పెళ్లి పత్రికలను పంచబోతూ .. తిరిగిరాని లోకాలకు ...
పెద్దపల్లి : మరో పదకొండు రోజుల్లో పెళ్లి .. పనుల్లో అందరూ బిజీగా ఉన్నారు. తన స్నేహితులకు స్వయంగా పత్రిక ఇద్దామని పెళ్లికూతురు వెళ్లింది. అయితే అలా వెళ్లడమే పాపమైపోయింది. లారీ రూపంలో మృత్యువు కబళించింది. పెళ్లింట చావు బాజ మోగడంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ కూతురు లేదనే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

పత్రికలను పంచబోయి ..
పెద్దపల్లి జిల్లా సూల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన పద్మ తిరుపతి భార్యభర్తలు. వీరి కూతురు హారిక, ఆమె పెళ్లి ఈ నెల 26న నిశ్చయమైంది. తన పెళ్లి పత్రికలను పంచేందుకు హారిక తన సోదరుడితో కలిసి వెళ్లింది. వారి బైక్ ఓదెల మండలం కొలనూరు వెళ్లి తిరిగివస్తోండగా ప్రమాదానికి గురయ్యారు. రేగడమద్దికుంట శివారులో వెనుక నంచి వచ్చన లారీ బైక్ను ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలతో హరిక అక్కడికక్కడే మృతిచెందింది. కిరణ్కు గాయాలు కావడంతో దగ్గరిలోని ఆస్పత్రిలో చేర్పించారు.
వెంటాడిన మృత్యువు
మరికొన్నిరోజుల్లో పెళ్లి జరుగుతుందనగా ప్రమాదం జరుగడంతో ఆ కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. తమ కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిందనే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటు పెళ్లికొడుకు ఫ్యామిలీ మెంబర్స్ కూడా షాక్ గురయ్యారు. ప్రమాద వార్త తెలిసి కన్నీటి పర్యంతమయ్యారు. స్థానికులు, బంధువులు కూడా గుండెలవిసేలా రోదిస్తున్నారు. పెళ్లికూతురు తల్లిదండ్రులను ఆపడం ఎవరితరం కాలేదు.