్ ఇవ్వడం కక్ష్యసాధింపులో భాగంగానే తాను భావిస్తున్నానన్నారు రాజాసింగ్. ఉపాధ్యాయుల ప్రాపర్టీ స్టేట్ మెంట్ కోరుతున్న ప్రభుత్వం ముందుగా సీఎంతో సహా మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రాపర్టి స్టేట్ మెంట్ ముందుగా ఇవ్వాలని డిమాండ్ చేసారు.

టీచర్లను వేధించేందుకే జీవో.. ఉపసంహరించుకోవాలన్న రాజాసింగ్
అంతే కాకుండా టీచర్లను వేధించేందుకే ఈ ఆదేశాలిచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్. 317 జీవోతో ప్రభుత్వం చేపట్టిన బదిలీ ప్రక్రియను కొందరు టీచర్లు వ్యతిరేకించినందు వల్లనే రాష్ట్ర ప్రభుత్వం వాళ్లపై కక్షసాధిస్తోందని ఘాటు విమర్శలు చేసారు. 2014 లో ఈ ప్రభుత్వం రాకముందు టీఆర్ఎస్ నాయకుల ఆస్థులు, నేడు వాళ్ల ఆస్తుల్ని ముందుగా ప్రకటించాలన్నారు రాజాసింగ్. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సహించాల్సింది పోయి ఏవో రూల్స్ చెబుతూ వేధిస్తారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పభుత్వం వచ్చాక సర్కారీ బడుల్లో విద్యను పుర్తిగా ధ్వంసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసారు రాజాసింగ్.

మంత్రులు,ఎమ్మెల్యేల అవినీతిపై చర్యలు తీసుకోండి.. ప్రభుత్వానికి బీజేపి సూచన
గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యికి పైగా పాఠశాలల్ని మూసేసిన ఘనత ఈ తెలంగాణ ప్రభుత్వానిదని రాజాసింగ్ ధ్వజమెత్తారు. ఇక మిగిలన పాఠశాల్లో పనిచేసే ఉపాధ్యాయుల్ని కూడా భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. అవినీతికి ఆస్కారం ఉన్న శాఖలు ఏంటో ప్రభుత్వానికి తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. వేల కోట్ల అవినీతి జరుగుతుందన్న ఆరోపణలున్న శాఖలపై ఈ ప్రభుత్వం ఎందుకు దృష్టిపెట్టలేదని రాజాసింగ్ నిలదీసారు. ఆ అవినీతిలో ప్రభుత్వ పెద్దలకు వాటాలు అందుతున్నాయన్న విమర్శలకు ఏం సమాధానం చెబుతారని దుయ్యబట్టారు రాజాసింగ్.

ప్రభుత్వ జీవో హాస్యాస్పదం.. కక్ష్య సాధింపులో భాగమేనన్న బీజేపి ఎమ్మెల్యే
గులాబీ ప్రభుత్వానికి దమ్ముంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆస్థుల వివరాలను ముందుగా ప్రకటించాలని డిమాండ్ చేసారు. ఉపాధ్యాయులతో పెట్టుకున్న ప్రభుత్వాలు తమ మనుగడ సాగించలేవన్న చరిత్రను గుర్తుచేసుకోవాలని రాజాసింగ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉపాధ్యాయులు ఏటా ప్రభుత్వానికి ఆస్తుల వివరాలు సమర్పించాలని, ఇకపై స్థిర, చరాస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు రాజాసింగ్.

ప్రజలను పీడించి సొమ్ము చేసుకునే అవకాశం లేని ఉద్యోగం.. కేసీఆర్ కు ఎందుకంత పంతం అన్న రాజాసింగ్
మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ఉద్యోగుల్లో అవినీతికి ఎవరు పాల్పడినా ఉపేక్షించాల్సిన అవసరం లేదన్నారు రాజాసింగ్. వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. కానీ టీచర్లపై మాత్రమే కక్ష కట్టినట్లుగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు రాజాసింగ్. విద్యార్థులకు పాఠాలు బోధించడమే ఉపాధ్యాయుల విధి అని, అవినీతికి పాల్పడే, ప్రజలను పీడించి సొమ్ము చేసుకునే అవకాశం లేని ఉద్యోగం వారిదన్నారు. ఒకవేళ విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని, అట్లా కాకుండా ఉపాధ్యాయులపై కక్ష కట్టినట్లుగా ఆదేశాలు జారీ చేయడం అన్యాయమన్నారు రాజాసింగ్. జీవో ఉపసంహరించుకోకపోతే పాఠాలు చెప్పే ఆచార్యులే గుణపాఠాలు చెప్తారని రాజాసింగ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు